
టైర్ల షేర్ల పరుగులు!
⇒ భారత్‌ను వదిలి అమెరికావైపు చూస్తున్న చైనా కంపెనీలు...
⇒ దిగుమతులు తగ్గటంతో దేశీ కంపెనీల హవా
⇒ 25 శాతం పడిపోయిన రబ్బరు ధరలు
⇒ లాభాలు పెరుగుతాయన్న అంచనాలతో షేర్ల జోరు..
సాక్షి, బిజినెస్ విభాగం
టైర్ల షేర్లకు... రోడ్డు మునుపెన్నడూ లేనంత క్లియర్‌గా ఉన్నట్లుంది. మార్కెట్లో రయ్యిమని దూసుకుపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలానే మన మార్కెట్లు కూడా మంచి జోరుమీదుండటంతో... ఇతర రంగాల షేర్ల మాదిరిగా టైర్ల షేర్లు కూడా లాభపడుతున్నాయి. టైర్ల తయారీలో ఉపయోగించే రబ్బరు ధరలు బాగా తగ్గడం, చైనా నుంచి పోటీ తగ్గుతుండటం, డిమాండ్ పుంజుకుంటుండటం వంటివి టైర్ల షేర్లను మరింత ముందుకు తీసుకెళుతున్నాయి. పలితం... భవిష్యత్తులో కూడా వీటి లాభాలకు ఢోకా లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు.
చైనా నుంచి పోటీ తగ్గింది...
చైనా నుంచి టైర్ల దిగుమతులు ఈ మధ్య బాగా తగ్గాయి. దీనికితోడు రబ్బరు ధరలు పడిపోవడంతో టైర్ల కంపెనీల పంట పండుతోంది. చైనా టీబీఆర్ (ట్రక్, బస్, రేడియల్) టైర్లపై యాంటీ డంపింగ్ సుంకం విధించకూడదని అమెరికా నిర్ణయించింది. దీంతో చైనా కంపెనీలు ఇప్పుడు అమెరికా వైపు తమ టైర్ల ఎగుమతులను మళ్లిస్తున్నాయి. భారత్‌కు దిగుమతి అవుతున్న మొత్తం టీబీఆర్ టైర్లలో చైనా వాటా 90 శాతంగా ఉండేది. గత ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ కాలానికి చైనా నెలకు సగటున 1,20,000 టైర్లను భారత్‌కు ఎగుమతి చేసిందని అంచనా. అక్టోబర్‌లో 455 కంటైనర్ల టైర్లు చైనా నుంచి దిగుమతి కాగా, ఈ ఫిబ్రవరిలో ఈ కంటైనర్ల సంఖ్య 155కు తగ్గింది.
భారత్ కంటే అమెరికాకు ఎగుమతి చేస్తే అధిక లాభాలొస్తాయి కనక చైనా కంపెనీలకు ఇప్పుడు భారత్ కంటే అమెరికా మార్కెట్టే అకర్షణీయంగా కనిపిస్తోంది. అందుకే భారత్‌లో టైర్ల దిగుమతిదారులను నిరుత్సాహపరిచేందుకు భారత మార్కెట్‌కు ఎగుమతి చేసే టైర్ల ధరలను చైనా కంపెనీలు 10–15 శాతం వరకూ పెంచాయి. దీంతో చైనా టైర్ల దిగుమతులు మరింతగా తగ్గుతున్నాయి. ఫలితంగా చైనా టైర్ల నుంచి దేశీయ టైర్ల కంపెనీలకు పోటీ బాగా తగ్గుతోంది. ఇటీవలే కొన్ని భారత టైర్ల కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను 5 శాతం వరకూ పెంచాయి కూడా. ఈ నెలాఖరు కల్లా ధరలను 15 శాతం వరకూ పెంచుకోవాలని టైర్ల కంపెనీలు యోచిస్తున్నాయి.
రబ్బరు ధరలు 25 శాతం పతనం!
ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి చూస్తే రబ్బరు ధరలు 25 శాతం వరకూ తగ్గాయి. రబ్బర్ ఎగుమతి చేసే దేశాల్లో రబ్బరు నిల్వలు అపారంగా ఉన్నందున ఇప్పట్లో రబ్బరు ధరలు పెరిగే అవకాశాలు కూడా కనిపించటం లేదు. ఇది టైర్ల కంపెనీలకు సానుకూలమైన అంశం. మరోవైపు కొన్ని రేడియల్ టైర్లపై యాంటీ డంపింగ్ సుంకాన్ని విధించాలని ప్రభుత్వం యోచిస్తుండటం కూడా టైర్ల కంపెనీలకు కలసివస్తోంది.
లాభాలు కొనసాగుతాయ్...
ఇటీవల కాలంలో ఎంఆర్‌ఎఫ్, బాలకృష్ణ టైర్స్ కంపెనీల షేర్లు జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. ఎంఆర్‌ఎఫ్ షేర్ ఈ నెల 3న రూ.61,000కు చేరింది. భారత స్టాక్ మార్కెట్లో అత్యంత ఖరీదైన షేర్ ఇదే. ఇక సియట్, అపోలో టైర్స్, జేకే టైర్ అండ్ ఇండస్ట్రీస్ కంపెనీలు తమ జీవిత కాల గరిష్ట స్థాయిలకు 10–22% రేంజ్ దూరంలోనే ఉన్నాయి. చాలా టైర్ల కంపెనీల ఆదాయాలు రీప్లేస్‌మెంట్ మార్కెట్ నుంచే వస్తాయి. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు, ఆర్థిక వ్యవస్థ చక్రీయ ప్రభావం ఈ రీప్లేస్‌మెంట్ మార్కెట్‌పై ఉండదు కాబట్టి, చైనా నుంచి పోటీ తగ్గడం, రబ్బరు ధరలు కూడా తగ్గడంతో టైర్ల షేర్ల లాభా లు కొనసాగుతాయని నిపుణులు అంచనావేస్తున్నారు. సియట్ షేర్‌ను రూ.1,550, అపోలో టైర్స్ షేర్ రూ.239 టార్గెట్‌ధరలుగా ప్రస్తుత ధరల్లో కొనుగోలు చేయవచ్చని ఫిలిప్ క్యాపిటల్ చెబుతోంది.