వచ్చే డిసెంబర్‌కల్లా 1.5 కోట్ల 4జీ యూజర్లు: పీడబ్ల్యూసీ
న్యూఢిల్లీ: దేశంలో 4జీ(ఫోర్త్ జనరేషన్) టెలికం సేవలు జోరందుకోనున్నాయి. దీంతో వచ్చే ఏడాది డిసెంబర్‌కల్లా 4జీ యూజర్ల సంఖ్య 1-1.5 కోట్లకు పెరగనున్నట్లు కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ అంచనా వేసింది. భారత టెలికం రంగంలో కీలక ధోరణల పేరుతో విడుదల చేసిన నివేదికలో ఈ అంశాన్ని పేర్కొంది. భారతీ ఎయిర్‌టెల్, ఎయిర్‌సెల్‌లు ఇప్పటికే కొన్ని సర్కిళ్లలో 4జీ సేవలు ప్రారంభించగా.. బీఎస్‌ఎన్‌ఎల్, టికోనా ఇతరత్రా కంపెనీలు కూడా వచ్చే ఏడాది షురూ చేయనున్నాయి.
ముకేశ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ 2015 మధ్యలో 4జీ సేవలను మొదలుపెట్టే సన్నాహాల్లో ఉంది. కాగా, 4జీ నెట్‌వర్క్ సేవల ప్రారంభానికి గడువును మరో ఐదేళ్లు(2020 వరకూ) పొడిగించాలని టెలికం శాఖను సెల్యులర్ ఆపరేటర్ల సంఘం(సీఓఏఐ) కోరింది. టెక్నాలజీ, నియంత్రణపరమైన ఇబ్బందులను ఇందుకు కారణంగా పేర్కొంది.