
మళ్లీ భారత మార్కెట్లలోకి మ్యాగీ!
పిల్లలకు పొద్దున్నే టిఫిన్ ఏం చేయాలి.. సాయంత్రం రాగానే స్నాక్స్ ఏం పెట్టాలి.. ఇలాంటి ప్రశ్నలు ఇక తల్లులకు అక్కర్లేదు. మ్యాగీ నూడుల్స్ మళ్లీ స్టోర్లలో అమ్మకాలకు సిద్ధమైపోతున్నాయి. వచ్చే నెల నుంచి భారతీయ మార్కెట్లలో మళ్లీ మ్యాగీ అమ్మకాలు ప్రారంభించాలని నెస్లె సంస్థ భావిస్తోంది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధి ఒకరు తాజాగా తెలిపారు. ఈ సంవత్సరం మే నెలలో మ్యాగీ నూడుల్స్ అమ్మకాలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అందులో సీసం ప్రమాదకరస్థాయిలో ఉందని, దాంతోపాటు ఎంఎస్‌జీ అనే పదార్థం కూడా ఉందని అప్పట్లో చెప్పారు. దాంతో దాదాపు రూ. 435 కోట్ల విలువైన మ్యాగీ ప్యాకెట్లను నెస్లె సంస్థ వెనక్కి తీసుకుని, వాటిని ధ్వంసం చేయాల్సి వచ్చింది.
తాజాగా నెస్లె సంస్థ మళ్లీ మ్యాగీని కొత్తగా తయారుచేయడం మొదలుపెట్టింది. దాని శాంపిళ్లను పరీక్షలకు పంపుతామని, వాటిలో ఫలితాలు ఆమోదయోగ్యంగా వస్తే.. వచ్చే నెల నుంచి అమ్మకాలు ప్రారంభిస్తామని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. సో, దాదాపుగా నవంబర్ నుంచి మళ్లీ మార్కెట్లలో మ్యాగీ కనిపిస్తుందన్న మాట.