ముంబై: ఆన్‌లైన్ ఫ్యాషన్ రిటైల్ సంస్థ మింత్రాలో అనుబంధ సంస్థ జబాంగ్ విలీనం కానుంది. విలీనమైనప్పటికీ.. జబాంగ్ ప్రత్యేక బ్రాండ్‌గానే కొనసాగుతుందని మింత్రా తెలిపింది. రెండు సంస్థల టీమ్‌కు ప్రస్తుత మింత్రా సీఈవో అనంత్ నారాయన్‌నే సారథిగా కొనసాగుతారు. ఆయన రాజీనామా చేస్తారన్న వార్తలను మింత్రా తోసిపుచ్చింది. ఆన్‌లైన్ రిటైల్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ 2014లో మింత్రాను కొనుగోలు చేసింది. 2016లో జబాంగ్‌ను మింత్రా కొనుగోలు చేసింది.
అప్పట్నుంచి రెండు బ్రాండ్స్ కార్యకలాపాలను క్రమంగా అనుసంధానం చేయడం జరుగుతోందని మింత్రా ఒక ప్రకటనలో తెలియజేసింది. ఇకపై టెక్నాలజీ, మార్కెటింగ్, ఆదాయాలు, ఆర్థికాంశాలు మొదలైన వాటన్నింటినీ పూర్తి స్థాయిలో ఏకీకృతం చేయనున్నట్లు తెలిపింది. మరోవైపు, మింత్రా సీఎఫ్‌వో దీపాంజన్ బసు తన పదవికి రాజీనామా చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. తీవ్రమైన వ్యక్తిగత దుష్ప్రవర్తన ఆరోపణలతో ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈవో పదవి నుంచి బిన్నీ బన్సల్ వైదొలిగిన దరిమిలా ఈ పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఉద్యోగాల్లో కోత..
ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి కింద పనిచేయాలనే కారణంతో మింత్రా సీఈవో అనంత్ నారాయణన్ కూడా రాజీనామా చేయొచ్చన్న వార్తలు వచ్చినప్పటికీ వాటిని ఆయన తోసిపుచ్చారు. ‘నేను ఇందులోనే కొనసాగబోతున్నాను‘ అని అనంత్ స్పష్టం చేశారు. మింత్రా సహ వ్యవస్థాపకుడు ముకేశ్ బన్సల్ స్థానంలో 2015లో ఆయన సీఈవోగా చేరారు.
మింత్రా, జబాంగ్ కార్యకలాపాల ఏకీకరణ ప్రక్రియ కొనసాగుతోందని, ఫలితంగా కొన్ని ఉద్యోగాల్లో కోత ఉండవచ్చని అనంత్ తెలిపారు. అయితే, ఇది మొత్తం సిబ్బందిలో 10 శాతం కన్నా తక్కువే ఉంటుందని చెప్పారు. తొలగించిన ఉద్యోగులకు 3–8 నెలల జీతాలు చెల్లించడంతో పాటు కొత్త ఉద్యోగాలు వెతుక్కోవడంలో సహకారం అందించడం, వైద్య బీమా వ్యవధిని పొడిగించడం మొదలైన మార్గాల్లో తోడ్పాటు అందిస్తున్నామని అనంత్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment