షం‘షేర్’.. ఎంఆర్‌ఎఫ్!
⇔ షేరు ధర @ రూ.63,350
⇔ భారత్‌లో అత్యంత ఖరీదైన షేర్ ఇదే
⇔ అమెజాన్, గూగుల్, యాపిల్ షేర్ల కంటే కూడా ఎక్కువే...
ఎంఆర్‌ఎఫ్ షేర్ ధర రూ.63,000 దాటింది. బుధవారం బీఎస్‌ఈలో ఈ షేర్ 1 శాతం లాభంతో రూ.63,350 వద్ద ముగిసింది. ఇది జీవిత కాల గరిష్ట స్థాయి. భారత స్టాక్ మార్కెట్‌లో ఇదే అత్యంత ఖరీదైన షేర్. ఫండమెంటల్స్ పటిష్టంగా ఉండటంతో గత 5–6 ఏళ్లలో ఈ షేర్ బాగా లాభపడింది. 2011, మార్చి 29న రూ.6,324గా ఉన్న ఈ కంపెనీ షేర్ గత ఏడాది సెప్టెంబర్‌లో రూ.50,000కు చేరింది. స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులున్నా, వ్యాపారంలో కూడా ఒడిదుడుకులు ఉన్నా ఈ షేర్ నిలకడగా పెరుగుతోంది. ముడి సరకు ధరలు పెరిగినా, తగ్గినా, అమ్మకాలు తగ్గినా, పెరిగినా, వాహన పరిశ్రమ స్థితిగతులతో నిమిత్తం లేకుండా ఈ షేర్ పెరుగుతూనే వస్తోంది.
పదేళ్లలో 50 రెట్లు!!
ఈ దశాబ్దం ప్రారంభం నుంచి చూస్తే, ఎంఆర్‌ఎఫ్ షేర్ 4,759 శాతం, లేదా 50 రెట్లు పెరిగి మార్చి 24 నాటికి రూ.59,184కు పెరిగింది. 2001, జనవరి 1న ఈ షేర్ ధర రూ.1,218. అదే ఏడాది అక్టోబర్ 9న ఈ షేర్ రూ.464 కనిష్ట స్థాయికి పడిపోయింది. గతేడాది జనవరి నుంచి ఈ ఏడాది మార్చి కాలానికి ఈ షేర్ రూ.40,546 నుంచి రూ.60,000కు ఎగసింది. మీరు కనుక 2001లో రూ.500 పెట్టి ఎంఆర్‌ఎఫ్ షేర్ కొనుగోలు చేశారనుకుందాం. ఇప్పుడు దాని విలువ రూ.63,350. 16 ఏళ్లలో 127 రెట్లు లేదా 12,570% పెరిగింది.
సరిగ్గా ఈ షేర్ ధర ఏడాది క్రితం రూ.36,781. అప్పటి నుంచి చూస్తే ఈ షేర్ ధర 72% పెరిగింది. ఇక ఈ ఏడాది రెండో తేదీన ఈ షేర్ ధర రూ.49,180గా ఉంది. అప్పటి నుంచి చూస్తే ఈ షేర్ ధర 29% ఎగబాకింది. గత నెల 27న ఈ కంపెనీ షేర్ రూ.60,000 (డాలర్ల పరంగా చూస్తే 924 డాలర్లు)ను దాటింది. భారత స్టాక్ మార్కెట్లో రెండో ఖరీదైన షేర్ ఐషర్ మోటార్స్ ధర రూ.25,500తో పోలిస్తే ఎంఆర్‌ఎఫ్ షేర్ ధర రెండు రెట్ల కంటే అధికం. ఇక అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజ షేర్లతో పోల్చినా.. అమెజాన్(856 డా లర్లు), గూగుల్(840 డాలర్లు), యాపిల్(143 డాలర్లు), ఎంఆర్‌ఎఫ్ షేర్ ధరే అధికంగా ఉంది.
రూ.14,000 పెట్టుబడులతో..
మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీగా (ఎంఆర్‌ఎఫ్) ఒక ఇంట్లోని పెరట్లో బొమ్మలు, గర్బనిరోధక ఉత్పత్తులతో 1946లో కార్యకలాపాలు ప్రారంభించిన ఈ కంపెనీ ఆ తర్వాత కాలంలో అతి పెద్ద భారత టైర్ల కంపెనీగా అవతరించింది. రూ.14,000 పెట్టుబడితో కెఎమ్ మమ్మెన్ మప్ఫిళై తన ఇంటిలో ఎంఆర్‌ఎఫ్‌ను ప్రారంభించారు. మొదట్లో ఈ కంపెనీ బెలూన్లు తయారు చేసేది.
ఆ తర్వాత గర్బనిరోధక ఉత్పత్తులు, బొమ్మలు, గ్లోవ్స్‌ను తయారు చేసింది. 1952లో ట్రెడ్ రబ్బర్ రంగంలోకి ప్రవేశించింది. 1961లో స్టాక్‌మార్కెట్లో లిస్టయింది. టైర్ల తయారీకి అమెరికాకు చెందిన మ్యాన్స్‌ఫీల్డ్ టైర్ అండ్ రబ్బర్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎనిమిది ప్లాంట్లలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 65 దేశాలకు ఎగుమతులు చేస్తోంది.
ఎందుకింత ధర ?
ఎంఆర్‌ఎఫ్–భారత్‌లో అతిపెద్ద టైర్ల కంపెనీ. పెయింట్స్, స్పోర్ట్స్ వస్తువులు, ర్యాలీ స్పోర్ట్స్, టాయ్స్ తదితర రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ షేర్ ధర ఇంతగా ఉండటానికి ప్రధాన కారణం. తక్కువ షేర్లు అందుబాటులో ఉండడమే. ట్రేడింగ్‌కు కేవలం 30 లక్షల షేర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని అంచనా... అదే టీసీఎస్ అయితే ట్రేడింగ్‌కు 196 కోట్ల షేర్లు అందుబాటులో ఉన్నాయి. ఫండమెంటల్స్ పటిష్టంగా ఉండడం కంపెనీకి కలిసొచ్చే మరో అంశం.
అమ్మకాల్లో వృద్ధి, మార్జిన్లు, రిటర్న్ ఆన్ ఈక్విటీ నిలకడగా వృద్ధి చెందుతున్నాయి. రీప్లేస్‌మెంట్ సెగ్మెంట్‌తో పాటు అన్ని రకాల టైర్ల సెగ్మెంట్ల టైర్లలో కంపెనీదే అగ్రస్థానం. అంతేకాకుండా ఇప్పటివరకూ ఈ షేర్‌ను కంపెనీ స్లి్పట్ (విభజన) చేయలేదు. దీనివల్ల తక్కువ మొత్తంలోనే షేర్లు ట్రేడింగ్‌కు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా షేర్ల విభజన జరిగితే షేర్ ధర అందరికీ అందుబాటులోకి వస్తుంది. షేర్ల సంఖ్య పెరుగుతుంది.