అన్నీ మంచి ఆర్థిక శకునములే..!
భారత్‌పై అంతర్జాతీయ క్రెడిట్, ఫైనాన్షియల్ దిగ్గజ సంస్థల అంచనాలు
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థపై భరోసాను కల్పించే అంచనాలను అంతర్జాతీయ క్రెడిట్, ఫైనాన్షియల్ దిగ్గజ సంస్థలు వెలువరించాయి. వచ్చే కొద్ది సంవత్సరాలూ 8 శాతం వృద్ధి రేటు ఖాయమని ప్రముఖ రేటింగ్ సంస్థ ఎస్‌అండ్‌పీ తన ‘ఏపీఏసీ ఎకనమిక్ స్నాప్‌సార్ట్స్-సెప్టెంబర్ 2016’ నివేదికలో పేర్కొంది. ఇక బ్యాంకింగ్ మొండిబకాయిల భారం తగ్గుతున్నట్లు మూడీస్ అభిప్రాయపడింది. ఆర్థిక సేవల ప్రపంచ దిగ్గజ సంస్థ మోర్గాన్‌స్టాన్లీ తన తాజా నివేదికలో భారత్ క్రమ వృద్ధి బాటలో ఉందని వివరించింది. ఆయా సంస్థల అభిప్రాయాలు క్లుప్తంగా...
సంస్కరణల అమలు బలం: ఎస్ అండ్ పీ
భారత్‌కు పటిష్ట దేశీయ వినియోగం పెద్ద బలం. రానున్న కొద్ది సంవత్సరాలు 8% వృద్ధి సాధిస్తుందని అంచనావేస్తున్నాం. ముఖ్యంగా భారత్ చేపట్టిన వ్యవస్థాగత సంస్కరణలు కూడా వృద్ధి పథానికి బలం చేకూర్చుతున్నాయి. ఇటీవల పార్లమెంటు ఆమోదం పొందిన వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ) ఇక్కడ కీలకమైనది. ఇక ద్రవ్యోల్బణంపై ఒక కన్నేసి ఉంచాలి. ముఖ్యంగా ఆహారం, ఇంధనం, ధరల ఒడిదుడుకులు ఉండే ఇతర వస్తువుల విషయంలో ఆర్‌బీఐ అప్రమత్తత అవసరం. కాగా, 2016-17కు సంబంధించి ఆర్‌బీఐ వృద్ధి రేటు అంచనా 7.6%.
క్రమ వృద్ధి: మోర్గాన్ స్టాన్లీ
భారత్‌సహా పలు వర్థమాన దేశాల్లో క్రమ వృద్ధి నమోదవుతుంది. ఈ ఏడాది వర్థమాన దేశాల వృద్ధి రేటు 4 % కాగా వచ్చే ఏడాది ఆయా దేశాల వృద్ధి రేటు 4.7%గా ఉంటుందని భావిస్తున్నాం. వృద్ధి విషయంలో ప్రస్తుత స్థాయిల నుంచి భారత్, ఇండోనేషియాలు మరింత పురోగతి సాధించవచ్చు. అయితే చైనా, కొరియాల పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది.
బ్యాంకింగ్ బెటర్: మూడీస్
బ్యాంకింగ్ మొండిబకాయిల తీవ్రత తగ్గుతోంది. వచ్చే 12 నెలల నుంచి 18 నెలల మధ్య బ్యాంకింగ్ అవుట్‌లుక్ స్థిరపడవచ్చు. ఇటీవలి రుణ నాణ్యత గుర్తింపు (ఏక్యూఆర్), తగిన ప్రొవిజనింగ్ కేటాయింపులు కీలకమైనవి. 11 బ్యాంకుల అవుట్‌లుక్ పాజిటివ్‌గా ఉంది. మున్ముందు నికర వడ్డీ మార్జిన్లు (ఎన్‌ఐఎం)లు స్థిరపడే వీలుంది. అయితే రానున్న మూడేళ్లలో భారత్ ప్రభుత్వ రంగ బ్యాంకులకు మరింత మూలధనం అవసరం ఉంటుంది. రేటింగ్ (ప్రస్తుతం చెత్త శ్రేణికి ఒక అంచె ఎగువన ‘బీఏఏ3’) పెంపునకు సంబంధించి సెప్టెంబర్ 21న మూడీస్ ప్రతినిధులు, ఆర్థిక వ్యవహారాల శాఖ ఉన్నత స్థాయి అధికారుల మధ్య సమావేశం వార్తల నేపథ్యంలో ఈ నివేదిక వెలువడింది.