Digital India program
-
'ఒకప్పుడు మన పెళ్లిళ్లలో డబ్బుల వర్షం కురిపించేవారు'
దేశ వ్యాప్తంగా డిజిటల్ ఇండియా నినాదం మారు మ్రోగుతుంది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా.. పచారీ కొట్టునుంచి కిల్లీ కొట్టు దాకా ఎటు చూసినా గూగుల్ పే, ఫోన్ పే ఈ క్యూ ఆర్ కోడ్లే కనిపిస్తున్నాయి. నగరాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఈ చెల్లింపులు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో దేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవాన్ని ఉదహరిస్తూ గతంలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆసక్తికర వీడియో షేర్ చేశారు. పండుగ సమయంలో ఇంటింటికీ తిరిగే గంగిరెద్దులను ఆడించే వారు కూడా డిజిటల్ రూపంలో భిక్షాటన చేస్తున్న వీడియోను మంత్రి ట్విటర్లో షేర్ చేస్తూ.. డిజిటల్ విప్లవం జానపద కళాకారుల వైపుకు కూడా చేరుకుందని ఆమె తెలిపారు. There was a time money was showered in our weddings. Now in digital India……. pic.twitter.com/g4BApTbPLw — Harsh Goenka (@hvgoenka) August 24, 2022 తాజాగా డిజిటల్ ఇండియాపై ప్రముఖ వ్యాపారవేత్త, ఆర్పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష గోయెంకా ఓ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. పెళ్లికి వచ్చిన అతిధుల్లో ఉత్సాహం నింపిందేకు బరాత్‌లో డప్పు వాయిస్తున్నారు. వారిలో ఓ అతిధి డప్పు చప్పుళ్లకు ఫిదా అయ్యాడు. అంతే డబ్బు వాయిస్తున్న వారి వద్దకు వెళ్లి డప్పుకున్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి రూ.50 చెల్లించారు. ఆ వీడియోకు...'ఒకప్పుడు మన పెళ్లిళ్లలో డబ్బుల వర్షం కురిపించేవారు. ఇప్పుడు సాధ్యం కాదు. ఎందుకంటే ఇది డిజిటల్ ఇండియా అంటూ పేర్కొన్నారు. -
టెక్ ఇండియా... 75 ఏళ్లలో సాధించిన పురోగతి ఇదే
Technology Achievements Of India: 1947 నుంచి ఇప్పటివరకూ ఒక దేశంగా మనం సాధించిన ఘన విజయాలను ఒక్కసారి నెమరేసుకుంటే.. విస్పష్టంగా అందరికీ కనిపించేవి శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో సాధించిన ప్రగతే. సామాన్యుల బతుకులపైనా ప్రభావం చూపిన ఆవిష్కరణలు, పరిశోధనలు కోకొల్లలు. అంగారకుడిపైకి చౌకగా నౌకను పంపామని... ఏకకాలంలో 104 ఉపగ్రహాలను ప్రయోగించడంలో విజయం సాధించామన్నది ఎంత నిజమో... దిగుమతులపై ఆధారపడిన దశ నుంచి కావాల్సినంత పండించుకుని తినడమే కాకుండా... ఎగుమతులూ చేస్తున్న ఆహార, పాడి సమృద్ధి కూడా అంతే వాస్తవం. అనుకూలమైన విధానాలూ తోడవడంతో ఆహారం, పాలు, పండ్లు, కాయగూరలు, వ్యాక్సిన్లు, మందుల తయారీలో ఇంకొకరిపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోయింది. రక్షణ రంగంలోనూ సొంతంగా మన కాళ్లపై మనం నిలబడగలిగే స్థాయికి భారత్ ఎదిగింది. ఎదుగుతోంది కూడా. 1947లో స్థూల జాతీయోత్పత్తిలో శాస్త్ర పరిశోధనలకు కేటాయించింది 0.1 శాతం మాత్రమే అయినప్పటికీ గత దశాబ్ద కాలంలో ఇది ఒక శాతానికి కొంచెం దిగువన మాత్రమే ఉండటం కొంత ఆందోళన కలిగించే అంశం. మొత్తమ్మీద శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో స్వాతంత్య్రానంతరం మనం సాధించిన ఘన విజయాలను స్థూలంగా తరచి చూస్తే... హరిత విప్లవం... 