హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కరోనా మహమ్మారి కారణంగా ఈ-కామర్స్ అనూహ్యంగా పుంజుకున్న సంగతి తెలిసిందే. మొబైల్స్ విషయంలోనూ 2020లో అదే జోరు కనపడింది. గతేడాది దేశవ్యాప్తంగా అమ్ముడైన మొబైల్స్‌లో ఆన్‌లైన్ వాటా 45 శాతం నమోదైందని పరిశోధన సంస్థ కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తాజా నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇదే అత్యధికం కావడం గమనార్హం. అంతర్జాతీయంగా 26 శాతం మొబైల్స్ ఆన్‌లైన్ ద్వారా కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. ఆన్‌లైన్ వాటా యూకేలో 39 శాతం, చైనా 34, బ్రెజిల్ 31, యూఎస్ 24, దక్షిణ కొరియాలో 16 శాతం కైవసం చేసుకుంది. ఆన్‌లైన్ జోరు క్రమంగా తగ్గుముఖం పడుతుందని.. ఈ ఏడాది 2020 ఏడాది మాదిరిగా లేదా స్వల్పంగా తగ్గుదల ఉండొచ్చని నివేదిక తెలిపింది. మల్టీ బ్రాండ్ రిటైల్ స్టోర్లు విస్తరిస్తున్నందున భారత్‌లో 2022 తర్వాత ఆన్‌లైన్ వాటా క్షీణిస్తుందని వెల్లడించింది.
లాక్‌డౌన్‌లో తగ్గిన ఆన్‌లైన్..
- సెకండ్ వేవ్ కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా రవాణా పరిమితులు విధించడంతో ఈ-కామర్స్ కంపెనీలకు డెలివరీ సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఈ ప్రభావం స్మార్ట్‌ఫోన్ల విక్రయాలపైనా పడింది. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన వారం తర్వాతగానీ కస్టమర్లకు గ్యాడ్జెట్స్ చేరకపోవడంతో.. చాలా మంది వినియోగదార్లు తమ ఆర్డర్లను రద్దు చేసుకున్నారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
- సమయానికి కస్టమర్‌కు ఉత్పత్తులను చేర్చలేని పరిస్థితి తలెత్తడంతో అటు విక్రేతలు సైతం ఈ-కామర్స్‌లో లిస్టింగ్‌కు వెనుకడుగు వేశారు. దీంతో రెండు నెలలుగా ఆన్‌లైన్ జోరు తగ్గింది. ఈ పరిణామాలన్నీ ఆఫ్‌లైన్ రిటైలర్లకు కలిసొచ్చిందని బిగ్-సి మొబైల్స్ సీఎండీ ఎం.బాలు చౌదరి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు.
రెండు గంటల్లోనే డెలివరీ..
ఈ-కామర్స్ కంపెనీలకు దీటుగా మల్టీ బ్రాండ్ మొబైల్ రిటైల్ స్టోర్లు ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంను పటిష్టం చేసుకున్నాయి. ఆన్‌లైన్‌లో ఆర్డర్ అందుకున్న 2 గంటల్లోనే ఈ సంస్థలు డెలివరీ చేస్తున్నాయి. బిగ్–సి మొబైల్స్, లాట్ మొబైల్స్, సంగీత, బి-న్యూ మొబైల్స్, హ్యాపీ మొబైల్స్, సెలెక్ట్ మొబైల్స్, సెల్ పాయింట్ వంటి సంస్థలు చిన్న పట్టణాలకూ విస్తరించాయి. దీంతో ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్ కస్టమర్లను చేరుకోవడం వీటికి సులభం అయింది. మొబైల్స్ విషయంలో ఈ-కామర్స్ కంపెనీల నుంచి ఆఫ్‌లైన్‌కు రెండు నెలల్లో 25 శాతం కస్టమర్లు మళ్లారని మల్టీ బ్రాండ్ రిటైల్ సంస్థ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఆఫ్‌లైన్‌లో మాత్రమే ప్రత్యక్షంగా ఎంచుకోవడానికి విస్తృత శ్రేణి మొబైల్స్ డిస్‌ప్లేలో ఉంటాయని బి-న్యూ మొబైల్స్ సీఎండీ వై.డి.బాలాజీ చౌదరి వివరించారు. అమెజాన్ పే, ఫోన్‌పే వంటి పేమెంట్ యాప్స్ భాగస్వామ్యంతో మల్టీ బ్రాండ్ రిటైల్ స్టోర్లు కస్టమర్లను డిస్కౌంట్లతో ఆకట్టుకుంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment