అమ్మకు కన్నీటి అభిషేకం | Zuckerberg looks forward to interact with Modi | Sakshi
Sakshi News home page

అమ్మకు కన్నీటి అభిషేకం

Published Mon, Sep 28 2015 1:42 AM | Last Updated on Fri, Aug 24 2018 2:20 PM

అమ్మకు కన్నీటి అభిషేకం - Sakshi

అమ్మకు కన్నీటి అభిషేకం

నన్ను పెంచటానికి నా తల్లి ఎన్నో కష్టాలు పడింది.. అంట్లు తోమింది  
- భారత్‌లో ఎందరో తల్లులు తమ పిల్లల కోసం జీవితాలు త్యాగం చేస్తారు
- వారందరికీ వేల వేల వందనాలు: ఫేస్‌బుక్ సీఈఓ జుకర్‌బర్గ్ ప్రశ్నతో మోదీ భావోద్వేగం
- దేశ ఆర్థికవ్యవస్థను 20 లక్షల కోట్ల డాలర్లకు పెంపే లక్ష్యమన్న ప్రధాని


నేను ఒక పేద కుటుంబం నుంచి వచ్చాను... నేను రైల్వే స్టేషన్ వద్ద టీ అమ్మేవాడినని బహుశా మీకు తెలుసేమో. మేం చిన్నప్పుడు బతకటానికిచాలా చేయాల్సివచ్చేది. నా తండ్రి లేరు.. నన్ను పెంచటానికి నా తల్లి చాలా కష్టాలు పడింది. ఆమె పొరిగింట్లో అంట్లు తోమేది.. నీళ్లు పట్టేది.. కాయకష్టం చేసేది. ... ఇది కేవలం ఒక్క నరేంద్రమోదీ విషయంలోనే కాదు.. ఇండియాలో చాలా మంది తల్లులు తమ పిల్లల కోసం తమ జీవితాలు మొత్తం త్యాగం చేస్తారు. అందుకే అమ్మలందరికీ నా వేలవేల దండాలు. తమ పిల్లల కలలు, ఆశలను నెరవేర్చటానికి తమ సొంత జీవితాలను త్యాగం చేసిన తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు. ఒక తల్లి తన బిడ్డ ఏదో కావాలని ఎన్నడూ కోరుకోదు.. నీవు కోరుకున్న దానిని నీవు ఎలా సాధిస్తావనే దాని గురించే ఆమె ఆలోచిస్తుంది.

శాన్‌జోస్:
అత్యంత అరుదుగా భావోద్వేగానికి గురయ్యే ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. ఆదివారం ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ అడిగిన ఒక ప్రశ్నకు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన తల్లి గురించి మాట్లాడుతుండగా ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకోవటానికి కొన్ని క్షణాలు మౌనందాల్చారు. ఆయన ఆదివారం సిలికాన్ వ్యాలీలో ఫేస్‌బుక్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఆ సంస్థ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌తో అధికభాగం భారతీయులు పాల్గొన్న సభికుల ఎదుట టౌన్‌హాల్ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ తల్లి గురించి జుకర్‌బర్గ్ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ భావేద్వేగానికి గురయ్యారు.

తాను పేద కుటుంబం నుంచి వచ్చానని.. చిన్నప్పుడు తనను పెంచటానికి తన తల్లి ఎన్నో కష్టాలు పడ్డారని.. పొరిగింట్లో అంట్లుతోమటం, నీళ్లు పట్టటం చేసేవారని.. కాయకష్టం చేసేవారని తెలిపారు. ఇది తన ఒక్కడి విషయంలోనే కాదని.. భారత్‌లో ఎంతోమంది తల్లులు తమ పిల్లల కోసం జీవితాలు మొత్తం త్యాగం చేస్తారని చెప్తూ.. వారందరికీ వేల వేల వందనాలు తెలిపారు. ప్రస్తుతం 90 ఏళ్ల వయసున్న తన తల్లి ఇప్పుడు కూడా తన పనులన్నీ తానే చేసుకుంటారని చెప్పారు. ఆమె చదువుకోలేదని.. అయితే టెలివిజన్ ద్వారా వార్తలు.. ప్రపంచంలో ఏం జరుగుతుందనేది తెలుసుకుంటారని వివరించారు. మార్క్ జుకర్‌బర్క్ ప్రపంచాన్ని మార్చివేశారంటూ ఆయన తల్లిదండ్రులకు మోదీ అభినందనలు తెలిపారు.
 
పెట్టుబడులకు భారత్ స్వర్గధామం... పెట్టుబడిదారులు భారత్ స్వర్గధామమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభివర్ణించారు. ‘‘డబ్బుకు కొరవ ఉందని నేను భావించటం లేదు. దేశాల వద్ద డబ్బు ఉంది.. కానీ ఎక్కడ పెట్టుబడి పెట్టాలో వారికి తెలియదు. నేను వారికి ఆ చిరునామా ఇస్తున్నా.. ఇదే (ఇండియా) ఆ ప్రాంతం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం 8 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్న భారత ఆర్థికవ్యవస్థను 20 లక్షల కోట్ల డాలర్లకు పెంచాలన్నది తన లక్ష్యమని చెప్పారు. అందుకోసం భారత్‌లో వ్యాపారం చేయటం సులభతరం చేయటానికి, నియంత్రణను తొలగించటానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

