దేశంలో బిగ్గెస్ట్ బ్రాండ్ ఇదే: మోదీ
అహ్మదాబాద్: రెండురోజుల గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం ‘వైబ్రంట్ గుజరాత్’ సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ భారత్‌కు ఇప్పటివరకు ఉన్న బ్రాండ్‌లలో అతిపెద్ద బ్రాండ్ ‘మేకిన్ ఇండియా’ పథకమేనని అన్నారు. ఈ పథకం యువతలోని శక్తిని వెలికితీసుకొస్తున్న తీరు చాలా ముదావహంగా ఉందని అన్నారు. భారత్ ప్రస్తుతం మాన్యుఫాక్చరింగ్ లో ఆరో అతిపెద్ద దేశంగా ఉందని గుర్తుచేశారు.
ప్రతి నిరుపేదకు సొంతింటిని కట్టించాలని, ప్రతి వ్యక్తికి ఉద్యోగాన్ని కల్పించాలని తమ ప్రభుత్వం భావిస్తున్నట్టు చెప్పారు. గతంలో ఎన్నడూలేనంత అత్యధికస్థాయిలో ఇప్పుడు దేశంలోకి ఎఫ్‌డీఐలు వస్తున్నాయని, క్యాపిటల్ గూడ్స్ విషయంలో ఆసియా-పసిఫిక్ లో భారతే అగ్రస్థానంలో ఉందని మోదీ అన్నారు. పెట్టుబడులపై రిటర్న్స్ ఇవ్వడంలో ప్రపంచదేశాలన్నింటినీ భారత్ వెనుకకు నెట్టేసిందని గర్వంగా చెప్పారు. ఈ సందర్భంగా గుజరాత్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన నోబెల్ సిరీస్ ఎగ్జిబిషన్ లో భాగంగా తొమ్మిది మంది నోబెల్ గ్రహీతల చర్చను ప్రారంభించారు.