1947లో దేశం పండించిన గోధుమలు కేవలం 60 లక్షల టన్నులు. డిమాండ్‌కు తగ్గట్టుగా ఉత్పత్తి లేని నేపథ్యంలో అప్పట్లో అమెరికా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. అయితే భూ సంస్కరణలతోపాటు భాక్రా–నంగల్, శ్రీశైలం, నాగార్జున సాగర్ వంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టులను చేపట్టడంతో పరిస్థితిలో మార్పులు మొదలయ్యాయి. సొంతంగా ఎరువుల ఉత్పత్తి కూడా చేపట్టడం, వ్యవసాయ విస్తరణ కార్యకలాపాలకు ప్రాధాన్యం ఇవ్వడం ఫలితంగా 1964 నాటికి గోధుమల ఉత్పత్తి రెట్టింపు అయ్యింది. అయినప్పటికీ దేశీయ అవసరాలకు సరిపోని పరిస్థితి. మెరుగైన వంగడాలను అభివృద్ధి చేసేందుకు భారత వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త బెంజిమన్ పియరీ పాల్ చేపట్టిన పరిశోధనలు 1961లో ఫలప్రదమవడంతో గోధుమ దిగుబడులు గణనీయంగా పెరిగాయి. చీడపీడల బెడద కూడా తగ్గింది. ఈ నేపథ్యంలో అధిక దిగుబడులిచ్చే వంగడాల అభివృద్ధే లక్ష్యంగా హరిత విప్లవం మొదలైంది. గోధుమతోపాటు, వరి, మొక్కజొన్న, జొన్న వంటి పంటల్లో కొత్త వంగడాలు వృద్ధి చేయడం మొదలైంది. 1947లో బెల్ ల్యాబ్స్ తొలి ట్రాన్సిస్టర్‌ను తయారు చేయగా.. అప్పట్లో దాన్ని మనుషులు చేతులతో తయారు చేసే పరిస్థితి ఉండేది. ఈనాటి ట్రాన్సిస్టర్ సైజు ఎంతుంటుందో తెలుసా? సూదిమొనపై చాలా సులువుగా పదికోట్ల ట్రాన్సిస్టర్లను పెట్టేయవచ్చు. ఎంఎస్ స్వామినాథన్ వంటి శాస్త్రవేత్తలు తమదైన సహకారం అందించారు. చదవండి : మస్తు ఫీచర్లతో మడత ఫోన్లు..ఇరగదీస్తున్నాయిగా క్షీర విప్లవం... స్వాతంత్య్రం వచ్చేనాటికి ఆహారంతోపాటు పాల ఉత్పత్తులను కూడా దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. పసిపిల్లలకు వాడే పాల ఉత్పత్తులు, వెన్న, చీజ్ వంటివి దిగుమతయ్యేవి. 1955లో భారత్ యూరప్ నుంచి మొత్తం 500 టన్నుల వెన్న, మూడు వేల టన్నుల పిల్లల ఆహారాన్ని దిగుమతి చేసుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గుజరాత్లో కైరా డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ యూనియన్ లిమిటెడ్ ప్రారంభంతో ఈ పరిస్థితిలో మార్పులు మొదలయ్యాయి. స్వాతంత్య్రానికి ఏడాది ముందు ఈ సంస్థ త్రిభువన్ దాస్ పటేల్ నేతృత్వంలో ప్రారంభమైంది. 1949లో తన పై చదువులకు సహకరించిన ప్రభుత్వానికి ఇచ్చిన మాటకు అనుగుణంగా వర్ఘీస్ కురియన్ గుజరాత్‌లోని ఆనంద్‌కు రావడం, అమూల్ ప్రారంభంతో దేశంలో క్షీర విప్లవం మొదలైంది. తొలినాళ్లలో అమూల్ సేకరించే పాల సరఫరా విషయంలో కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. పాలపొడి తయారీ టెక్నాలజీ అప్పట్లో యూరోపియన్ దేశాల్లో మాత్రమే ఉండేది. పైగా వాళ్లేమో బర్రెపాలను పొడిగా మార్చలేమని చెప్పేవారు. కానీ.. కురియన్‌తో పాటు అమూల్‌లో పనిచేసిన హెచ్.ఎం.దహియా అనే యువ డెయిరీ ఇంజినీర్ ప్రయోగాలు చేపట్టి బర్రెపాలను పొడిగా మార్చవచ్చునని నిరూపించారు. ప్రపంచంలోనే ఇది తొలిసారి కావడం చెప్పుకోవాల్సిన విషయం. పెయింట్ పిచికారి చేసే యంత్రం, గాలిని వేడి చేసే యంత్రాల సాయంతో తయారైన ఈ టెక్నాలజీ కాస్తా దేశంలో పాల దిగుబడి అవసరానికి మించి పెరిగేలా చేసింది. ఎంతలా అంటే... ప్రపంచమంతా కోవిడ్–19తో సతమతమవుతున్న సమయంలో భారత్ ఏకంగా 550 కోట్ల రూపాయల విలువ చేసే పాల ఉత్పత్తులను ఎగుమతి చేసేంత! చదవండి : సిరులిచ్చే.. సోయగాల చేపలు! ఉపగ్రహాలు, సమాచార విప్లవం... 