కొత్త ఫండా? ప్రస్తుత సిప్‌ను పెంచాలా? | New fond? Raise the current sip? | Sakshi
Sakshi News home page

కొత్త ఫండా? ప్రస్తుత సిప్‌ను పెంచాలా?

Published Mon, Nov 6 2017 2:03 AM | Last Updated on Mon, Nov 6 2017 2:03 AM

New fond? Raise the current sip? - Sakshi

నేను ప్రస్తుతం ఏడు మ్యూచువల్‌ ఫండ్స్‌లో సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌(సిప్‌) విధానంలో మదుపు చేస్తున్నాను. ఇటీవలే ఒక ఇంక్రిమెంట్‌ వచ్చింది. జీతం పెరిగింది. దీంతో సిప్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కూడా పెంచాలనుకుంటున్నాను. కొత్తగా ఏదైనా ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయమంటారా? లేక ప్రస్తుతం ఉన్న ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్‌మెంట్స్‌ను పెంచమంటారా ? తగిన సలహా ఇవ్వండి.   – అశ్వనీ కుమార్, విజయవాడ

మీరు ఇప్పటికే ఏడు మ్యూచువల్‌ ఫండ్స్‌లో సిప్‌ విధానంలో ఇన్వెస్ట్‌ చేస్తున్నారు. ఇది సరిపోతుంది. మరీ ఎక్కువ సంఖ్యలో మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం కూడా ఏమంత మంచిది కాదు. సాధారణంగా జరిగేదేమిటంటే, ఇన్వెస్టర్లు మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ప్రారంభిస్తారు.  ఆతర్వాత కొత్త ఫండ్స్‌ యూనిట్లను కొనుక్కుంటూ పోతారు. అలా అవసరం లేదు కూడా. ఇక మీ విషయానికొస్తే, పెరిగిన జీతంతో కొత్త ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయాల్సిన పనిలేదు.

ఉన్న సిప్‌ల్లో ఏదో ఒకటి, లేదా రెండు సిప్‌ల మొత్తాన్ని పెంచండి చాలు. మరో విషయం ఇన్వెస్ట్‌ చేయడానికి ఏడు ఫండ్స్‌ అవసరం లేదు. వాటిల్లోంచి 2–3 ఫండ్స్‌ను తగ్గించుకోవచ్చు. మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు ముఖ్యంగా రెండు విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. మొదటిది. మార్కెట్‌ మొత్తాన్ని ప్రతిబింబించేలా ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఉండాలి. అంటే మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను డైవర్సిఫై చేసుకోవాలి. ఏదైనా ఒకటి లేదా రెండు మల్టీక్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా దీనిని సాధించవచ్చు.

ఇక రెండవది. మీరు ఇన్వెస్ట్‌ చేసే ఫండ్స్‌ను నిర్వహించే ఫండ్స్‌ మేనేజర్లు వేర్వేరుగా ఉండాలి. ఉదాహరణకు ఒకే సంస్థకు చెందిన నాలుగు మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్నారనుకుందాం. ఈ సంస్థ ఫండ్‌ మేనేజర్ల ఇన్వెస్ట్‌మెంట్‌ వ్యూహం దాదాపు ఒకేలాగా ఉంటుంది. మీకు డైవర్సిఫికేషన్‌ ప్రయోజనాలు అందవు. అలా కాకుండా వివిధ సంస్థలకు చెందిన మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేశారనుకుందాం. అప్పుడు ఈ ఫండ్స్‌ మేనేజర్ల ఇన్వెస్ట్‌మెంట్‌ వ్యూహాలు విభిన్నంగా ఉంటాయి. ఈ ముఖ్యమైన రెండు అంశాలు సాకారం కావాలంటే 4–5 ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే సరిపోతుంది.  

నేను టర్మ్‌ బీమా పాలసీ తీసుకోవాలనుకుంటున్నాను. ప్యూర్‌ టర్మ్‌ పాలసీ తీసుకోవాలా లేకుంటే, సమగ్రమైన రైడర్లున్న టర్మ్‌  పాలసీ తీసుకోవాలా ? – శ్రీనివాస్, వరంగల్‌
బీమా అవసరాలు వ్యక్తులను బట్టి మారుతుంటాయి. ఒక వ్యక్తికి సరిపోయినది, మరో వ్యక్తికి సరిపోకపోవచ్చు. ఆర్థికంగా మీపై ఆధారపడిన వాళ్లుంటే బేసిక్‌ టర్మ్‌ పాలసీ తప్పనిసరి. ఇక మీకు ఉన్న ప్రత్యేక అవసరాలను బట్టి రైడర్లను తీసుకోవాలా వద్దా అనేది నిర్ణయించుకోవచ్చు. బీమా కంపెనీలు వివిధ రైడర్లతో కూడిన టర్మ్‌ పాలసీలను ఆఫర్‌ చేస్తున్నాయి. క్రిటికల్‌ ఇల్‌నెస్, యాక్సిడెంటల్‌ డెత్, యాక్సిలరేటెడ్‌ సమ్‌ అష్యూర్డ్, పార్షియల్, పర్మనెంట్‌ డిజేబిలిటీ,  తదితర రైడర్లతో వివిధ బీమా సంస్థలు వివిధ టర్మ్‌ పాలసీలను అందిస్తున్నాయి.

