ఈ నెల 29న విండోస్ 10 ఆవిష్కరణ
న్యూఢిల్లీ సహా 13 నగరాల్లో రిలీజ్ ఉచితంగా అప్‌గ్రేడ్ పరిమిత కాలానికే
న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన ఆపరేటింగ్ సిస్టమ్‌లో లేటెస్ట్ వెర్షన్, విండోస్ 10ను జులై 29న ప్రపంచవ్యాప్తంగా 13 నగరాల్లో ఆవిష్కరించనుంది. న్యూయార్క్ సిటీ, సిడ్నీ, టోక్యో, బీజింగ్ తదితర ఇతర నగరాలతో పాటు న్యూఢిల్లీ కూడా ఈ జాబితాలో ఉంది. ఇప్పటిదాకా ఉన్న విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లను ఉపయోగిస్తున్న వారు కొత్త వెర్షన్‌కు ఉచితంగా అప్‌గ్రేడ్ అయ్యేందుకు పరిమిత కాలం పాటు మైక్రోసాఫ్ట్ ఆఫర్ ఇస్తోంది. విండోస్ 8/8.1 లేదా 7 వెర్షన్‌ను ఉపయోగిస్తున్న డివైజ్‌లకు ఉచిత అప్‌గ్రేడ్ సదుపాయాన్ని కల్పిస్తోంది. పర్సనల్ కంప్యూటర్స్, ట్యాబ్లెట్స్, స్మార్ట్‌ఫోన్స్, ఇతర గ్యాడ్జెట్స్‌ను ఒకదానితో మరొకటి అనుసంధానించుకుని ఉపయోగించుకునేందుకు కొత్త వెర్షన్ ఉపయోగపడుతుంది.
కొత్త శకానికి నాంది...
పర్సనల్ కంప్యూటింగ్‌కు సంబంధించి విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం కొత్త శకానికి నాంది పలకగలదని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల చెప్పారు. ఫోన్స్ నుంచి మైక్రోసాఫ్ట్ తొలి హోలోగ్రాఫిక్ కంప్యూటర్ దాకా ప్రతి డివైజ్ పైనా ఇది పనిచేస్తుందని మైక్రోసాఫ్ట్ వరల్డ్‌వైడ్ పార్ట్‌నర్ కాన్ఫరెన్స్ 2015లో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు. పర్సనల్ కంప్యూటింగ్, ఉత్పాదకతను పెంచుకోవడం, మరింత మెరుగైన క్లౌడ్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించడమనే మూడు అంశాలపై మైక్రోసాఫ్ట్ ప్రధానంగా దృష్టి సారిస్తోందని నాదెళ్ల పేర్కొన్నారు. కంపెనీపరమైన కొత్త ప్రణాళికల గురించి వ్యాపార భాగస్వాములకు వివరించేందుకు మైక్రోసాఫ్ట్ ఏటా పార్ట్‌నర్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తుంది.