1960లలో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ ఛైర్మన్‌గా విక్రమ్ సారాభాయ్ సమాచార ప్రసారాలు, రిమోట్ సెన్సింగ్, వాతావరణ అంచనాల కోసం ఉపగ్రహ టెక్నాలజీని వాడుకోవాలని అంటూంటే.. ఆయన్ను నమ్మేవారు చాలా తక్కుమంది మాత్రమే ఉండేవారు. సొంతంగా రాకెట్లు తయారు చేసే జ్ఞానమెక్కడిదని చాలామంది విమర్శించేవారు కూడా. విక్రమ్ సారాభాయ్ ఉపగ్రహాల సాయంతో దేశంలో విద్య, వైద్య, గ్రామీణాభివృద్ధి రంగాల్లో వృద్ధి సాధించాలని కలలు కనేవాడు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) స్థాపనతో ఈ కలల సాకారం మొదలైంది. దశాబ్దకాలంలోనే దేశం సొంతంగా రాకెట్‌ను తయారు చేయడంతోపాటు అంతరిక్ష ప్రయోగాలను శాంతి కోసం వాడుకోవచ్చునని నిరూపించారు. ఆర్యభట్ట ఉపగ్రహం సాయంతో శాటిలైట్ ఇన్స్ట్రక్షనల్ టెలివిజన్ ఎక్స్‌పెరిమెంట్‌ను విజయవంతంగా పూర్తి చేయడంతో అంతరిక్ష రంగంలో భారత్ తన ముద్రను వేయడం మొదలుపెట్టింది. తరువాతి కాలంలో ఇన్శాట్, ఐఆర్ఎస్ శ్రేణి ఉపగ్రహాల ప్రయోగాలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఆఖరుకు చంద్రయాన్ –1తో జాబిల్లిపై నీటి ఛాయలను నిర్ధారించగలగడంతోపాటు తొలి ప్రయత్నంలోనే అంగారకుడిని అందుకున్న దేశంగానూ రికార్డు స్థాపించింది. హాలీవుడ్ సినిమా కంటే తక్కువ బడ్జెట్‌తో అంగారకుడిపైకి మంగళ్యాన్ ఉపగ్రహాన్ని పంపించడం వెనుక ఉన్న భారతీయ శాస్త్రవేత్తల మేధకు ప్రపంచం జేజేలు కొట్టింది. వీశాట్ టెక్నాలజీ వాడకం ద్వారా 1980లలో బ్యాంకింగ్ సేవలు దేశం మూలమూలలకు చేరుకుంది. ఉపగ్రహాల సాయంతో తుపానులను ముందుగా గుర్తించడం వీలు కావడంతో వేలాది ప్రాణాలను రక్షించగలుగుతున్నాం. ఫార్మా, వ్యాక్సిన్ తయారీల్లో... మీకు తెలుసా... ప్రపంచం మొత్తమ్మీద వేసే ప్రతి వ్యాక్సిన్‌లో మూడో వంతు భారత్‌లోనే తయారవుతున్నాయని వ్యాక్సిన్లు మాత్రమే కాదు.. ఫార్మా రంగంలోనూ భారత్ సాధించిన ప్రగతి కచ్చితంగా ఎన్నదగ్గదే. జెనెరిక్ మందుల తయారీతో పేద దేశాల్లో హెచ్ఐవీ వంటి ప్రాణాంతక వ్యాధులకు బలవుతున్న లక్షలాది ప్రాణాలను కాపాడగలగడం ఆషామాషీ వ్యవహారం ఏమీ కాదు. మేధాహక్కుల పేరుతో విపరీతమైన లాభాలను గడించే ఫార్మా కంపెనీల ఆటలకు అడ్డుకట్ట పడిందిలా. విదేశీ ఫార్మా కంపెనీల దోపిడీకి చెక్ పెట్టే లక్ష్యంతో భారత ప్రభుత్వం 1954లో హిందుస్థాన్ యాంటీబయాటిక్స్‌ను ప్రారంభించింది. ఆ వెంటనే సోవియెట్ యూనియన్ సాయంతో హైదరాబాద్‌లో ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (ఐడీపీఎల్) ఏర్పాటు జరిగింది. నేషనల్ కెమికల్స్ లాబొరేటరీ, రీజనల్ రీసెర్చ్ లాబొరేటరీ (తరువాతి కాలంలో దీని పేరును ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీగా మార్చారు), సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వంటి ప్రభుత్వ సంస్థలు తమ వంతు పాత్ర పోషించడంతో అనతి కాలంలోనే అటు వ్యవసాయానికి సంబంధించిన ఎరువుల తయారీ మొదలుకొని ఇటు మందుల తయారీలోనూ ప్రపంచ గుర్తింపు పొందే స్థాయికి ఎదగగలిగాం. 1970లో పేటెంట్ హక్కుల్లో మార్పులు రావడంతో దేశంలో జెనెరిక్ మందుల వెల్లువ మొదలైంది. సిప్రోఫ్లాక్సిన్, డైక్లోఫెనాక్, సాల్బుటమాల్, ఒమిప్రొజోల్, అజిత్రోమైసిన్ వంటి మందులను భిన్నమైన పద్ధతిలో తయారు చేసి పెటెంట్ రాయల్టీల చెల్లింపుల సమస్యను అధిగమించగలిగారు. సి–డాట్‌తో టెలికామ్ రంగంలో పెనుమార్పులు... స్వాతంత్య్రం వచ్చే సమయానికి అనేక ఇతర రంగాల మాదిరిగానే టెలికామ్ రంగంలోనూ విదేశీ కంపెనీల హవా నడుస్తూండేది. విదేశీ మారక ద్రవ్యం నిల్వలు తక్కువగా ఉండటం.. విదేశీ కంపెనీలేమో విపరీతమైన ధరలను వసూలు చేస్తున్న నేపథ్యంలో టెలికామ్ రంగంలోనూ స్వావలంబనకు ఆలోచనలు మొదలయ్యాయి. 