విండోస్ 10 ఉచిత ట్రయల్ ప్యాకేజీ
శాన్‌ఫ్రాన్సిస్కో: కార్యాలయాల్లో పెద్ద మొత్తంలో వాడే కంప్యూటర్లకు విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌ని 90 రోజుల పాటు ఉచిత ట్రయల్ వెర్షన్ ఇచ్చేందుకు మైక్రోసాప్ట్ ముందుకొచ్చింది. ఈ సంస్థ బుధవారం విండోస్ 10ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. వ్యక్తిగత ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లకు ఉచిత అప్‌గ్రేడ్‌ని ఇచ్చిన ఆ సంస్థ కార్యాలయాల్లో వినియోగానికి మాత్రం ఉచిత అప్‌గ్రేడ్‌ని ఇవ్వలేదు. లెసైన్స్ ఫీజు చెల్లించి ఎంటర్‌ప్రెన్యూర్‌వర్షన్‌ను కోనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి సంస్థల కోసం 90 రోజుల పాటు ఉచిత ట్రయల్ ప్యాకేజీని ప్రకటించింది.
మళ్లీ స్టార్ట్ మెనూ...
వాయిస్ ఆధారిత స్మార్ట్ అసిస్టెంట్ కోర్టానా, గేమింగ్ కోసం ఎక్స్‌బాక్స్ యాప్, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ స్థానంలో కొత్త వెబ్ బ్రౌజర్ 'మైక్రోసాఫ్ట్ ఎడ్జ్' మొదలైనవి కొత్త వెర్షన్లో ఉండే ఫీచర్లు. విండోస్ 7, అంతకు పూర్వపు వెర్షన్ల తరహాలోనే విండోస్ 10లో మళ్లీ స్టార్ట్ మెనూకి చోటు కల్పించారు. అలాగే ఫోటోలు, మ్యాప్స్, మ్యూజిక్, సినిమాల కోసం ప్రత్యేకంగా బిల్టిన్ యాప్స్ ఇందులో ఉన్నాయి. కోర్టానా ఫీచర్ మాత్రం భారత్‌లో అందుబాటులోకి రావడానికి మరికాస్త సమయం పడుతుంది.