డిజిటల్ ఇండియాలోకి టెక్ దిగ్గజాలు | ndia teams up with Google for free WiFi at 500 railway stations: Measures PM Modi announced during Silicon Valley trip | Sakshi
Sakshi News home page

డిజిటల్ ఇండియాలోకి టెక్ దిగ్గజాలు

Published Mon, Sep 28 2015 12:31 AM | Last Updated on Fri, Aug 24 2018 2:20 PM

డిజిటల్ ఇండియాలోకి టెక్ దిగ్గజాలు - Sakshi

డిజిటల్ ఇండియాలోకి టెక్ దిగ్గజాలు

500 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫైకి గూగుల్ సహకారం...
* 5 లక్షల గ్రామాల్లో మైక్రోసాఫ్ట్ చౌక బ్రాడ్‌బ్యాండ్
* భారత్‌లో ప్లాంట్ ఏర్పాటుపై యాపిల్ సానుకూలత!
శాన్‌జోస్: ప్రధాని నరేంద్ర మోదీ తలపెట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమానికి సహకారం అందించేందుకు ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాలు ముందుకొచ్చాయి.
అమెరికా పర్యటనలో భాగంగా మోదీ సిలికాన్ వ్యాలీలో అగ్రగామి ఐటీ కంపెనీల చీఫ్‌లతో సమావేశంలో ఈ కీలక ప్రకటనలు వెలువడ్డాయి.
 
గూగుల్ ఉచిత వైఫై...
దేశంలో 500 రైల్వే స్టేషన్లలో ఉచితంగా వైఫై సౌకర్యాన్ని అందించేందుకు గూగుల్ సహకారం అందించనుంది. గుజరాతీతో సహా 10 భారతీయ భాషల్లో టైపింగ్‌కు అవకాశం కల్పించనున్నట్లు కూడా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. వచ్చే నెలలో ఈ సౌకర్యం అందుబాటులోకి రానుందని చెప్పారు. డిజిటల్ లిటరసీ(పరిజ్ఞానం)ని అందరికీ అందించాలంటే స్థానిక భాషల్లో టైపింగ్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుందని.. అందుకే తాము ఈ చర్యలు చేపడుతున్నట్లు పిచాయ్ పేర్కొన్నారు.ఇంకా అనేక కనెక్టివిటీ ప్రాజెక్టులపై కూడా గూగుల్ దృష్టిపెట్టినట్లు ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తృతం చేయడంలో భారత్ అతిపెద్ద పాత్ర పోషించనుందన్నారు. దీనివల్ల ప్రజల జీవనప్రమాణాలు కూడా మెరుగవుతాయని చెప్పారు. నవకల్పనలు, ఎంట్రప్రెన్యూర్‌షిప్‌లకు రానున్న కాలంలో భారత్‌ను అత్యంత కీలక కేంద్రంగా మార్చడానికి ప్రధాని మోదీ చాలా కృషిచేస్తున్నారని ఈ సందర్భంగా పిచాయ్ వ్యాఖ్యానించారు.

కాగా, భారత్‌లో వివిధ రంగాల్లో ప్రగతి, పరిణామాలను చూసి గూగుల్ చాలా గర్వపడుతోందని, డిజిటల్ ఇండియా పట్ల ప్రధాని మోదీ దార్శనికత అబ్బురపరుస్తోందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ‘అసలు నవకల్పనలకు సంబంధించిన స్ఫూర్తి భారతీయుల డీఎన్‌ఏలోనే ఉంది.. దీంతో వారు చాలా గొప్ప ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకొస్తున్నారు. ఇదే స్ఫూర్తి ఇక్కడ మమ్మల్నీ నడిపిస్తోంది’ అని గూగుల్ చీఫ్ పేర్కొన్నారు.
 
మైక్రోసాఫ్ట్ చౌక బ్రాడ్‌బ్యాండ్....
మోదీతో సమావేశం సందర్భంగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కూడా భారత్‌లో తన ప్రణాళికలను ప్రకటించారు. ముఖ్యంగా భారత్‌లోని 5 లక్షల గ్రామాలకు చౌకగా బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు చెప్పారు. దీనికోసం ప్రభుత్వంతో జట్టుకట్టనున్నామని కూడా ఆయన తెలిపారు. మరోపక్క, భారత్‌లో తమ డేటా సెంటర్ల నుంచి క్లౌడ్ సేవలను నిర్వహించనున్నామని, వచ్చే వారంలోనే ఇది ప్రారంభం కానున్నట్లు నాదెళ్ల చెప్పారు. దీన్ని పెద్ద మైలురాయిగా ఆయన అభివర్ణించారు. ‘డిజిటల్ ఇండియాలో మేం కూడా భాగస్వాములమవుతాం.