1970లలో ఒక ఫోన్ కనెక్షన్ కావాలంటే ఎంత కాలం వేచి ఉండాల్సి వచ్చేదో కొంతమందికి అనుభవమే. గ్రామీణ ప్రాంతాల్లో సమాచార వ్యవస్థలు అస్సలు ఉండేవే కావు. ఈ నేపథ్యంలో 1960లలో టెలికామ్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటైంది. పూర్తి స్వదేశీ టెక్నాలజీతోనే టెలిఫోన్ ఎక్సే్ఛంజీని ఏర్పాటు చేసే ప్రయత్నానికి శ్రీకారం పడింది. 1973లో వంద లైన్లతో తొలి ఎలక్ట్రానిక్ స్విచ్ తయారవడంతో టెలికామ్ రంగంలో దేశీ ముద్రకు బీజం పడినట్లు అయ్యింది. అదే సమయంలో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ఐఐటీ బాంబేలు మిలటరీ అవసరాల కోసం డిజిటల్ ఆటోమెటిక్ ఎలక్ట్రానిక్ స్విచ్‌లను అభివృద్ధి చేశాయి. 1984లో శ్యామ్ పిట్రోడా నేతృత్వంలో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమ్యాటిక్స్ (సీ–డాట్) ఏర్పాటుతో గ్రామీణ ప్రాంతాల్లోనూ సొంత టెలిఫోన్ ఎక్సే్ఛంజీల నిర్మాణం మొదలైంది. ఈ టెక్నాలజీని ప్రైవేట్ రంగానికి ఉచితంగా మళ్లించడంతో మల్టీనేషనల్ కంపెనీల గుత్తాధిపత్యానికి తెరపడింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ సమాచార వ్యవస్థలు ఏర్పడటం మొదలైంది. ఏసీల అవసరం లేకుండా.. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో పనిచేయగల భారతీయ టెలిఫోన్ ఎక్సే్ఛంజ్ టెక్నాలజీ సీ–డాట్ అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలకూ సాయపడటం కొసమెరుపు! రైల్వేల కంప్యూటరీకరణ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ... ఐబీఎం, ఐసీఎల్... స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశంలో డేటా ప్రాసెసింగ్ పరిశ్రమలో ఆధిపత్యం చలాయించిన రెండు కంపెనీలు ఇవి. రెండూ విదేశీ బహుళజాతి కంపెనీలే. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలతోపాటు రక్షణ, పరిశోధన సంస్థల్లోనూ ఈ కంపెనీలు తయారు చేసిన డేటా ప్రాసెసింగ్ యంత్రాలనే వాడేవారు. విదేశాల్లో వాడిపడేసిన యంత్రాలను భారత్‌కు తెచ్చి అధిక ధరలకు లీజ్‌కు ఇచ్చేవి ఈ కంపెనీలు. నేషనల్ శాంపిల్ సర్వే, అణురియాక్టర్ తయారీ వంటి ప్రాజెక్టుల కోసం ఈ డేటా ప్రాసెసింగ్ యంత్రాల అవసరమైతే భారత్‌కు ఎంతో ఉండేది. ఈ అవసరాన్ని ఐబీఎం, ఐసీఎల్లు రెండూ తమకు అనుకూలంగా మలచుకున్నాయి. ఈ నేపథ్యంలో వీరి గుత్తాధిపత్యానికి తెరవేసే ప్రయత్నంలో భాగంగా హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్లను సొంతంగా తయారు చేసుకోవాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. 1970లలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్‌తోపాటు ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్), కంప్యూటర్ మెయింటెనెన్స్ కార్పొరేషన్ (సీఎంసీ)లను స్థాపించింది. ఈ సంస్థల ద్వారా జరిపిన ప్రాథమిక పరిశోధనల ఫలితంగా ప్రపంచంలోనే అత్యంత సమర్థమైన రైల్వే రిజర్వేషన్ ప్రాజెక్టు 1986కల్లా అందుబాటులోకి వచ్చింది. ఇవి మాత్రమే కాదు.. మత్స్య సంపదను వృద్ధి చేసేందుకు తద్వారా మత్స్యకారులకు తగినంత జీవనోపాధి కల్పించేందుకు కూడా స్వాతంత్య్రం తరువాతే ప్రయత్నాలు మొదలయ్యాయి. 1970లలో తొలి పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఫిష్ ఫార్మర్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ స్థాపనతో మొదలైన ఈ కార్యక్రమం తరువాతి కాలంలో బహుముఖంగా విస్తరించింది. పలు రాష్ట్రాల్లో చేపల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు సంస్థలు, కార్యక్రమాలు మొదలయ్యాయి. ∙గిళియార్ గోపాలకృష్ణ మయ్యా -
జిల్లాలో ఉర్దూ వెబ్సైట్..
