రెండేళ్ల గరిష్టానికి తయారీ రంగం: హెచ్‌ఎస్‌బీసీ
న్యూఢిల్లీ: భారత్ తయారీ రంగం డిసెంబర్‌లో మంచి పనితీరును ప్రదర్శించిందని హెచ్‌ఎస్‌బీసీ సర్వే శుక్రవారం పేర్కొంది. దేశం నుంచి అలాగే విదేశాల నుంచి పటిష్టమైన ఆర్డర్లతో రెండేళ్ల గరిష్టానికి తయారీ రంగం ఉత్పత్తి పెరిగిందని హెచ్‌ఎస్‌బీసీ ఇండియా చీఫ్ ఎకనమిస్ట్ ప్రన్జుల్ భండారీ పేర్కొన్నారు. డిసెంబర్‌లో తయారీ రంగం ఉత్పత్తికి సంబంధించి హెచ్‌ఎస్‌బీసీ ఇండియా పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) 54.5 వద్ద ఉంది.
ఈ సూచీ పాయింట్లు నవంబర్‌లో 53.3. గత 14 నెలలుగా తయారీ రంగం ఉత్పత్తి పెరుగుతూ వస్తోంది. హెచ్‌ఎస్‌బీసీ పీఎంఐ 50 పైన ఉంటే దానిని వృద్ధికి సంకేతంగా పరిగణిస్తారు. ఆ దిగువన నమోదయితే క్షీణతగా ఆ సంస్థ పరిగణిస్తుంది. ద్రవ్యోల్బణం తగ్గుదల సానుకూల ధోరణి సైతం తయారీ రంగానికి దోహదపడిందని హెచ్‌ఎస్‌బీసీ వర్గాలు వివరించాయి. ద్రవ్యోల్బణం దిగువ స్థాయిలో కొనసాగుతున్న పక్షంలో 2015లో రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) కీలక వడ్డీ రేటును తగ్గించే అవకాశం ఉందని భండారీ అన్నారు.