
న్యూఢిల్లీ: బంగారు ఆభరణాలపై రుణాలిచ్చే ముత్తూట్ ఫైనాన్స్ సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.454 కోట్ల నికర లాభం సాధించింది. గత క్యూ2లో సాధించిన నికర లాభం(రూ.297 కోట్లు)తో పోల్చితే 53 శాతం వృద్ధి సాధించామని ముత్తూట్ ఫైనాన్స్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ. 1,386 కోట్ల నుంచి రూ.1,670 కోట్లకు పెరిగిందని కంపెనీ ఎండీ, జార్జ్ అలెగ్జాండర్ ముత్తూట్ పేర్కొన్నారు.
నికర లాభం, ఆదాయం బాగానే పెరిగినప్పటికీ, మొండి బకాయిలు కూడా బాగానే పెరిగాయి. గత క్యూ2లో రూ.6,016 కోట్లుగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో రూ.12,593 కోట్లకు, నికర మొండి బకాయిలు రూ.4,997 కోట్ల నుంచి రూ.11,021 కోట్లకు పెరిగాయని జార్జ్ చెప్పారు.