
2020 నాటికి 50 బిలియన్ డాలర్లకు భారత్ ఈ-కామర్స్!
భారత్‌లో ఈ-కామర్స్ మార్కెట్ పరిమాణం 2020 నాటికి 40-50 బిలియన్ డాలర్లకు చేరనున్నది. ప్రస్తుతం ఇది 8-12 బిలియన్ డాలర్లుగా ఉంది.
ముంబై: భారత్‌లో ఈ-కామర్స్ మార్కెట్ పరిమాణం 2020 నాటికి 40-50 బిలియన్ డాలర్లకు చేరనున్నది. ప్రస్తుతం ఇది 8-12 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇదే సమయంలో ఈ-కామర్స్ మార్కెట్‌లో ట్రావెల్ విభాగం 60 శాతం వాటాను, ఎలక్ట్రానిక్స్ 30 శాతం వాటాను ఆక్రమించే అవకాశముంది. ఈ విషయాలు బోస్టాన్ కన్సల్టింగ్ గ్రూప్, రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాల సంయుక్త నివేదికలో వెల్లడయ్యాయి. నివేదిక ప్రకారం.. డిజిటల్ రిటైల్ వృద్ధి ప్రధానంగా ఇంటర్నెట్ యూజర్ల సంఖ్యపై ఆధారపడి ఉంటుందని, ప్రస్తుతం 26 కోట్లుగా ఉన్న యూజర్ల సంఖ్య 2020 నాటికి 65 కోట్లకు పెరిగే అవకాశముంది. ఇదే సమయంలో పట్టణ ప్రాంత యూజర్లు 12 కోట్లకు చేరవచ్చు. అలాగే మహిళా యూజర్ల వాటా కూడా 29 శాతం నుంచి 40 శాతానికి పెరిగే అవకాశం ఉంది.