భారత్‌లో సంస్కరణలు వేగంగా సాగుతున్నాయని.. పెట్టుబడిదారులు కోల్పోయిన విశ్వాసాన్ని గత 15 నెలల్లో పునరుద్ధరించగలిగామని పేర్కొన్నారు. గత 15 నెలల్లో ఒక్క అమెరికా నుంచే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 87 శాతం పెరిగాయని.. ప్రపంచ వ్యాప్తంగా మాంద్యం ఉన్నప్పటికీ ఎఫ్‌ఐఐలు 40 శాతం పెరిగాయని చెప్పారు. ‘‘ఇండియా చాలా పెద్ద దేశం. సంస్కరణల వల్ల మార్పులు కనిపించటానికి కొంత సమయం పడుతుంది. ఎటువైపు వెళుతోందో సులభంగా చూడగలగటానికి అది ఒక స్కూటర్ కాదు.. 40 బోగీలున్న ఒక రైలు కొంత సమయం తీసుకుంటుంది’’ అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘‘భారత్‌లో బ్యాంకుల జాతీయీకరణ 40 ఏళ్ల కిందట జరిగింది. కానీ నా ప్రభుత్వం జన్‌ధన్ పథకం ప్రవేశపెట్టే వరకూ 60 శాతం జనాభాకు బ్యాంకు ఖాతాల్లేవు.

మా ప్రభుత్వం తొలి 100 రోజుల్లోనే 18 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిచింది’’ అని తెలిపారు. వ్యవసాయం, సేవలు, తయారీ - ఈ మూడు రంగాలతో పాటు.. భౌతిక, డిజిటల్ మౌలికసదుపాయాల నిర్మాణంపై తన ప్రభుత్వం ఎక్కువ దృష్టి కేంద్రీకరించిందని చెప్పారు. దాదాపు 45 నిమిషాల పాటు సాగిన ఈ కార్యక్రమం కోసం దాదాపు 40 వేల ప్రశ్నలు రాగా.. మోదీ కేవలం ఆరు ప్రశ్నలకే సమాధానం చెప్పారు. అందులో రెండు ప్రశ్నలు జుకర్‌బర్గ్ సొంతంగా అడిగినవి. ఇదిలావుంటే.. ఫేస్‌బుక్ సంస్థలోని ‘రియల్ వాల్’పై ‘‘అహింస అతిగొప్ప ధర్మం - సత్యమేవ జయతే’’ అని ప్రధాని మోదీ లిఖించారు.
 
సోషల్ మీడియాతో నా ఆలోచనా విధానం మారింది
తన ఆలోచనా విధానంలో సోషల్ మీడియా పెద్ద మార్పు తెచ్చిందని మోదీ చెప్పారు. ‘‘నేను సోషల్ మీడియాలోకి వచ్చినపుడు.. నేను ముఖ్యమంత్రినో, ప్రధానమంత్రినో అవుతానని నాకు తెలియదు. ప్రపంచం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉండేది. ప్రపంచం గురించిన సమాచారం తెలుసుకునేందుకు సోషల్ మీడియా నాకు సాయపడింది. నా ఆలోచనా విధానంలో ఇది పెద్ద మార్పు తెచ్చింది’’ అని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘‘ప్రభుత్వాన్ని - ప్రజలను నిరంతరం అనుసంధానించే శక్తి సోషల్ మీడియాకు ఉంది. పొరపాటు ఏమిటనేది వెంటనే తెలిసిపోతుంది. తద్వారా ప్రభుత్వం దానిని సరిచేసే చర్యలు చేపట్టవచ్చు. సోషల్ మీడియా కారణంగా రోజు వారీ ఓటింగ్ ఉంటుంది. ఇది ప్రజాస్వామ్యానికి చాలా బలం. నా పరిపాలనలో సోషల్ మీడియా పాత్ర చాలా ఉంది’’ అని ఆయన వివరించారు.
 
గూగుల్ ఆఫీస్‌లో మోదీ
సాన్‌జోస్: ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం గూగుల్ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు.  సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్, గూగుల్ సహ వ్యవస్థాపకుడు ల్యారీ పేజ్, మాజీ సీఈఓ ఎరిక్ ష్మిట్‌తో కలిసి కార్యాలయ ప్రాంగణంలో పర్యటించారు. ఈ సందర్భంగా సంస్థ కీలక ప్రాజెక్టుల గురించి వారు మోదీకి వివరించారు. గూగుల్ స్ట్రీట్ వ్యూ, గూగుల్ ఎర్త్ మొదలైన వాటి ఉపయోగాల గురించి చెప్పారు. డిజిటల్ ఇండియా గురించి చర్చించారు. అనంతరం ఉద్యోగులనుద్దేశించి ప్రసంగించారు. తన డిజిటల్ ఇండియా స్వప్నం గురించి వారికి వివరించారు. సాంకేతిక పరిజ్ఞానం ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఉపయోగపడుతుందన్నారు. భారతీయ రైల్వే, గూగుల్ భాగస్వామ్యంతో 500 రైల్వే స్టేషన్లలో ఆధునిక సాంకేతిక సౌకర్యాలు కల్పించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement