
న్యూఢిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అక్రమంగా తన ఆస్తులను అటాచ్ చేసిందని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) భారీ రుణ కుంభకోణ నిందితుడు మేహుల్ చోక్సీ ఆరోపించారు. తాను ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని ఆయన వెల్లడించారు. ఆంటిగ్వా నుంచి పంపిన తొలి వీడియో మేసేజ్‌లో ఆయన ఈ విషయాలు పేర్కొన్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు చెందిన రూ.13,500 కోట్ల రుణ కుంభకోణంలో ప్రధాన వ్యక్తుల్లో ఒకరిగా అనుమానిస్తున్న మేహుల్ చోక్సీకి వ్యతిరేకంగా రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.
చోక్సీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంలో...ఎలాంటి వివరణ లేకుండానే తన పాస్‌పోర్ట్‌ను సస్పెండ్ చేశారని ఆయన పేర్కొన్నారు. ఈడీ తనకు వ్యతిరేకంగా చేసిన ఆరోపణలన్నీ తప్పు అని, నిరాధారమైనవని ఆయన వివరించారు. తన ఆస్తులను అక్రమంగా అటాచ్ చేశారని ఆరోపించారు. భారత భద్రతకు ముప్పు వాటిల్లుతుందనే ఉద్దేశంతో తన పాస్‌పోర్ట్‌ను రద్దు చేస్తున్నట్లు పాస్‌పోర్ట్ ఆఫీస్ నుంచి తనకొక ఈ మెయిల్ వచ్చిందని వివరించారు. తన పాస్‌పోర్ట్‌పై విధించిన సస్పెన్షన్‌ను తొలగించాల్సిందని కోరుతూ ముంబై ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయానికి ఒక మెయిల్ పంపానని, దానికి ఎలాంటి సమాధానం రాలేదని తెలిపారు.