సాక్షి, మహబూబ్‌నగర్ : డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా పరిపాలనా వ్యవస్థలో అనేక మార్పులకు, అభివృద్ధి కార్యక్రమాలకు వేదికైన మహబూబ్‌నగర్ జిల్లా నేడు మరో అడుగు ముందుకేసింది. ఇప్పటివరకు ఇంగ్లీషు, తెలుగులోనే అందుబాటులో ఉండే మహబూబ్‌నగర్ జిల్లా వెబ్‌సైట్‌ను సరికొత్తగా ఉర్దూ భాషలోనూ అందుబాటులోకి వచ్చింది. ఉర్దూ మాట్లాడే, చదివే వారికోసం స్వాస్ సాంకేతిక టెక్నాలజీ సహాయంతో ఈ ఉర్దూ వెబ్‌సైట్‌ను రూపకల్పన చేశారు. ఉర్దూలో మహబూబ్‌నగర్ జిల్లా ఎన్ఐసీ వెబ్సైట్ ప్రస్తుతం అందుబాటులోకి రావడంపై ఉర్దూ భాష మాట్లాడే వారు సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పటికే జిల్లాలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టిన జిల్లా కలెక్టర్ డి.రొనాల్డ్‌రోస్ ఈ సరికొత్త ప్రయోగానికి నాంది పలికారు. ఉర్దూ భాషలో మహబూబ్‌నగర్ జిల్లా వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ఎన్ఐసీ అధికారులు అందుబాటులో ఉన్న సాంకేతిక టెక్నాలజీ వినియోగించి తుది మెరుగులు దిద్దారు. నెల రోజులపాటు కసరత్తు చేసిన ఎన్ఐసీ అధికారులు తాజాగా అందుబాటులోకి వచ్చిన మహబూబ్‌నగర్ జిల్లా ఉర్దూ వెబ్‌సైట్‌కు అంకురార్పన చేశారు. దేశంలోనే మొదటిసారి.. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డిజిటల్ ఇండియా కార్యక్రమంలో బాగంగా దేశంలోనే మొదటిసారిగా మహబూబ్‌నగర్ జిల్లా వెబ్‌సైట్‌ను ఉర్దూలో అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికే ఈ వెబ్‌సైట్‌ను ఇంగ్లిష్, తెలుగులో నిర్వహిస్తుండటమే కాకుండా అంధులకు, దృష్టిలోపం ఉన్నవారికి సైతం అందుబాటులోకి తెచ్చారు. తాజాగా ఉర్దూ భాషలోనూ వెబ్సైట్ ద్వారా మహబూబ్‌నగర్ జిల్లా తాజా సమాచారాన్ని ప్రజలకు చేరవేసేందుకు జిల్లా యంత్రాంగం చేసిన కృషి మెరుగైన ఫలితాలు తీసుకురానుంది. అయితే జిల్లాలో ఇప్పటికే డిజిటల్ ఇండియా కార్యక్రమంలో బాగంగా ఈ–ఆఫీస్ విధానంతో ప్రభుత్వ కార్యాలయాలన్నింటిని అనుసంధానం చేసి ఫైళ్ల నిర్వహణను అత్యంత సులభతరం చేయడంలో కలెక్టర్ రొనాల్డ్‌రోస్ సఫలీకృతులయ్యారు. ప్రతీ అధికారి, కింది స్థాయి సిబ్బంది ఎవరూ కార్యాలయాల చుట్టూ సంతకాల కోసం, అనుమతుల కోసం తిరిగే వీలు లేకుండా తమ కార్యాలయం నుండే ఈ–ఆఫీస్ విధానంతో క్షణాల్లో అనుతులు తీసుకునే వెసులుబాటును అందుబాటులోకి తెచ్చారు. అఖిలపక్ష పార్టీల ముస్లిం నాయకుల సమక్షంలో.. ఈ విధానంతో పనిభారం తగ్గడమే కాకుండా అధికారులు అందుబాటులో ఉండే అవకాశం కలిగింది. ఇదిలాఉండగా, ఉర్దూ వెబ్‌సైట్‌ను మొదటిసారిగా అందుబాటులోకి తేవడం ఎంతో గర్వకారణమని జిల్లా అఖిలపక్ష పార్టీల ముస్లిం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు కలెక్టర్ రొనా ల్డ్‌రోస్ సోమవారం ప్రజావాణి కార్యక్రమం వేదికగా అఖిలపక్ష పార్టీల ము స్లిం నాయకుల సమక్షంలో ఉర్దూ వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ వెబ్సైట్ రూపకల్పనకు స్వాస్ సాంకేతిక టెక్నాలజీ ఎంతో ఉపయోగపడిందని, ఎన్ఐసీ అధికారుల శ్రమ ఫలితంగా ఉర్దూ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించేందుకు వీలుకలిగిందని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ అన్నారు. -
డిజిటల్ ఇండియాలోకి టెక్ దిగ్గజాలు
500 రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫైకి గూగుల్ సహకారం... * 5 లక్షల గ్రామాల్లో మైక్రోసాఫ్ట్ చౌక బ్రాడ్‌బ్యాండ్ * భారత్‌లో ప్లాంట్ ఏర్పాటుపై యాపిల్ సానుకూలత! శాన్‌జోస్: ప్రధాని నరేంద్ర మోదీ తలపెట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమానికి సహకారం అందించేందుకు ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాలు ముందుకొచ్చాయి. అమెరికా పర్యటనలో భాగంగా మోదీ సిలికాన్ వ్యాలీలో అగ్రగామి ఐటీ కంపెనీల చీఫ్‌లతో సమావేశంలో ఈ కీలక ప్రకటనలు వెలువడ్డాయి. గూగుల్ ఉచిత వైఫై... దేశంలో 500 రైల్వే స్టేషన్లలో ఉచితంగా వైఫై సౌకర్యాన్ని అందించేందుకు గూగుల్ సహకారం అందించనుంది. గుజరాతీతో సహా 10 భారతీయ భాషల్లో టైపింగ్‌కు అవకాశం కల్పించనున్నట్లు కూడా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటించారు. వచ్చే నెలలో ఈ సౌకర్యం అందుబాటులోకి రానుందని చెప్పారు. డిజిటల్ లిటరసీ(పరిజ్ఞానం)ని అందరికీ అందించాలంటే స్థానిక భాషల్లో టైపింగ్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుందని.. అందుకే తాము ఈ చర్యలు చేపడుతున్నట్లు పిచాయ్ పేర్కొన్నారు.ఇంకా అనేక కనెక్టివిటీ ప్రాజెక్టులపై కూడా గూగుల్ దృష్టిపెట్టినట్లు ఆయన వెల్లడించారు. భవిష్యత్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తృతం చేయడంలో భారత్ అతిపెద్ద పాత్ర పోషించనుందన్నారు. దీనివల్ల ప్రజల జీవనప్రమాణాలు కూడా మెరుగవుతాయని చెప్పారు. నవకల్పనలు, ఎంట్రప్రెన్యూర్షిప్లకు రానున్న కాలంలో భారత్‌ను అత్యంత కీలక కేంద్రంగా మార్చడానికి ప్రధాని మోదీ చాలా కృషిచేస్తున్నారని ఈ సందర్భంగా పిచాయ్ వ్యాఖ్యానించారు. కాగా, భారత్‌లో వివిధ రంగాల్లో ప్రగతి, పరిణామాలను చూసి గూగుల్ చాలా గర్వపడుతోందని, డిజిటల్ ఇండియా పట్ల ప్రధాని మోదీ దార్శనికత అబ్బురపరుస్తోందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ‘అసలు నవకల్పనలకు సంబంధించిన స్ఫూర్తి భారతీయుల డీఎన్ఏలోనే ఉంది.. దీంతో వారు చాలా గొప్ప ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకొస్తున్నారు. ఇదే స్ఫూర్తి ఇక్కడ మమ్మల్నీ నడిపిస్తోంది’ అని గూగుల్ చీఫ్ పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ చౌక బ్రాడ్‌బ్యాండ్.... మోదీతో సమావేశం సందర్భంగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కూడా భారత్‌లో తన ప్రణాళికలను ప్రకటించారు. ముఖ్యంగా భారత్‌లోని 5 లక్షల గ్రామాలకు చౌకగా బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు చెప్పారు. దీనికోసం ప్రభుత్వంతో జట్టుకట్టనున్నామని కూడా ఆయన తెలిపారు. మరోపక్క, భారత్‌లో తమ డేటా సెంటర్ల నుంచి క్లౌడ్ సేవలను నిర్వహించనున్నామని, వచ్చే వారంలోనే ఇది ప్రారంభం కానున్నట్లు నాదెళ్ల చెప్పారు. దీన్ని పెద్ద మైలురాయిగా ఆయన అభివర్ణించారు. ‘డిజిటల్ ఇండియాలో మేం కూడా భాగస్వాములమవుతాం. చౌక బ్రాండ్‌బ్యాండ్ కనెక్టివిటీ, అదేవిధంగా క్లౌడ్ కంప్యూటింగ్ పరిజ్ఞానంతో ప్రభుత్వాలు, ప్రజలు, వ్యాపారాలు అన్నింటికీ మేలు చేకూరుతుంది. అన్నిస్థాయిల్లో సామర్థ్యం, ఉత్పాదకత, సృజనాత్మకతను పెంపొందించేందుకు తోడ్పడుతుంది’ అని నాదెళ్ల పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియాల ద్వారా భారత్‌లో ప్రపంచస్థాయి మౌలికసదుపాయాలను అభివృద్ధి చేసేందుకు వీలవుతుందన్నారు. భారత్‌కు యాపిల్! భారత్‌లో తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా ప్రధాని మోదీ యాపిల్ సీఈవో టిమ్ కుక్‌ను కోరారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. భారత్‌లో అపారమైన అవకాశాలున్నాయని.. అందుకే ఇక్కడ ప్లాంట్‌ను నెలకొల్పాల్సిందిగా మోదీ పేర్కొన్నట్లు సమావేశం అనంతరం విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ వెల్లడించారు. యాపిల్‌కు కాంట్రాక్టు తయారీ సంస్థ అయిన ఫాక్స్‌కాన్ కూడా భారత్‌లో ప్లాంట్‌ను నెలకొల్పాలని నిర్ణయించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. మోదీతో భేటీ సందర్భంగా కుక్ భారత్‌పట్ల చాలా ఆసక్తిని వ్యక్తం చేసినట్లు కూడా స్వరూప్ తెలిపారు. ‘యాపిల్‌లోని ప్రతి ఉద్యోగి మదిలో భారత్ అంటే చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎందుకంటే మా కంపెనీ సహ-వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ చిన్నవయస్సులో ఉన్నప్పుడు ప్రేరణ కోసం భారత్‌కు వెళ్లిరావడమే. ఆతర్వాత యాపిల్ ఏర్పాటుకు బీజాలు పడ్డాయి. ప్రధాని మోదీ తలపెట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమంలో పాలుపంచుకోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఇది భారత్ రూపురేఖలను సమూలంగా మార్చేయగలదు(గేమ్ చేంజర్). మేం భారత్‌లో 20 ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాం. ఇక్కడ అత్యంత ఉత్సాహవంతమైన వినియోగదారులు ఉన్నారు’ అని కుక్ పేర్కొన్నారు. స్టార్టప్‌లకు క్వాల్కామ్ 15 కోట్ల డాలర్ల నిధులు.. భారత్‌లో స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు క్వాల్కామ్ ముందుకొచ్చింది. వీటికి 15 కోట్ల డాలర్ల(దాదాపు రూ.975 కోట్లు) మేర నిధులను అందించనున్నట్లు మోదీతో భేటీ సందర్భంగా క్వాల్కామ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పాల్ జాకబ్స్ ప్రకటించారు. ‘భారత్‌లోని వినూత్న స్టార్టప్‌లకు సహకారం అందించేందుకు కట్టుబడి ఉన్నాం. మోదీతో భేటీ సందర్భంగా ఆయన తలపెట్టిన డిజిటల్ ఇండియా ప్రణాళికల గురించి చర్చించాం’ అని జాకబ్స్ పేర్కొన్నారు. భారత్‌లో డిజిటల్ విప్లవం శాన్‌జోస్: డిజిటల్ విప్లవం దిశగా భారత్ వడివడిగా అడుగులేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అమెరికా పర్యటలో భాగంగా సిలికాన్‌వ్యాలీలో ప్రపంచ అగ్రగామి ఐటీ కంపెనీల సీఈవోలతో సమావేశం సందర్భంగా తన మానస పుత్రిక అయిన ‘డిజిటల్ ఇండియా’ ప్రణాళికలను వివరించారు. డేటా గోప్యత(ప్రైవసీ), భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామని, పాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచడం తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని కూడా ఆయన టెక్ దిగ్గజాలకు హామీనిచ్చారు. మోదీతో విందు(డిన్నర్) సమావేశంలో పాల్గొన్న వారిలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, అడోబ్ చీఫ్ శాంతను నారాయణ్, క్వాల్కామ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పాల్ జాకబ్స్ తదితరులు ఉన్నారు. ఈ భేటీ సందర్భంగా డిజిటల్ ఇండియాలో భాగంగా చేపట్టబోయే పలు ప్రణాళికలను కూడా మోదీ ప్రకటించారు. ముఖ్యంగా దేశంలో పబ్లిక్ వైఫైను మరింతగా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. త్వరలోనే 500 రైల్వే స్టేషన్లలో వైఫై సౌకర్యాన్ని కల్పించనున్నామని, ఇందుకోసం గూగుల్‌తో జట్టుకట్టామని కూడా వెల్లడించారు. ఐ-వేస్ కూడా అవసరం... 6 లక్షల గ్రామాలను బ్రాడ్‌బ్యాండ్‌తో అనుసంధానించడం కోసం జాతీయ ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ విస్తరణను వేగవంతం చేస్తున్నామని ప్రధాని టెక్ సీఈవోలకు వివరించారు. ‘ఈ-గవర్నెన్స్‌తో మరింత సమర్థవంతమైన పాలన అందించేందుకు వీలవుతోంది. ఇప్పుడు భారత్‌లో 100 కోట్ల మంది మొబైల్ ఫోన్లను వినియోగిస్తున్నారు. పరిపాలనతో ప్రజలను మరింత భాగస్వామ్యం చేసేందుకు, ప్రభుత్వాన్ని వారి చెంతకు చేర్చేందుకు ఎం(మొబైల్)-గవర్నెన్స్ తోడ్పడుతుంది. స్కూళ్లు, కాలేజీన్నింటినీ బ్రాండ్‌బ్యాండ్‌తో అనుసంధానిస్తాం. పేవర్ రహిత లావాదేవీలను సాకారం చేయాలన్నదే మా సంకల్పం. దేశంలో ప్రతి ఒక్కరికీ డిజిటల్ లాకర్ సదుపాయాన్ని కల్పించనున్నాం. వ్యక్తిగత డాక్యుమెంట్లను ఇందులో దాచుకోవచ్చు. ఏ ప్రభుత్వ శాఖతో పనిఉన్నా నేరుగా వాటిని పంపడానికి వీలవుతుంది. వ్యాపారవేత్తలకు అనుమతులను వేగంగా ఇచ్చేందుకు ఈ-బిజ్ పోర్టల్‌ను నెల కొల్పాం’ అని మోదీ సీఈఓలకు వివరించారు. డిజిటల్ ఇండియాకు ఫేస్బుక్ సీఈవో మద్దతు ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ డిజిటల్ ఇండియాకు తన మద్దతును ప్రకటించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇంటర్నెట్ను అందించడానికి ప్రధాని మోదీ చేస్తున్న కృషికి అభినందనలు తెలియజేస్తూ.. జుకర్‌బర్గ్ తన ఫేస్బుక్ ప్రొఫైల్ చిత్రాన్ని మార్చారు. మార్చిన ప్రొఫైల్ చిత్రంలో భారత జెండా మధ్య భాగంలో నవ్వుతూ జుకర్‌బర్గ్ కనిపిస్తారు. అలాగే ఆయన డిజిటల్ ఇండియా కార్యక్రమానికి మద్దతు తెలియజేయాలని తన ఫాలోయర్లను కూడా కోరారు. ప్రొఫైల్ చిత్రంలో భారత జెండాలో జుకర్‌బర్గ్ టెల్సా ‘పవర్‌బాల్’పై మోదీ ఆసక్తి... అమెరికా ఆటోమొబైల్ దిగ్గజం టెల్సా మోటార్స్‌ను ప్రధాని మోదీ సందర్శించారు. అక్కడ ఆవిష్కరిస్తున్న అద్భుతమైన కొత్తకొత్త సాంకేతిక పరిజ్ఞానాలను భారత్‌లో వినియోగించడానికి ప్రధాని ఆసక్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా పునరుత్పాదక ఇంధన రంగంలో టెల్సా పరిజ్ఞానాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉపయోగించుకోవచ్చన్నారు. ‘విద్యుత్‌ను ఒక బ్యాటరీలో చాలా కాలంపాటు నిల్వ చేసుకోవడానికి వీలుగా సృష్టించిన పవర్ బాల్ టెక్నాలజీ నన్ను చాలా ఆకట్టుకుంది. ఈ బ్యాటరీ టెక్నాలజీ రైతులకు చాలా ఉపయోగపడుతుంది’ అని మోదీ ట్వీట్ చేశారు. మోదీకి ప్లాంట్‌ను స్వయంగా దగ్గరుండి చూపించిన టెల్సా సీఈఓ ఎలాన్ మస్క్... సోలార్ విద్యుత్, బ్యాటరీల ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలను అందించవచ్చనేది ప్రధానితో చర్చించినట్లు చెప్పారు. 2003లో నెలకొల్పిన టెల్సా.. ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేస్తుంది. -
ఉద్యమంలా డిజిటల్ ఇండియా కార్యక్రమం
- ర్యాలీని ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ చంద్రుడు విజయవాడ : డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు మనవంతు బాధ్యత నిర్వహించినట్లేనని జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు విద్యార్థులకు పిలుపునిచ్చారు. స్థానిక బెంజిసర్కిల్ వద్ద 2కె డిజిటల్ ఇండియా ర్యాలీని శనివారం ఆయన ప్రారంభించారు. ర్యాలీ బందరు రోడ్డులోని సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది. అనంతరం జేసీ మాట్లాడుతూ డిజిటల్ ఇండియా కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసేందుకు ఆధార్ నంబర్‌ను అనుసంధానంగా సంబంధిత వ్యక్తుల సర్టిఫికెట్లు తదితర ధ్రువపత్రాలను భద్రపర్చుకొనే సౌలభ్యం కల్పించినట్లు వివరించారు. ఈ విధానం ద్వారా విద్యార్థులు సర్టిఫికెట్లను అంతర్జాలంలో ఉంచుకోవడం ద్వారా పూర్తి భద్రతకు అవకాశం ఉందన్నారు. ప్రతి నిత్యం కోట్ల కొద్ది పేపర్ల ద్వారా లావాదేవీలు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ డిజిటల్ లాకర్‌ను పొందాలని అన్నారు. మీ-సేవా కేంద్రాల్లో నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రాంతీయ ఇంటర్మీడియెట్ అధికారి రాజారావు, జిల్లా ఎన్ఐసీ అధికారి శర్మ, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రామకృష్ణ, అర్బన్ తహశీల్దార్ ఆర్.శివరావు పాల్గొన్నారు. -
రూ.800 కోట్లతో సైబర్ సెక్యూరిటీ సెంటర్
డిజిటల్ ఇండియాలో భాగంగా న్యూఢిల్లీ: దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వినియోగం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో సైబర్ సెక్యూరిటీకి సంబంధించి కేంద్రం కీలక చర్యలు ప్రారంభించింది. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా రూ. 800 కోట్ల వ్యయంతో నేషనల్ సైబర్ కోఆర్డినేషన్ సెంట ర్ను ఏర్పాటు చేయనుంది. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటై వంద రోజులు పూర్తయిన సందర్భంగా శనివారం న్యూఢిల్లీలో టెలికం, ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తమ శాఖ పనితీరును మీడియాకు వివరించారు. ‘‘రూ. 800 కోట్ల అంచనా వ్యయంతో నేషనల్ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నాం. వివిధ మంత్రిత్వ శాఖలతో సంప్రదింపుల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నాం. దీని సహాయం తో మీ కంప్యూటర్లో వైరస్ ఉందా లేదా తెలుసుకోవడమే కాక దానిని తొలగించుకోవచ్చు’’ అని చెప్పారు. దీనితో పాటు ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి రూ. 270 కోట్లతో ఈ-గవర్నెన్స్ సెక్యూరిటీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, 2017 నాటికి పూర్తయ్యే ఈ ప్రాజెక్టు సహాయంతో దేశంలోని 2.5 లక్షల పంచాయతీలకు బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యం కల్పించనున్నట్టు మంత్రి తెలిపారు.