
లావాదేవీలు పెరిగితే.. ఐటీ కంట్లో పడ్డట్లే!
ఒక స్థాయికి మించి అధిక విలువ లావాదేవీలు, నిధుల స్వీకరణకు సంబంధించి తాజా నిబంధనలను ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) నోటిఫై చేసింది.
* నల్లధనం నిరోధానికి మరో చర్య
* సీబీడీటీ తాజా నిబంధనలు నోటిఫై...
న్యూఢిల్లీ: ఒక స్థాయికి మించి అధిక విలువ లావాదేవీలు, నిధుల స్వీకరణకు సంబంధించి తాజా నిబంధనలను ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ (సీబీడీటీ) నోటిఫై చేసింది. ఆయా లావాదేవీ వివరాలను తప్పనిసరిగా ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు ఏప్రిల్ 1వ తేదీ నుంచీ అమల్లోకి వస్తాయి. నల్లధనాన్ని అరికట్టడమే లక్ష్యంగా సీబీడీటీ తాజా నిబంధనలను నోటిఫై చేసింది. కొత్త నిబంధనల్లో ముఖ్యాంశాలు చూస్తే...
* నగదు స్వీకరణలు, స్తిరాస్థి, మ్యూచువల్ ఫండ్స్, షేర్ల కొనుగోలు, టర్మ్ డిపాజిట్లు, విదేశీ కరెన్సీ అమ్మకాలు వంటి అంశాలను నిర్దేశిత దరఖాస్తు 61ఏ ద్వారా ఆదాయపు పన్ను అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది.
* రూ. 30 లక్షల పైబడిన స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాల విషయాన్ని ఐటీ అధికారులకు రిజిస్ట్రర్ తెలియజేయాల్సి ఉంటుంది.
* అలాగే రూ. 2 లక్షలు పైబడిన వస్తువులు లేదా సేవల కొనుగోళ్లు ఏదైనా జరిగితే... ఈ లావాదేవీ విషయాన్ని సంబంధిత వృత్తిదారులు ఆదాయపు పన్ను శాఖకు తెలపాలి.
* ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి ఒక అకౌంట్ లేదా అంతకంటే ఎక్కువ అకౌంట్లలో రూ. 10 లక్షలు, ఆపైన నగదు డిపాజిట్ చేస్తే బ్యాంక్ ఈ విషయాన్ని ఆదాయపు పన్ను శాఖకు తెలియజేయాలి. ఇంత మొత్తానికి సంబంధించి పోస్టాఫీస్ అకౌంట్‌లో డిపాజిట్లు, విత్‌డ్రాయెల్స్‌కు సంబంధించి కూడా తాజా నిబంధన వర్తిస్తుంది. కరెంట్ అకౌంట్ల విషయంలో తాజా నిబంధన రూ. 50 లక్షలు పైబడిన మొత్తాలకు నిర్దేశించడం జరిగింది.
* బాండ్లు, డిబెంచర్లు, షేర్లు, మూచ్యువల్ ఫండ్స్ అమ్మకాలకు సంబంధించి ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి నుంచి ఒక కంపెనీ రూ. 10 లక్షలు ఆపైన నగదు పొందితే... ఈ విషయాన్ని ఐటీ శాఖకు తెలియజేయాలి.
* ఆయా అంశాలను ఆన్‌లైన్ ఫైలింగ్ ద్వారా ఐటీ డెరైక్టర్ ఆఫ్ జాయింట్ డెరైక్టర్ (ఇంటిలిజెన్స్ అండ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్)కు ఫామ్ 61ఏ రూపంలో తెలియజేయాలి.