కార్ల రేట్ల మోతే..! | motor companys increase charges | Sakshi
Sakshi News home page

కార్ల రేట్ల మోతే..!

Published Thu, Dec 10 2015 1:07 AM | Last Updated on Sun, Sep 3 2017 1:44 PM

కార్ల రేట్ల మోతే..!

కార్ల రేట్ల మోతే..!

  • వచ్చే నెల నుంచి ధరలు పెంచుతున్న కంపెనీలు
  • 1-3 శాతం దాకా పెరుగుదల  లిస్టులో హ్యుందాయ్, టయోటా, మెర్సిడెస్
  • ముడివస్తువుల వ్యయాలు పెరగడం, కరెన్సీ హెచ్చుతగ్గులే కారణం

  • న్యూఢిల్లీ: కొద్ది నెలలుగా కార్ల అమ్మకాలు పుంజుకోవడంతో ఊపిరి తీసుకుంటున్న వాహనాల కంపెనీలు తాజాగా ధరలను పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. జనవరి నుంచి 1-3 శాతం శ్రేణిలో రేట్లు పెంచబోతున్నాయి. ఇప్పటికే హ్యుందాయ్, టయోటా, మెర్సిడెస్, బీఎండబ్ల్యూ తదితర సంస్థలు ధరల పెరుగుదల విషయాన్ని ప్రకటించాయి. ఒకవైపు ముడివస్తువుల వ్యయాలు పెరిగిపోవడం, మరోవైపు కరెన్సీ మారక విలువలు గణనీయంగా హెచ్చుతగ్గులకు లోనవుతుండటమే ఇందుకు కారణమని చెబుతున్నాయి.

    ఎలీట్, క్రెటా మోడల్స్ తప్ప మిగతా అన్ని కార్ల ధరలు వచ్చే నెల నుంచి రూ. 30,000 దాకా పెంచనున్నట్లు హ్యుందాయ్ మోటార్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాకేశ్ శ్రీవాస్తవ తెలిపారు. ప్రస్తుతం కంపెనీ వివిధ విభాగాల్లో దేశీయంగా గ్రాండ్ ఐ10, ఎక్సెంట్, వెర్నా తదితర తొమ్మిది కార్ల మోడల్స్‌ను విక్రయిస్తోంది. వీటి ధరలు రూ. 3.10లక్షల నుంచి రూ. 30.41 లక్షల (ఢిల్లీ ఎక్స్‌షోరూం) దాకా ఉన్నాయి. అటు టయోటా తమ కార్ల రేట్లను 3 శాతం దాకా పెంచనున్నట్లు తెలిపింది. అయితే, ఏ కారుపై ఎంత పెంచనున్నదీ ఇంకా నిర్ణయించలేదని వెల్లడించింది. ముడి వస్తువుల రేట్ల పెరుగుదలను కొనుగోలుదారులపై మోపకుండా చాలాకాలంగా కంపెనీ భరిస్తూనే ఉందని, కానీ ప్రస్తుతం రేట్లు పెంచక తప్పని పరిస్థితి నెలకొందని టయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం) డెరైక్టర్ ఎన్ రాజా తెలిపారు. టీకేఎం ప్రస్తుతం లివా, ల్యాండ్ క్రూయిజర్ తదితర వాహనాలను విక్రయిస్తోంది. వీటి రేట్లు రూ. 5 లక్షల నుంచి రూ. 1.29 కోట్ల (ఢిల్లీ ఎక్స్‌షోరూం) దాకా ఉన్నాయి.

     అదే బాటలో నిస్సాన్, స్కోడా..
     మిగతా కార్ల కంపెనీల బాటలోనే నిస్సాన్, స్కోడా కూడా వచ్చే నెల రేట్లు పెంచాలని నిర్ణయించాయి. హోండా కార్స్ ఇండియా, రెనో ఇండియా ప్రస్తుతం పెంపు పరిమాణంపై కసరత్తు చేస్తున్నాయి. తాము సైతం పెంచబోతున్నట్లు జర్మనీ లగ్జరీ కార్ల సంస్థ ఆడి కూడా సూచనప్రాయంగా తెలిపింది. ఇక, మెర్సిడెస్-బెంజ్ అన్ని మోడల్స్‌పైనా జనవరి 1 నుంచి రేట్లను 2 శాతం దాకా పెంచనున్నట్లు వెల్లడించింది. కారు కల సాకారం చేసుకోవాలనుకునే వారికి తోడ్పడేందుకు స్టార్ ఫైనాన్స్, స్టార్ ఎజిలిటీ, స్టార్ లీజ్ తదితర విభాగాల ద్వారా సర్వీసులు అందిస్తున్నామని, రేట్లు పెరిగినా కొనుగోలుదారులు వీటి ద్వారా ప్రయోజనాలు పొందవచ్చని మెర్సిడెస్-బెంజ్ ఇండియా ఎండీ రోలాండ్ ఫోల్గర్ పేర్కొన్నారు. అటు మరో లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ సైతం జనవరి నుంచి 3 శాతం దాకా రేట్లు పెంచనున్నట్లు ప్రకటించింది. సాధారణంగానే కార్ల కంపెనీలు జనవరిలో ధరలు పెంచుతుంటాయని ఆటోమొబైల్ పరిశ్రమ విశ్లేషకులు వివరించారు.

       ప్రస్తుతానికి డిస్కౌంట్ల వెల్లువ..
     వచ్చే నెల నుంచి రేట్ల పెంపు ఎలా ఉన్నప్పటికీ.. ప్రస్తుతానికి మాత్రం కార్ల కంపెనీలు డిస్కౌంట్లు కొనసాగిస్తున్నాయి. మారుతీ సుజుకీ ఆల్టోపై రూ. 25,000, సెలీరియోపై రూ. 15,000, వ్యాగన్‌ఆర్.. ఎర్టిగాలపై రూ. 10,000 మేర నగదు డిస్కౌంట్లు ఇస్తోంది. ఆగస్టులో ప్రవేశపెట్టిన ఎస్-క్రాస్‌పైనా ఇస్తోంది. ఇప్పటికే మారుతీ కారు ఉన్నవారిఇక లాయల్టీ బోనస్ అందిస్తోంది. గత నెలతో పోలిస్తే వివిధ మోడల్స్‌పై కంపెనీ ఇచ్చే డిస్కౌంట్లు రూ. 5,000-రూ.10,000 దాకా పెరిగాయని సంస్థ డీలర్లు వెల్లడించారు. ఇక, పోటీ సంస్థ హ్యుందాయ్ పలు మోడల్స్‌పై గిఫ్ట్ చెక్‌లు, ఉచిత బీమా ఆఫర్లు ఇస్తోంది. ఇయాన్‌పై రూ. 20,500, ఐ10పై రూ. 14,000, గ్రాండ్ మీద రూ. 8,000-10,000, ఎక్సెంట్ పై రూ. 5,000-7,500 మేర గిఫ్ట్ చెక్‌లు అందిస్తోంది. వెర్నా, ఎలాంట్రా సెడాన్ కార్లపైన రూ. 20,000 గిఫ్ట్ చెక్ ఇస్తోంది హ్యుందాయ్. ఇదే బాటలో హోండా, మహీంద్రా, నిస్సాన్ తదితర సంస్థలు కూడా భారీ ఆఫర్లు అందిస్తున్నాయి.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement