ఇకపై రోజంతా నెఫ్ట్‌ సేవలు | NEFT Services 24 Hours Soon | Sakshi
Sakshi News home page

ఇకపై రోజంతా నెఫ్ట్‌ సేవలు

Published Thu, Aug 8 2019 1:27 PM | Last Updated on Thu, Aug 8 2019 1:27 PM

NEFT Services 24 Hours Soon - Sakshi

ముంబై: ఆన్‌లైన్‌ నగదు బదిలీ లావాదేవీలకు సంబంధించిన నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌ (నెఫ్ట్‌) విధానాన్ని ఇకపై ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులోకి తేవాలని రిజర్వ్‌ బ్యాంక్‌ నిర్ణయించింది. ఈ ఏడాది డిసెంబర్‌ నుంచి దీన్ని అమల్లోకి తేనున్నట్లు వెల్లడించింది. దేశీయంగా రిటైల్‌ చెల్లింపుల వ్యవస్థలో ఇది విప్లవాత్మక మార్పులు తేగలదని పేమెంట్‌ సిస్టమ్‌ విజన్‌ 2021 పత్రంలో ఆర్‌బీఐ పేర్కొంది. ప్రస్తుతం రూ. 2 లక్షల దాకా నగదు బదిలీ లావాదేవీలకు నెఫ్ట్, అంతకు మించిన మొత్తానికి రియల్‌ టైమ్‌ గ్రాస్‌ సెటిల్మెంట్‌ సిస్టం (ఆర్‌టీజీఎస్‌) విధానాన్ని ఉపయోగిస్తున్నారు. రెండో, నాలుగో శనివారం మినహా ప్రస్తుతం నెఫ్ట్‌ సర్వీసులు ఉదయం 8 గం.ల నుంచి సాయంత్రం 7 గం.ల దాకా మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి. డిజిటల్‌ లావాదేవీలను మరింతగా ప్రోత్సహించే దిశగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఇప్పటికే ఆర్‌టీజీఎస్, నెఫ్ట్‌ విధానాల్లో నగదు బదిలీలపై తాను విధించే చార్జీలను ఎత్తివేసింది. మరోవైపు, ఏటీఎం చార్జీలు, ఫీజులన్నింటినీ సమగ్రంగా అధ్యయనం చేసేందుకు ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) సీఈవో సారథ్యంలో ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది.

కన్జ్యూమర్‌ రుణాలపై తగ్గనున్న వడ్డీ రేట్లు
అన్‌సెక్యూర్డ్‌ కన్జ్యూమర్‌ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే దిశగా ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. క్రెడిట్‌ కార్డులు మినహా అన్ని రకాల కన్జ్యూమర్‌ రుణాలపై (పర్సనల్‌ లోన్స్‌ సైతం) రిస్క్‌ వెయిటేజీని ప్రస్తుతమున్న 125% నుంచి 100%కి తగ్గించింది.

ఐసీఏపై నియంత్రణ సంస్థలతో చర్చలు
అంతర్‌–రుణదాతల ఒప్పంద (ఐసీఏ) ప్రక్రియలో బీమా సంస్థలు, అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలను (ఏఎంసీ) కూడా చేర్చే క్రమంలో ఆయా రంగాల నియంత్రణ సంస్థలైన సెబీ, ఐఆర్‌డీఏఐతో చర్చలు జరుపుతున్నట్లు గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు. మొండిబాకీల పరిష్కార ప్రక్రియలో ఐసీఏని తప్పనిసరి చేస్తూ జూన్‌ 7న సర్క్యులర్‌ ఇచ్చినట్లు ఆయన వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement