ఇన్వెస్టర్ల భేటీలో మూర్తి తీవ్ర ఆందోళన
ఇన్వెస్టర్ల భేటీలో మూర్తి తీవ్ర ఆందోళన
Published Tue, Aug 29 2017 8:03 PM | Last Updated on Sun, Sep 17 2017 6:06 PM
సాక్షి, న్యూఢిల్లీ : ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ నారాయణమూర్తి తనపై వచ్చిన ఆరోపణలపై తీవ్ర ఆందోళనను వ్యక్తంచేశారు. లోపాలను గుర్తించకుండా ఇన్ఫోసిస్ మాజీ బోర్డు సభ్యులు తనపై వ్యక్తిగత దాడికి దిగారన్నారు. అవి చాలా బాధ కలిగించినట్టు మూర్తి చెప్పారు. విశాల్ సిక్కా రాజీనామా అనంతరం తలెత్తిన పరిస్థితులపై తొలిసారి పెట్టుబడిదారులతో మూర్తి భేటీ అయ్యారు. తను ఎక్కువగా పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసమే పోరాడినట్టు మూర్తి చెప్పారు. గ్లోబల్ కంపెనీ స్థాయిగా ఇన్ఫీ తిరిగి పొందడానికే తాను కోరుకున్నట్టు తెలిపారు. త్రైమాసిక ఫలితాలను, గైడెన్స్‌ను రిపోర్టు చేసిన తొలి కంపెనీ ఇన్ఫోసిస్‌నేని, గట్టి కార్పొరేట్ పాలనతో తాము ఇలాంటి ప్రమాణాలను ఆర్జించామని మూర్తి చెప్పారు. మాజీ బోర్డు సభ్యులు కంపెనీలో లోపాలు గుర్తించకుండా.. తనపై వ్యక్తిగత దాడికి పాల్పడ్డారన్నారు. ఇటీవల విశాల్ సిక్కా రాజీనామా అనంతరం బోర్డు సభ్యులు మూకుమ్మడిగా మూర్తిపై విరుచుకుపడ్డారు. ఆయనపై పలు ఆరోపణలు గుప్పించారు. ఈ ఆరోపణలపై సరియైన వేదికపై సరియైన సమయంలో స్పందిస్తానని మూర్తి గట్టి జవాబిచ్చిన సంగతి తెలిసిందే.
కంపెనీ మాజీ చైర్మన్ ఆర్ శేషసాయి, మాజీ సీఎఫ్‌ఓ రాజీవ్ బన్సాల్‌కు అధిక మొత్తంలో సెవరెన్స్ ప్యాకేజీ ఇచ్చారని మూర్తి ఆరోపించారు. రాజీవ్ బన్సాల్‌కు ఎక్కువ సెవరెన్స్ ప్యాకేజీ చెల్లించడాన్ని బోర్డు అంగీకరించిందని శేషసాయి తనకు చెప్పారని, కానీ వార్షిక సాధారణ సమావేశంలో శేషసాయి అబద్ధం ఆడినట్టు మూర్తి చెప్పారు. రాజీవ్ బన్సాల్‌పై మరింత విచారణ చేపట్టినప్పుడు శేషసాయి ఏం మాట్లాడలేకపోయారని తెలిపారు. సెవరెన్స్ పే విషయంపై జరిగిన సమావేశ మినిట్స్‌ను కూడా బోర్డు రికార్డు చేయలేదన్నారు. పైగా బన్సాల్ ఒప్పందాన్ని బహిర్గతం చేయలేమని జేఫ్ లేమన్ చెప్పినట్టు మూర్తి పేర్కొన్నారు. అంతకముందు వెళ్లిన ఏ సీఎఫ్‌ఓకి కూడా కంపెనీ సెవరెన్స్ ప్యాకేజీ ఇవ్వలేదన్నారు. బోర్డు పారదర్శకంగా లేదని, తప్పుదోవ పట్టించే విధంగా ఉందన్నారు. బలహీనమైన పాలన పద్ధతులు కంపెనీలో ఉండటమే తన ముఖ్యమైన ఆందోళన అని చెప్పారు. నిలేకని నేతృత్వంలో మేనేజ్‌మెంట్ టీమ్ ర్యాలీ జరుపుతుందని తనకు విశ్వాసం ఉందని, ఇన్ఫోసిస్‌కు మళ్లీ ఆ కీర్తిని తీసుకొస్తుందని మూర్తి ధీమా వ్యక్తంచేశారు. నందన్ ఎంతో విలువలతో కూడిన వ్యక్తి అని, 15 ఏళ్లుగా తనకు నిలేకని తెలుసని మూర్తి చెప్పారు. ఇన్ఫోసిస్‌కు మంచి రోజులు తీసుకురావడానికి నందన్ తన శతవిధాలా ప్రయత్నించాలని కోరుకుంటున్నట్టు మూర్తి తెలిపారు.
Advertisement
Advertisement