టెక్‌ దిగ్గజాలు ఎందుకు చెక్కేస్తున్నారు? | the faults in our start-ups: why india’s prized silicon valley hires keep burning out | Sakshi
Sakshi News home page

టెక్‌ దిగ్గజాలు ఎందుకు చెక్కేస్తున్నారు?

Published Tue, Apr 4 2017 4:45 PM | Last Updated on Wed, Aug 15 2018 2:32 PM

టెక్‌ దిగ్గజాలు ఎందుకు చెక్కేస్తున్నారు? - Sakshi

టెక్‌ దిగ్గజాలు ఎందుకు చెక్కేస్తున్నారు?

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ‘మేక్‌ ఇన్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియా’ పథకాలకు ఆకర్షితులై స్వదేశీ, విదేశీ ఆన్‌లైన్‌ కంపెనీలు ఎన్నో ప్రపంచంలో మూడవ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్‌కు విస్తరించాయి. కళ్లు చెదిరే జీత భత్యాలను ఎరగా వేసి సిలికాన్‌ వ్యాలీలో పనిచేస్తున్న భారతీయ దిగ్గజాలను తీసుకొచ్చి బాస్‌లుగా కూర్చోబెట్టాయి. కానీ ఈ బాసుల్లో ఎక్కువ మంది కంపెనీల్లో నిలదొక్కుకోకుండానే మరో చోటుకు చెక్కేస్తున్నారు. ఫలితంగా కొన్ని స్టార్టప్‌ కంపెనీలు తెరవకుండా మూసుకోవాల్సి వస్తోంది.

ఫ్లిప్‌కార్ట్‌ నుంచి గతేడాది ఏప్రిల్‌ నెలలో పునీత్‌ సోని తప్పుకోగా, ఆ తర్వాత మే నెలలో స్నాప్‌డీల్‌ నుంచి చీఫ్‌ ప్రాడక్ట్‌ ఆఫీసర్‌ ఆనంద్‌ చంద్రశేఖరన్‌ ఏడాది తిరక్కుండానే తప్పుకున్నారు. 2014 ఫేస్‌బుక్‌ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన నమితా గుప్తా, రెస్టారెంట్‌ లిస్టింగ్‌ స్టార్టప్‌ కంపెనీ ‘జోమాతో’ నుంచి ఏడాది తిరక్కుండానే తప్పుకున్నారు. గతంలో లింక్డ్‌ఇన్‌ ఇండియాలో హెడ్‌గా పనిచేసిన నిశాంత్‌ రావు చెన్నైలో ఏర్పాటు చేసిన ‘ఫ్రెష్‌ డెస్క్‌’ స్టార్టప్‌ కంపెనీ నుంచి వారం కిందనే తప్పుకున్నారు.

ఒకప్పుడు సిలికాన్‌ వ్యాలీలో ఒక వెలుగు వెలిగిన ఈ దిగ్గజాలు మాతృదేశంలోని కంపెనీల్లో ఎందుకు నిలదొక్కుకోలేక పోతున్నారు? వారు మరింత ఎక్కువ జీతాలకు ఆశపడి పోతున్నారా? కంపెనీ వాతావరణం నచ్చడం లేదా? ఇక్కడి పని సంస్కతికి అలవాటు పడలేకపోతున్నారా? మరేవైనా ఇతర కారణాలు ఉన్నాయా?

అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీలో స్థానిక వ్యాపార కంపెనీలు మార్కెట్‌పైనా, వచ్చే లాభాలపైన ప్రధానంగా దష్టిని కేంద్రీకరిస్తే భారత్‌కు వచ్చే స్టార్టప్‌ కంపెనీలు అంకెల మీద, మార్కెట్‌లో వాటా మీద (లాభాలతో సంబంధం లేకుండా) దష్టిని కేంద్రీకరించడం ప్రాథమిక లోపమని బెంగళూరులోని ‘స్టాంటన్‌ చేజ్‌’ కంపెనీ మేనేజింగ్‌ పార్టనర్‌ కేఎన్‌ శ్రీపాద్‌ తెలిపారు. భారత్‌లో 30 కోట్ల మంది స్మార్ట్‌ఫోన్‌ వినియోగిస్తున్నారని, వందకోట్ల మంది సెల్‌ఫోన్లను వాడుతున్నారన్న అంకెల ఆధారంగా మార్కెట్‌ను అంచనా వేస్తున్నారని ఆయన వివరించారు.

సిలికాన్‌ వ్యాలీలో, భారత్‌లో బయటి నుంచి చూస్తే సజనాత్మకత ఒకటిగానే కనిపిస్తుందని, కానీ క్షేత స్థాయిలో తేడాలు ఉన్నాయని, ఆ తేడాల వల్లనే స్టార్టప్‌ కంపెనీల్లో ఎక్కువ మంది నిలదొక్కుకోలేక పోతున్నారని ‘హైడ్రిక్‌ అండ్‌ స్ట్రగుల్స్‌’ ఇంచార్జి పార్టనర్‌ వెంకట్‌ శాస్త్రీ తెలిపారు. వ్యాలీలో అనుభవజ్ఞులైన సీనియర్లు దొరికే వారని, వారి అనుభవం ఇక్కడి వారికి లేదని చెప్పారు. పైగా అక్కడి మార్కెట్‌ పరిణతి చెందినదని, ఏ రంగానికి ప్రాముఖ్యత ఉందో ఏ రంగాల్లో రాణించాలో మార్గనిర్దేశం చేసేవారు కూడా సిలికాన్‌ వ్యాలీలో ఎక్కువని ఆయన వివరించారు.

ఇక్కడి కంపెనీల్లో వాతావరణం, అంటే ఉద్యోగుల మధ్య సఖ్యత, స్నేహభావం లేకపోవడం, పని సంస్కతి నచ్చక పోవడమే తాము భారత స్టార్టప్‌ కంపెనీల నుంచి తప్పుకోవడానికి ప్రధాన కారణమని తప్పుకుంటున్న నెట్‌ దిగ్గజాలు చెబుతున్నారు. అమెరికాలో టాలెంట్‌ను మాత్రమే పరిగణలోకి తీసుకొని ఉద్యోగాలు ఇవ్వగా, భారత్‌లో బంధు, మిత్ర సంబంధాల కారణంగా అనర్హులు కూడా ఉద్యోగాలు పొందుతున్నారని, వారి వల్ల కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు.

సిలికాన్‌ వ్యాలీలో ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు వరకు పని వేళలు ఉంటాయని, వారాంతంలో రెండు రోజులు సెలవులు ఉంటాయని, భారత్‌లో పనివేళలు ఎక్కువ కావడమే కాకుండా ఎక్కువ వరకు విదేశీ కస్టమర్ల కోసం రాత్రిళ్లు పనిచేయాల్సి వస్తోందని, స్టార్టప్‌ కంపెనీలవడం వల్ల కూడా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటోందని వారన్నారు. భారత్‌లో రెడ్‌ టేపిజం కూడా ఎక్కువగానే ఉందన్నారు.  వివిధ రంగాల్లో ఏర్పాటు చేయాల్సిందిపోయి కొన్ని రంగాల్లోనే ఎక్కువ స్టార్టప్‌ కంపెనీలు ఏర్పాటు చేయడం కూడా భారత్‌లో జరుగుతున్న పొరపాటని, దాని వల్ల కంపెనీల మధ్య అనవసరమైన పోటీ పెరిగి మూసుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయని మార్కెట్‌ వర్గాలు తెలియజేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement