మల్టీప్లెక్స్లతో సినిమాకు కళ.. | miraj cinema md.amith sharma interview | Sakshi
Sakshi News home page

మల్టీప్లెక్స్లతో సినిమాకు కళ..

Published Sat, Jan 30 2016 4:15 PM | Last Updated on Sun, Sep 3 2017 4:34 PM

మల్టీప్లెక్స్లతో సినిమాకు కళ..

మల్టీప్లెక్స్లతో సినిమాకు కళ..

వీక్షకుల్లో 75 శాతం యువతే
అంతర్జాతీయ స్థాయిలో స్క్రీన్లు
మల్టీప్లెక్స్‌ల విజయానికి ఇవే కారణం

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రెండున్నర దశాబ్దాల క్రితం భారత్‌లో సినిమాయే ప్రధాన ఎంటర్‌టైన్‌మెంట్. తర్వాత టీవీలు రావటంతో సీరియళ్లు, వినోద కార్యక్రమాలు వరుస కట్టాయి. దీంతో థియేటర్లకు తాకిడి తగ్గింది. 2000వ సంవత్సరం నుంచి మల్టీప్లెక్స్‌లు పెరిగాయి. దీంతో తిరిగి సినిమా హాళ్లు కళకళలాడాయి... ఇదీ మల్టీప్లెక్స్‌ల నిర్వహణలో భారత్‌లో టాప్-5లో ఉన్న మిరాజ్ సినిమాస్ ఎండీ అమిత్ శర్మ మాట.

వీక్షకులకు వినూత్న అనుభూతి, ఇతర సౌకర్యాలు ఉండటం వల్లే మల్టీప్లెక్స్‌లు విజయవంతమవుతున్నాయని చెప్పారాయన. హైదరాబాద్ కొత్తపేటలో  కంపెనీ తొలి థీమ్ ఆధారిత థియేటర్‌ను ప్రారంభించిన సందర్భంగా ‘సాక్షి బిజినెస్ బ్యూరో’తో మాట్లాడారు. పరిశ్రమ తీరుతెన్నుల గురించి ఈ సందర్భంగా వివరించారు.

 విశేషాలు ఇవీ..
మల్టీప్లెక్స్‌ల విజయానికి కారణాలేంటి?

ఒకే స్క్రీన్‌తో 1,200 దాకా సీట్లున్న థియేటర్లున్నాయి. వీటిల్లో రోజులో మూడు నాలుగు షోలే వేస్తారు. మల్టీప్లెక్సుల్లో ఇప్పుడు 150-200 సీట్లున్న స్క్రీన్లు ఏర్పాటవుతున్నాయి. 8 స్క్రీన్లున్న మల్టీప్లెక్స్ అయితే 15 నిముషాలకో షో వేయొచ్చు. అంటే థియేటర్‌కు ఏ సమయంలో వచ్చినా సినిమా చూసే వీలుంటుందన్న మాట.

వీక్షకులు అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు, అనుభూతి కోరుకుంటున్నారు. కట్టిపడేసేలా ఖరీదైన విదేశీ సీట్లు, అత్యాధునిక సౌండ్ సిస్టమ్ ఉంటోంది. టీ, కూల్‌డ్రింక్స్, సమోసా, పాప్‌కార్న్ వంటివి గతం. ఇప్పుడు బర్గర్స్, పిజ్జా, పాస్తా వంటి వందలాది ఆహార పదార్థాలు మల్టీప్లెక్సుల్లో కొలువుదీరుతున్నాయి. ఇక వీక్షకుల్లో 75 శాతం మంది 15-35 ఏళ్ల యువతే. దూరమైనా సరే మంచి థియేటర్‌కే వెళ్తున్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సగటున 20 శాతం సీట్లు (ఆక్యుపెన్సీ) నిండితే, మల్టీప్లెక్సులో ఇది 35 శాతం దాకా ఉంటోంది.

 తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితెలా ఉంది?
ఇక్కడ తెలుగుతోపాటు హిందీ, ఇంగ్లీషు సినిమాలనూ చూస్తారు. అందుకే ఇక్కడి మల్టీప్లెక్సుల్లో ఆక్యుపెన్సీ 40 శాతానికి పైగా ఉంటోంది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో సహా దక్షిణాది వీక్షకుల్లో 40 శాతం మంది ఆన్‌లైన్లో టికె ట్లు కొనుగోలు చేస్తున్నారు. ఉత్తరాదిన ఇది 15-20 శాతమే. థియేటర్లో ఫుడ్ కోసం ఒక్కో వ్యక్తి సగటున రూ.80 దాకా ఖర్చు చేస్తున్నారు. తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల ధరపై నియంత్రణ ఉండడం ఒక్కటే సమస్య. సాధారణ సీటుకు రూ.150, రెక్లైనర్స్‌కు రూ.250 మించకూడదు. మల్టీప్లెక్సుల నిర్మాణం ఖరీదైన అంశం. సాధారణ థియేటర్‌తో వీటిని పోల్చలేం. ఇతర నగరాల్లో అయితే సినిమానుబట్టి సీటుకు రూ.2 వేల దాకా చార్జీ చేసిన సందర్భాలున్నాయి.

 భారత్‌లో స్క్రీన్ల పెరుగుదల ఎలా ఉంది?
దేశంలో మల్టీప్లెక్సుల్లో 2,000 స్క్రీన్లున్నాయి. దుబాయిని మించి థియేటర్లు ఇక్కడున్నాయి. పుణేలో 14 స్క్రీన్లున్న మల్టీప్లెక్స్ కూడా ఉంది. ఏటా 300 స్క్రీన్లు జతకూడుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో సుమారు 75 స్క్రీన్లున్నాయి. ఒకో స్క్రీన్‌కు ఎంత కాదన్నా రూ.1.5 కోట్ల దాకా ఖర్చవుతోంది. స్థలం, భవన నిర్మాణ వ్యయం అదనం. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకూ మల్టీప్లెక్సులు విస్తరించాయి. భారత్‌లో ఈ రంగంలో వ్యాపార అవకాశాలు చాలా ఉన్నాయి.

మిరాజ్ సినిమాస్ ప్రస్తుతం 55 స్క్రీన్లను నిర్వహిస్తోంది. 2017 మార్చికల్లా 46 స్క్రీన్లు జోడిస్తున్నాం. దీంతో మొత్తం సీట్ల సంఖ్య 28 వేలకు చేరుతుంది. వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, వైజాగ్‌కు విస్తరిస్తున్నాం. విమానాశ్రయం థీమ్‌తో థియేటర్‌ను ఏర్పాటు చేయనున్నాం. కంపెనీకి తెలంగాణలో తొలి కేంద్రమైన దిల్‌సుఖ్‌నగర్ థియేటర్‌ను యూరప్ వీధులను పోలిన డిజైన్ థీమ్‌తో నిర్మించాం. దేశవ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లు 7,000 దాకా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement