
ట్రంప్‌పై ఆందోళన లేదు
• అమెరికాలోనే ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తున్నాం
• మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల వ్యాఖ్యలు
బెర్లిన్: అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక కారణంగా తమ నియామకాల ప్రణాళికలపై పెద్దగా ప్రభావాలేమీ ఉండబోవని ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తెలిపారు. అమెరికా కేంద్రంగా పనిచేసే తమ కంపెనీ అత్యధికంగా అమెరికాలోనే ఉద్యోగాలు కల్పిస్తోందని, ఇకపైనా ఇదే తీరు కొనసాగించగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అమెరికన్ కంపెనీలు నియామకాల్లో స్థానికులను పక్కన పెట్టి విదేశీయులకు పెద్ద పీట వేస్తున్నాయంటూ ట్రంప్ విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నాదెళ్ల వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
బాధ్యతాయుతమైన అమెరికన్ కంపెనీగా మైక్రోసాఫ్ట్ అమెరికాలో అత్యధిక వేతనాల కొలువులు అనేకం కల్పించినట్లు నాదెళ్ల వివరించారు. ట్రంప్ ఎన్నికతో తమ ప్రణాళికల్లో పెద్దగా మార్పులేమీ లేవని డీఎల్‌డీ టెక్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సందర్భంగా చెప్పారు. మైక్రోసాఫ్ట్‌కి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 1,13,000 మంది పైచిలుకు ఉద్యోగులు ఉండగా.. వీరిలో 64,000 మంది అమెరికాలోనే ఉన్నారు. ట్రంప్ వ్యాఖ్యల దరిమిలా అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలు తాము కూడా మరిన్ని ఉద్యోగాలు కల్పించనున్నట్లు ఇటీవలే ప్రకటించాయి. రాబోయే ఏడాదిన్నర కాలంలో అమెరికాలో 1,00,000 పైచిలుకు ఉద్యోగాలు కొత్తగా కల్పించనున్నట్లు అమెజాన్ తెలిపింది. దీంతో అమెరికాలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,80,000కి చేరనుంది.