
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ వరుసగా ఏడవ ట్రేడింగ్ సెషన్‌లోనూ కిందకు జారింది. గురువారం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సే్ఛంజ్ (ఫారెక్స్) మార్కెట్‌లో రూపాయి విలువ 71.99 వద్ద ముగిసింది. బుధవారం ముగింపు విలువతో పోలిస్తే 24 పైసలు పతనమయింది. ట్రేడింగ్‌లో ఒక దశలో 72ను దాటిపోయి, 72.11ను చేరింది. చివరకు కొంత రికవరీతో 71.99 వద్ద ముగిసింది. అటు ముగింపు, ఇంట్రాడే ట్రేడింగ్ విలువ... రెండూ చరిత్రాత్మక కనిష్ట స్థాయిలు కావడం గమనార్హం. రూపాయి తిరోగమనానికి కొన్ని కారణాలు చూస్తే...
►నిజానికి రూపాయి గురువారం ట్రేడింగ్ ప్రారంభంలో 13 పైసలు లాభంతో 71.62 వద్ద ప్రారంభమైనా, ఆ స్థాయిలో నిలవలేకపోయింది.
►అంతర్జాతీయ, దేశీయ కారణాలు రెండూ రూపాయి పతనానికి కారణమవుతున్నాయి.
►అంతర్జాతీయంగా చూస్తే, క్రూడ్ ధరలు తీవ్ర స్థాయిని చేరాయి. ఇవి దేశీయ స్థూల ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
► దేశీ కంపెనీలు క్రూడ్‌ను డాలర్‌లలో కొనుగోలు చేస్తాయి కాబట్టి ఇది దేశీయ విదేశీ మారకపు నిల్వలపై ప్రభావం చూపుతుంది. వెరసి దేశంలోకి వచ్చీ– పోయే విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసం– కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) పెరుగుదలకు కారణమవుతుంది.
►క్రూడ్ ధరల పెరుగుదల దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుదలకు... తద్వారా వడ్డీరేట్ల పెంపుదలకు దారితీసి దేశీయ వృద్ధిని దెబ్బతీస్తుంది.
► ఇక దేశంనుంచి విదేశీ నిధులు వెనక్కు వెళ్లిపోతుండడమూ ప్రతికూలాంశమే.
► వీటన్నింటికీ తోడు అంతర్జాతీయ వాణిజ్య యుద్ధం సమస్యలను తెచ్చిపెడుతోంది.
► అంతర్జాతీయంగా పలు దేశాల కరెన్సీ విలువల పతనం... ఆరు దేశాల కరెన్సీలతో ట్రేడయ్యే డాలర్ ఇండెక్స్ 95 స్థాయిలో పటిష్టంగా ఉండడం దేశీయ కరెన్సీ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచీ 13% పతనమయ్యింది.
►గురువారం పలు క్రాస్ కరెన్సీలలో కూడా రూపాయి పతనమయింది. పౌండ్ స్టెర్లింగ్‌పై 91.95 నుంచి 93.08కి జారింది. యూరోపై 83.12 నుంచి 83.70కి పడింది.