ప్చ్... అలా జరిగింది!
గొప్ప ఆవిష్కరణ ఒక్కటీ లేదు
60 ఏళ్లుగా భారత్‌లో పరిస్థితులపై ఇన్ఫీ మూర్తి వ్యాఖ్యలు
బెంగళూరు: గడిచిన అరవై ఏళ్లలో ప్రపంచం నలుమూలలా ఇంటింటికి చేరగలిగే ఆవిష్కరణ కనీసం ఒక్కటి కూడా భారత్ చేయలేకపోయిందని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణ మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. దేశీయంగా ప్రభావవంతమైన పరిశోధనలు జరిగేలా చూడటంపై దివంగత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత ఇతర నేతలెవరూ కూడా పెద్దగా దృష్టి పెట్టలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ స్నాతకోత్సవంలో పాల్గొన్న సందర్భంగా నారాయణ మూర్తి ఈ విషయాలు చెప్పారు. ‘రేడియో, బల్బు, టీవీలు, కంప్యూటర్లు ఇవన్నీ కూడా విదేశీ యూనివర్సిటీల నుంచి వచ్చినవే.
మరోవైపు మన భారతీయ కళాశాలలు.. ముఖ్యంగా ఐఐఎస్‌సీ, ఐఐటీలు.. గడచిన అరవై ఏళ్లలో మన సమాజాన్ని, ప్రపంచాన్ని మెరుగ్గా తీర్చిదిద్దగలిగేందుకు ఏం ఆవిష్కరణలు చేయగలిగాయని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇంటింటా మార్మోగేలా కనీసం ఒక్క ఆవిష్కరణైనా భారత్ నుంచి వచ్చిందా? ప్రపంచాన్ని కుదిపేసేటువంటి ఒక్క ఐడియా అయినా ఇవ్వగలిగామా? నిజంగా చెప్పాలంటే గత 60 ఏళ్ల నుంచి అలాంటివేమీ చేయలేకపోయాం’ అని మూర్తి వ్యాఖ్యానించారు.
మేధస్సులోనూ, ఉత్తేజంలోనూ పాశ్చాత్య విద్యార్థులకేమాత్రం తీసిపోకపోయినప్పటికీ.. మన యువత ప్రభావవంతమైన పరిశోధనలు పెద్దగా చేయలేదని ఆయన పేర్కొన్నారు. 1962లో అమెరికా సందర్శించినప్పుడు అక్కడ పీహెచ్‌డీలు పూర్తి చేసుకోబోతున్న భారతీయ విద్యార్థులు స్వదేశం తిరిగొచ్చి.. విద్యా, వైద్యం మొదలైనవి మారుమూల ప్రాంతాల్లో పేదవారికి కూడా అందుబాటులోకి వచ్చేలా చూడాలని పిలుపునిచ్చారని మూర్తి చెప్పారు. దాని ఫలితంగానే ఆటమిక్ ఎనర్జీ మొదలైన రంగాల్లో భారత్ పురోగతి సాధించగలిగిందని, ప్రస్తుతం కూడా 60 దశాబ్దం నాటి మ్యాజిక్‌ను మళ్లీ సృష్టించాల్సిన అవసరం ఉందని తెలిపారు. మేధావులకు, అధ్యాపకులకు సమాజంలో సముచిత గౌరవం లభించే పరిస్థితులు కల్పించాల్సి ఉందని పేర్కొన్నారు.
చౌక కారు ముద్రతోనే నానోకు దెబ్బ
టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా
చెన్నై: నానో కారు భారీ అంచనాలతో వచ్చినా మార్కెట్లో నిలబడలేకపోవడానికి కారణం.. దాని బ్రాండింగ్ విషయంలో జరిగిన తప్పులేనని టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా వ్యాఖ్యానించారు. నానోకు అందుబాటు ధరలోని కారుగా కాకుండా చౌక కారుగా ముద్రపడటం అత్యంత పెద్ద తప్పిదమని, ఇదే వాహన అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపిందని చెప్పారు. సాధారణంగా కారును హోదాకు చిహ్నంగా పరిగణిస్తారని, ఎవరూ కూడా అత్యంత చౌక కారుగా ముద్రపడిన దాన్ని కొనుక్కునేందుకు ఇష్టపడరని ఆయన విశ్లేషించారు.
గ్రేట్ లేక్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ 11వ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. నానో కారును డిజైన్ చేసిన వారి సగటు వయస్సు 25-26 సంవత్సరాలేనని, రూ.లక్షకు దీన్ని తయారుచేయడమనేది మహాయజ్ఞంలాంటిదేనని టాటా పేర్కొన్నారు. రాజకీయ కారణాల వల్ల కారు మార్కెట్లోకి రావడం ఆలస్యం కావడంతో దానిపై ఉత్కం ఠ తగ్గిపోయిందన్నారు. ఈలోగా తమకు వ్యతిరేకంగా కథనాలు అల్లడానికి పోటీ కంపెనీలకు అవకాశం చిక్కిందని చెప్పారు.
వ్యాపార ముఖచిత్రాన్ని మార్చేసే ఈ-కామర్స్
భారీ స్థాయిలో వస్తున్న ఈ-కామర్స్ స్టార్టప్ సంస్థలు.. దేశీ వ్యాపార రంగం ముఖచిత్రాన్ని మార్చివేయగలవని టాటా అభిప్రాయపడ్డారు. అమెరికాలో 70, 80వ దశకాల్లో కనిపించినట్లుగా.. ఉజ్వల భవిష్యత్తు ఉన్న అనేక మంది యువ వ్యాపారవేత్తలు ప్రస్తుతం దేశీయంగా కనిపిస్తున్నారని ఆయన చెప్పారు. దేశీ వ్యాపార రంగ ముఖచిత్రాన్ని మార్చివేయగలిగే సత్తా ఉన్న ఈ-కామర్స్, ఈ-రిటైల్ విభాగ స్టార్టప్‌లను ప్రోత్సహించే ఉద్దేశంతోనే తాను కొన్నింటిలో ఇన్వెస్ట్ చేసినట్లు టాటా చెప్పారు.
పీసీలపైనే దృష్టి.. పెద్ద తప్పిదం
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల
ఆర్లాండో: ఎప్పటికీ పర్సనల్ కంప్యూటర్ల (పీసీ) హవానే నడుస్తుందని భావించి గతంలో పెద్ద తప్పిదం చేశామని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల వ్యాఖ్యానించారు. ఈ ఆలోచనా ధోరణి వల్లే మొబైల్ ఫోన్ల విప్లవాన్ని ఊహించలేకపోయామని, అవకాశాలు అందుకోలేకపోయామని ఆయన పేర్కొన్నారు. అయితే అలాగని భవిష్యత్తంతా మొబైల్ ఫోన్లదే అనుకుంటే గతంలో చేసిన తప్పే పునరావృతం అయినట్లవుతుందని ఒక టెక్నాలజీ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాదెళ్ల పేర్కొన్నారు. భవిష్యత్‌లో పెను మార్పులు తే బోయే వాటిని ముందస్తుగా పట్టుకోవడంపైనే కంపెనీ దృష్టి పెట్టాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.
అందులో భాగంగానే విండోస్ కొత్త వెర్షన్ అని, ఫోన్ల విషయంలోనూ కాపీలు కొట్టడం కాకుండా వినూత్నంగా అందించాలన్నదే తమ లక్ష్యమని నాదెళ్ల తెలిపారు. 1992లో తాను మైక్రోసాఫ్ట్‌లో చేరినప్పుడు ప్రతి ఇంట్లోనూ పర్సనల్ కంప్యూటర్ ఉండాలన్నది కంపెనీ లక్ష్యమని, తాము దాన్ని సాధించగలిగామని ఆయన చెప్పారు. పర్సనల్ కంప్యూటింగ్, ఉత్పాదకతను పెంచుకోవడం, మరింత మెరుగైన క్లౌడ్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించడమనే మూడు అంశాలపై మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం ప్రధానంగా దృష్టి సారిస్తోందని నాదెళ్ల తెలిపారు. నోకియా ఫోన్ల వ్యాపార విభాగంలో మార్పులు, చేర్పులను ప్రస్తావిస్తూ.. తాము రోజుకో ఫోన్‌ను ఆవిష్కరించడం కన్నా గణనీయమైన మార్కెట్ వాటాను దక్కించుకునే సత్తా ఉన్న కొన్ని ఫోన్లపైనే దృష్టి పెట్టదల్చుకున్నట్లు ఆయన వివరించారు.