చౌక బ్రాండ్‌బ్యాండ్ కనెక్టివిటీ, అదేవిధంగా క్లౌడ్ కంప్యూటింగ్ పరిజ్ఞానంతో ప్రభుత్వాలు, ప్రజలు, వ్యాపారాలు అన్నింటికీ మేలు చేకూరుతుంది. అన్నిస్థాయిల్లో సామర్థ్యం, ఉత్పాదకత, సృజనాత్మకతను పెంపొందించేందుకు తోడ్పడుతుంది’ అని నాదెళ్ల పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియాల ద్వారా భారత్‌లో ప్రపంచస్థాయి మౌలికసదుపాయాలను అభివృద్ధి చేసేందుకు వీలవుతుందన్నారు.
 
భారత్‌కు యాపిల్!
భారత్‌లో తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా ప్రధాని మోదీ యాపిల్ సీఈవో టిమ్ కుక్‌ను కోరారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. భారత్‌లో అపారమైన అవకాశాలున్నాయని.. అందుకే ఇక్కడ ప్లాంట్‌ను నెలకొల్పాల్సిందిగా మోదీ పేర్కొన్నట్లు సమావేశం అనంతరం విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ వెల్లడించారు. యాపిల్‌కు కాంట్రాక్టు తయారీ సంస్థ అయిన ఫాక్స్‌కాన్ కూడా భారత్‌లో ప్లాంట్‌ను నెలకొల్పాలని నిర్ణయించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

మోదీతో భేటీ సందర్భంగా కుక్ భారత్‌పట్ల చాలా ఆసక్తిని వ్యక్తం చేసినట్లు కూడా స్వరూప్ తెలిపారు. ‘యాపిల్‌లోని ప్రతి ఉద్యోగి మదిలో భారత్ అంటే చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎందుకంటే మా కంపెనీ సహ-వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ చిన్నవయస్సులో ఉన్నప్పుడు ప్రేరణ కోసం భారత్‌కు వెళ్లిరావడమే. ఆతర్వాత యాపిల్ ఏర్పాటుకు బీజాలు పడ్డాయి. ప్రధాని మోదీ తలపెట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమంలో పాలుపంచుకోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఇది భారత్ రూపురేఖలను సమూలంగా మార్చేయగలదు(గేమ్ చేంజర్). మేం భారత్‌లో 20 ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాం. ఇక్కడ అత్యంత ఉత్సాహవంతమైన వినియోగదారులు ఉన్నారు’ అని కుక్ పేర్కొన్నారు.
 
స్టార్టప్‌లకు క్వాల్‌కామ్ 15 కోట్ల డాలర్ల నిధులు..
భారత్‌లో స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు క్వాల్‌కామ్ ముందుకొచ్చింది. వీటికి 15 కోట్ల డాలర్ల(దాదాపు రూ.975 కోట్లు) మేర నిధులను అందించనున్నట్లు మోదీతో భేటీ సందర్భంగా క్వాల్‌కామ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పాల్ జాకబ్స్ ప్రకటించారు. ‘భారత్‌లోని వినూత్న స్టార్టప్‌లకు సహకారం అందించేందుకు కట్టుబడి ఉన్నాం. మోదీతో భేటీ సందర్భంగా ఆయన తలపెట్టిన డిజిటల్ ఇండియా ప్రణాళికల గురించి చర్చించాం’ అని జాకబ్స్ పేర్కొన్నారు.
 
భారత్‌లో డిజిటల్ విప్లవం
శాన్‌జోస్: డిజిటల్ విప్లవం దిశగా భారత్ వడివడిగా అడుగులేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అమెరికా పర్యటలో భాగంగా సిలికాన్‌వ్యాలీలో ప్రపంచ అగ్రగామి ఐటీ కంపెనీల సీఈవోలతో సమావేశం సందర్భంగా తన మానస పుత్రిక అయిన ‘డిజిటల్ ఇండియా’ ప్రణాళికలను వివరించారు. డేటా గోప్యత(ప్రైవసీ), భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని, పాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచడం తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని కూడా ఆయన టెక్ దిగ్గజాలకు హామీనిచ్చారు.

మోదీతో విందు(డిన్నర్) సమావేశంలో పాల్గొన్న వారిలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, అడోబ్ చీఫ్ శాంతను నారాయణ్, క్వాల్‌కామ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పాల్ జాకబ్స్ తదితరులు ఉన్నారు. ఈ భేటీ సందర్భంగా డిజిటల్ ఇండియాలో భాగంగా చేపట్టబోయే పలు ప్రణాళికలను కూడా మోదీ ప్రకటించారు. ముఖ్యంగా దేశంలో పబ్లిక్ వైఫైను మరింతగా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. త్వరలోనే  500 రైల్వే స్టేషన్లలో వైఫై సౌకర్యాన్ని కల్పించనున్నామని, ఇందుకోసం గూగుల్‌తో జట్టుకట్టామని కూడా వెల్లడించారు.
 
ఐ-వేస్ కూడా అవసరం...
6 లక్షల గ్రామాలను బ్రాడ్‌బ్యాండ్‌తో అనుసంధానించడం కోసం జాతీయ ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్ విస్తరణను వేగవంతం చేస్తున్నామని ప్రధాని టెక్ సీఈవోలకు వివరించారు. ‘ఈ-గవర్నెన్స్‌తో మరింత సమర్థవంతమైన పాలన అందించేందుకు వీలవుతోంది. ఇప్పుడు భారత్‌లో 100 కోట్ల మంది మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్నారు. పరిపాలనతో ప్రజలను మరింత భాగస్వామ్యం చేసేందుకు, ప్రభుత్వాన్ని వారి చెంతకు చేర్చేందుకు ఎం(మొబైల్)-గవర్నెన్స్ తోడ్పడుతుంది.  

స్కూళ్లు, కాలేజీన్నింటినీ బ్రాండ్‌బ్యాండ్‌తో అనుసంధానిస్తాం. పేవర్ రహిత లావాదేవీలను సాకారం చేయాలన్నదే మా సంకల్పం. దేశంలో ప్రతి ఒక్కరికీ డిజిటల్ లాకర్ సదుపాయాన్ని కల్పించనున్నాం. వ్యక్తిగత డాక్యుమెంట్లను ఇందులో దాచుకోవచ్చు. ఏ ప్రభుత్వ శాఖతో పనిఉన్నా నేరుగా వాటిని పంపడానికి వీలవుతుంది. వ్యాపారవేత్తలకు అనుమతులను వేగంగా ఇచ్చేందుకు ఈ-బిజ్ పోర్టల్‌ను నెల కొల్పాం’ అని మోదీ సీఈఓలకు వివరించారు.
 
డిజిటల్ ఇండియాకు ఫేస్‌బుక్ సీఈవో మద్దతు
ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ డిజిటల్ ఇండియాకు తన మద్దతును ప్రకటించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇంటర్‌నెట్‌ను అందించడానికి ప్రధాని మోదీ చేస్తున్న కృషికి అభినందనలు తెలియజేస్తూ.. జుకర్‌బర్గ్ తన ఫేస్‌బుక్ ప్రొఫైల్ చిత్రాన్ని మార్చారు. మార్చిన ప్రొఫైల్ చిత్రంలో భారత జెండా మధ్య భాగంలో నవ్వుతూ జుకర్‌బర్గ్ కనిపిస్తారు. అలాగే ఆయన డిజిటల్ ఇండియా కార్యక్రమానికి మద్దతు తెలియజేయాలని తన ఫాలోయర్లను కూడా కోరారు.
ప్రొఫైల్ చిత్రంలో భారత జెండాలో జుకర్‌బర్గ్
 
టెల్సా ‘పవర్‌బాల్’పై మోదీ ఆసక్తి...
అమెరికా ఆటోమొబైల్ దిగ్గజం టెల్సా మోటార్స్‌ను ప్రధాని మోదీ సందర్శించారు. అక్కడ ఆవిష్కరిస్తున్న అద్భుతమైన కొత్తకొత్త సాంకేతిక పరిజ్ఞానాలను భారత్‌లో వినియోగించడానికి ప్రధాని ఆసక్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా పునరుత్పాదక ఇంధన రంగంలో టెల్సా పరిజ్ఞానాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉపయోగించుకోవచ్చన్నారు. ‘విద్యుత్‌ను ఒక బ్యాటరీలో చాలా కాలంపాటు నిల్వ చేసుకోవడానికి వీలుగా సృష్టించిన పవర్ బాల్ టెక్నాలజీ నన్ను చాలా ఆకట్టుకుంది.

ఈ బ్యాటరీ టెక్నాలజీ రైతులకు చాలా ఉపయోగపడుతుంది’ అని మోదీ ట్వీట్ చేశారు. మోదీకి ప్లాంట్‌ను స్వయంగా దగ్గరుండి చూపించిన టెల్సా సీఈఓ ఎలాన్ మస్క్... సోలార్ విద్యుత్, బ్యాటరీల ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలను అందించవచ్చనేది ప్రధానితో చర్చించినట్లు చెప్పారు. 2003లో  నెలకొల్పిన టెల్సా.. ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేస్తుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement