ఎఫ్‌బీ ప్రొఫైల్ బాగుంటే లోన్ దొరికినట్టే...
న్యూఢిల్లీ: పర్సనల్ లోన్ కావాలంటే బ్యాంకుల చుట్టూ తిరగడం, ఎన్నో పత్రాలు సమర్పించడం వంటి తతంగం ఇక అవసరం లేదు. ఫేస్‌బుక్‌లో మీ ఫ్రెండ్స్ లిస్ట్‌ను పరిశీలించి మీకు రుణం తిరిగి చెల్లించే స్ధోమతను అంచనా వేసి లోన్ ఇచ్చే సంస్థలు వచ్చేశాయి. ముంబయికి చెందిన స్టార్టప్ సంస్థ ‘క్యాష్ ఈ’ ఈ తరహా లోన్‌లను అందిస్తున్నది. క్యాష్‌ఈ ఇప్పటికే రూ 50 కోట్ల నిధులను సమీకరించింది. సోషల్ మీడియా కార్యకలాపాల ద్వారా కస్టమర్ రుణ చరిత్రను ఈ సంస్థ పసిగడుతుంది. సోషల్ మీడియా వేదికలపై కస్టమర్ కదలికల డేటాను సేకరించి ఆ వివరాల ఆధారంగా రుణాలను మంజూరు చేస్తుంది.
ఇక సోషల్ మీడియా ఖాతాలతో పాటు కస్టమర్ మొబైల్ డేటా, కాంటాక్ట్స్, యాప్స్ వీటినీ పరిగణనలోకి తీసుకుంటామని క్యాష్‌ఈ వ్యవస్థాపకులు వి.రమణకుమార్ చెప్పారు. రుణాన్నిమంజూరు చేసే పూర్తిస్థాయి యాప్ ఆధారిత కంపెనీ దేశంలో తమదేనని చెబుతున్నారు. భౌతికంగా పత్రాలను ఎవరూ చెక్ చేయరని, రుణం తీసుకునే వారి సంతకాన్ని ఎవరూ తీసుకోరని మొత్తం ప్రక్రియ అంతా యాప్‌లోనే సాగుతుందన్నారు.
ఎలా దరఖాస్తు చేయాలి..?
గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ స్టోర్ నుంచి క్యాష్‌ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే కేవలం ఐదు సులభ ప్రక్రియలతో రుణం సొంతం చేసుకోవచ్చు. మొబైల్ ఫోన్‌లో యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న అనంతరం మీ ఫేస్‌బుక్, గూగుల్ ప్లస, లింకెడ్‌ఇన్ వంటి సోషల్ ప్రొఫైల్స్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
అనంతరం మీ అర్హతలకు అనుగుణంగా రుణ మొత్తం ఎంపిక చేసుకుని సంబంధిత పత్రాలు జోడించి దరఖాస్తును నింపాలి. రుణం మంజూరైన వెంటనే మీ బ్యాంక ఖాతాలో జమ అవుతుంది. బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ లేదా చెక్ ద్వారా రుణాన్ని తిరిగి చెల్లించవచ్చు. వన్ క్యాపిటల్ అనే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ ద్వారా రుణాలను క్యాష్‌ఈ అందుబాటులోకి తెచ్చింది.