ఫ్రీచార్జ్‌పై మొబిక్విక్ కన్ను
► విలీనంపై ప్రాథమిక స్థాయిలో చర్చలు
► 1 బిలియన్ డాలర్లుగా విలీన కంపెనీ విలువ
న్యూఢిల్లీ: ఈ–వాలెట్ కంపెనీ ఫ్రీచార్జ్ కొనుగోలుపై పోటీ సంస్థ మొబిక్విక్ దృష్టి పెట్టింది. రెండింటి మధ్య విలీన చర్చలు ప్రస్తుతం ప్రాథమిక స్థాయిలో ఉన్నట్లు సమాచారం. వేర్వేరుగా చూస్తే రెండు సంస్థల విలువ చెరో 300 మిలియన్ డాలర్లుగా ఉండొచ్చని.. ఒకవేళ డీల్ కానీ పూర్తయిన పక్షంలో విలీన కంపెనీ విలువ సుమారు 700 మిలియన్ డాలర్ల నుంచి 1 బిలియన్ డాలర్ల దాకా ఉండగలదని పరిశ్రమవర్గాల అంచనా. అలాగే, భారత మార్కెట్లో ప్రవేశించాలని ఆసక్తిగా ఉన్న ఓ చైనా ఇన్వెస్టరు.. ఈ సంస్థలోకి సుమారు 200 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయడానికి సంసిధ్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని బ్యాంకులు కూడా ఆసక్తిగా ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మొబిక్విక్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్, పేటీఎం కూడా ఫ్రీచార్జ్ కొనుగోలుపై ఆసక్తిగా ఉన్నాయి.
ఫ్రీచార్జ్‌ను విక్రయించేందుకు గత కొన్నాళ్లుగా కంపెనీ సీఈవో జేసన్ కొఠారి ప్రయత్నిస్తున్నారు. అమెరికా, చైనాకు చెందిన పలువురు ఇన్వెస్టర్లతో కూడా చర్చలు జరిపారు. ఫ్రీచార్జ్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు పేపాల్ ఆసక్తి వ్యక్తం చేసినప్పటికీ.. అది సాధ్యపడలేదు. ఈ నేపథ్యంలో తాజాగా మొబిక్విక్, ఫ్రీచార్జ్ మధ్య విలీన చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సెకోయా క్యాపిటల్ ఈ రెండు సంస్థల్లోనూ ఇన్వెస్ట్ చేసింది. దేశవ్యాప్తంగా కొత్తగా 13 కార్యాలయాలు ప్రారంభించిన మొబిక్విక్.. సుమారు వెయ్యి మందికి పైగా ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంది. రూ. 1,000 కోట్లు పైగా సమీకరించే ప్రయత్నాల్లో భాగంగా పలు బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్‌తో చర్చలు జరుపుతోంది. ఏప్రిల్ నెలాఖరు లేదా మే ప్రారంభంలో నిధులు అందవచ్చని అంచనా.