అయితే వీటికి ప్రీమియం అదనంగా చెల్లించాల్సి రావచ్చు. అందరూ ఈ రైడర్లను తీసుకోవాలని రూలేమీ లేదు. ఒక వ్యక్తి తనకు తగిన రైడర్లను ఎంచుకోవచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తి తరుచుగా దూర ప్రయాణాలు చేసే ఉద్యోగం  చేస్తున్నాడనుకుందాం. ఆ వ్యక్తి ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి. అందుకని  ఆ వ్యక్తి యాక్సిడెంటల్‌ డెత్‌ రైడర్‌ ఉన్న పాలసీ ఎంచుకోవాలి. అయితే ఒకే రైడర్‌ను అందించే వివిధ సంస్థలకు చెందిన బీమా పాలసీలు షరతులు రకరకాలుగా ఉంటాయి. అందుకని రైడర్‌ను ఎంచుకునే ముందు, సంబంధిత వ్యయాలను, ప్రయోజనాలను, షరతులను, తదితర అంశాలన్నింటినీ క్షుణ్నంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి.

నేను మ్యూచువల్‌ ఫండ్స్‌లో గత కొంత కాలం నుంచి ఇన్వెస్ట్‌ చేస్తున్నాను. ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్‌ చేయడానికి రెండు ఫండ్స్‌ను ఎంచుకున్నాను. ఒకటేమో గత 15 ఏళ్లలో 14 శాతం రాబడినివ్వగా, మరో ఫండ్‌ మూడేళ్లలోనే 22 శాతం చొప్పున రాబడినిచ్చింది. ఈ రెండింటిలో ఏ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయమంటారు ? – తులసి, హైదరాబాద్‌

పదిహేనేళ్లలో 14 శాతం రాబడి ఇచ్చిన ఫండ్‌–మార్కెట్లో భారీ ఉత్ధాన, పతనాలను చవి చూసి ఉంటుంది. పదిహేనేళ్లంటే దీర్ఘకాలం కిందే లెక్క. ఈ కాలంలో మార్కెట్లో రెండు బూమ్‌లు వచ్చాయి. ఇక రెండో ఫండ్‌ మూడేళ్లలో 22 శాతం రాబడినిచ్చింది. గత మూడేళ్లలో మార్కెట్‌ బూమ్‌లోనే ఉందని చెప్పవచ్చు. అంటే ఈ ఫండ్‌ మంచి రోజులనే చూసిందని చెప్పవచ్చు. అయితే మార్కెట్‌ చక్రీయంగా ఉంటుంది. మార్కెట్‌ బాగాలేకపోతే, నష్టాలూ వస్తాయి.

మీరు చూడాల్సిన మరో ముఖ్యమైన విషయం. 14 శాతం రాబడినిచ్చిన ఫండ్‌ను నిర్వహించిన  మేనేజర్‌ ఈ పదిహేనేళ్ల పాటూ ఈ ఫండ్‌కు మేనేజర్‌గానే వ్యవహరించాడా లేదా అన్న విషయం. దీనికి సమాధానం అవును అయితే మీరు 14 శాతం రాబడినిచ్చిన ఫండ్‌ను మీ ఇన్వెస్ట్‌మెంట్‌కు పరిశీలించవచ్చు. అయితే మ్యూచువల్‌ ఫండ్‌కు సంబంధించి గతంలో పనితీరు ఎప్పుడూ భవిష్యత్తు పనితీరుకు కొలమానం కాదు. మరోవైపు పనితీరే... ఫండ్‌ను ఎంచుకోవడానికి ప్రాధాన్య నిర్ణయం కాదు. ఆ ఫండ్‌ ఏ తరహాది ? ఆ ఫండ్‌ను నిర్వహిస్తున్న ఫండ్‌ మేనేజర్‌ వివరాలు, పన్ను ప్రయోజనాలు ఏమైనా లభిస్తాయా? తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement