స్పీడు పెంచనున్న ఆటోరంగం | Automakers firm up growth plans for 2021 with cautious optimism | Sakshi
Sakshi News home page

స్పీడు పెంచనున్న ఆటోరంగం

Published Tue, Jan 5 2021 6:11 AM | Last Updated on Tue, Jan 5 2021 6:11 AM

Automakers firm up growth plans for 2021 with cautious optimism - Sakshi

న్యూఢిల్లీ: గతేడాది కష్టకాలంగా గడిచినప్పటికీ కొత్త ఏడాదిపై ఆటోమొబైల్‌ కంపెనీలు కాస్త ఆశావహంగా ఉన్నాయి. సరఫరా వ్యవస్థల సమస్యలు వంటి సవాళ్లు ఉన్నప్పటికీ .. వృద్ధి ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాయి. కియా మోటర్స్‌ ఉత్పత్తి పెంచుకోనుండగా.. టయోటా కొంగొత్త ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. ఇక హ్యుందాయ్‌ మరిన్ని కొత్త ఆవిష్కరణలను పరిచయం చేయడంపై దృష్టి పెడుతోంది. ‘కొత్త ఏడాదిలో మా తయారీ ప్లాంటులో షిఫ్టులను మూడుకు పెంచుకోనున్నాం. అలాగే కొనుగోలుదారులకు సురక్షితమైన అనుభూతినిచ్చేందుకు ‘ఫిజిటల్‌’ (ఆఫ్‌లైన్‌ స్టోర్స్, డిజిటల్‌) నెట్‌వర్క్‌ విధానాన్ని మరింతగా పటిష్టం చేసుకోనున్నాం’ అని కియా మోటర్స్‌ ఎండీ ఖూఖ్యున్‌ షిమ్‌ తెలిపారు. కరోనా పరమైన సవాళ్లు ఎదురైనప్పటికీ.. 2020లో రెండు కొత్త సెగ్మెంట్లలోకి ప్రవేశించగలిగామని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలోని కియా మోటర్స్‌ ప్లాంటు వార్షిక సామర్థ్యం 3 లక్షల యూనిట్లుగా ఉంది.

విద్యుత్‌ వాహనాలపైనా కసరత్తు ..
2021లో పెరిగే డిమాండ్‌కు, కస్టమర్ల అంచనాలకు అనుగుణంగా దశలవారీగా కొంగొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టనున్నట్లు టయోటా కిర్లోస్కర్‌ మోటర్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (సేల్స్, సర్వీస్‌ విభాగాలు) నవీన్‌ సోని తెలిపారు. అలాగే మధ్యకాలికం నుంచి దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా విద్యుత్‌ వాహనాల్లాంటి ప్రత్యామ్నాయాలపైనా దృష్టి పెట్టనున్నట్లు ఆయన వివరించారు. ఇక వాహనాల లీజింగ్‌ సర్వీసులను మరిన్ని నగరాలకు విస్తరించే యోచనలో ఉన్నట్లు సోని పేర్కొన్నారు. మరోవైపు, కార్యకలాపాలను పూర్తి స్థాయిలో విస్తరించిన తర్వాత నుంచి అమ్మకాల పరిమాణం క్రమంగా పెరిగిందని హోండా కార్స్‌ ఇండియా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజేష్‌ గోయల్‌ తెలిపారు.

విదేశాలకు ఐ20 ప్రీమియం కార్ల ఎగుమతులు: హ్యుందాయ్‌
ఆత్మ నిర్భర్‌ భారత్‌ నినాదానికి కట్టుబడి తమ సరికొత్త ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ కార్ల ఎగుమతులను ప్రారంభించినట్లు హ్యుందాయ్‌ మోటర్‌ ఇండియా లిమిటెడ్‌ తెలిపింది. మొదటి దఫా ఎగుమతుల్లో భాగంగా 180 ఐ20 మోడళ్లను దక్షిణాఫ్రికా, చిలీ, పెరూ దేశాలకు తరలించినట్లు కంపెనీ పేర్కొంది. గతేడాది నవంబర్‌లో అందుబాటులోకి వచ్చిన ఐ20 మోడల్‌ ధర ఎక్స్‌ షోరూం వద్ద రూ.6.79 – రూ.11.17 లక్షల మధ్య ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement