కొత్త నోట్లపై కాకి లెక్కలు..! | New RBI guidelines on cash deposits of demonetised notes add to confusion | Sakshi
Sakshi News home page

కొత్త నోట్లపై కాకి లెక్కలు..!

Published Wed, Dec 21 2016 12:06 AM | Last Updated on Mon, Sep 4 2017 11:12 PM

కొత్త నోట్లపై కాకి లెక్కలు..!

కొత్త నోట్లపై కాకి లెక్కలు..!

ఆర్‌బీఐ, ప్రభుత్వ గణాంకాల్లో వ్యత్యాసాలు
సరఫరాలో రూ. 1.13 లక్షల కోట్ల తేడా
చెలామణీలోని నోట్లపైనా గందరగోళం...


పెద్ద నోట్ల రద్దు దరిమిలా ఇటు ప్రభుత్వం, అటు రిజర్వ్‌ బ్యాంక్‌ కొత్త నోట్ల లభ్యత గురించి రోజుకో ప్రకటన చేస్తూ వస్తున్నాయి. అయితే ప్రభుత్వం, ఆర్‌బీఐ చెప్పే లెక్కల మధ్య పొంతన కుదరకపోతుండటమే చిక్కులు తెచ్చిపెడుతోంది. రెండు రోజుల వ్యవధిలోనే పెద్ద నోట్ల సరఫరా భారీగా పెరిగిపోవడం.. మళ్లీ అంతలోనే పదకొండు రోజుల పాటు అసలు నోట్ల సరఫరా ఊసే లేకపోవడం మొదలైనవి అనేక సందేహాలకు తావిస్తున్నాయంటున్నారు విశ్లేషకులు. ఇదంతా చూస్తుంటే.. కొత్త నోట్ల విషయంలో పార్లమెంటును, ప్రజలను ప్రభుత్వం పక్కదోవ పట్టిస్తూనైనా ఉండొచ్చు లేదా ఆర్‌బీఐ లెక్కల్లోనే తప్పులైనా ఉండొచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు గణాంకాలతో సహా వారు ఆధారాలు చూపుతున్నారు.

ఏది నిజం..
నవంబర్‌ 27 దాకా ఏటీఎంలు, బ్యాంకు శాఖల ద్వారా ప్రజలు దాదాపు రూ. 2.16 లక్షల కోట్ల కొత్త నోట్లను విత్‌డ్రా చేసుకున్నట్లు నవంబర్‌ 28న రిజర్వ్‌ బ్యాంక్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే, ఇందులో ఏయే నోట్లు, ఎన్నెన్ని ఉన్నాయన్నది వివరించలేదు. కనుక ఇందులో ఎంతో కొంత మొత్తం రూ. 100 లేదా అంతకన్నా తక్కువ విలువ చేసే నోట్లు కూడా ఉన్నాయని భావించవచ్చు. ఇక ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ డిసెంబర్‌ 6న పార్లమెంట్‌లో చెప్పిన వివరాలను బట్టి చూస్తే నవంబర్‌ 29 దాకా రూ. 2,000 నోట్లు 160.8 కోట్లు, రూ. 500 నోట్లు 15.6 కోట్లు.. అంటే మొత్తం సుమారు రూ. 3.29 లక్షల కోట్లు విలువ చేసే 176.4 కోట్ల నోట్లు సరఫరా అయ్యాయి. ఇక్కడ పరిశీలించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి.

ఆర్‌బీఐ లెక్కల ప్రకారం డీమోనిటైజేషన్‌ తర్వాత 17 రోజుల వ్యవధిలో రూ. 2.16 లక్షల కోట్లు అంటే.. రోజుకు సగటున రూ. 12,700 కోట్ల మేర సరఫరా అయ్యాయి. కానీ ప్రభుత్వ లెక్కలను బట్టి చూస్తే నవంబర్‌ 29కి రూ. 3.29 లక్షల కోట్ల విలువైన నోట్లు సరఫరా అయ్యాయి. అంటే.. కేవలం రెండు రోజుల వ్యవధిలో కరెన్సీ సరఫరా ఏకంగా రూ. 1.13 లక్షల కోట్ల మేర పెరిగిపోయింది. పైపెచ్చు ఆర్‌బీఐ చెప్పిన గణాంకాల్లో చిన్నా, పెద్ద అన్ని రకాల డినామినేషన్ల నోట్లు ఉండగా.. మంత్రి చెప్పిన వివరాలు కేవలం పెద్ద నోట్లకు సంబంధించినవే. ఒకవేళ చిన్న నోట్లను కూడా పరిగణనలోకి తీసుకుని ఉంటే నవంబర్‌ 29 దాకా సరఫరా అయిన నోట్లు మరింత ఎక్కువగానే పెరిగేవి.

మరిన్ని సందేహాలు..
ఇక మరో ఆసక్తికరమైన విషయం చూద్దాం. డిసెంబర్‌ 7న పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్‌బీఐ మరిన్ని కొత్త గణాంకాలను వెల్లడించింది. అంతకు ముందు రోజు నాటి దాకా రూ.4 లక్షల కోట్ల మొత్తాన్ని సరఫరా చేసినట్లు ఆర్‌బీఐ డిçప్యూటీ గవర్నర్‌ ఆర్‌ గాంధీ చెప్పుకొచ్చారు. ఇందులో రూ. 1.06 లక్షల కోట్లు చిన్న నోట్లు అని ఆయన పేర్కొన్నారు. అంటే మిగతావి  (రూ. 2.94 లక్షల కోట్లు) పెద్ద నోట్లేనని భావించవచ్చు. నవంబర్‌ 29 దాకా జరిగిన నోట్ల సరఫరాకు సంబంధించి వారం రోజుల ముందు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పార్లమెంటులో చెప్పిన రూ. 3.29 లక్షల కోట్ల కన్నా ఇది తక్కువే. ఈ గందరగోళం ఇక్కడితో ఆగలేదు.

డిసెంబర్‌ 10 దాకా 170 కోట్ల మేర రూ. 2,000, రూ. 500 నోట్లను సరఫరా చేసినట్లు డిసెంబర్‌ 12న గాంధీ తెలిపారు. అంటే నవంబర్‌ 29 దాకా 176 కోట్ల పెద్ద నోట్లను సరఫరా చేశామంటూ మంత్రి చెప్పిన 11 రోజుల తర్వాత.. ఆయన చెబుతున్న దానికన్నా తక్కువ నోట్లే సరఫరా చేశామని ఆర్‌బీఐ చెప్పినట్లయ్యింది. పోనీ ఒకవేళ.. మేఘ్వాల్‌ అర కొరను పక్కన పెట్టిæ రౌండ్‌ ఫిగర్‌ చేసి 170 కోట్లని చెప్పారనుకుంటే నవంబర్‌ 29 –డిసెంబర్‌ 10 మధ్య  కొత్త నోట్ల సరఫరా లేదా ముద్రణా నిల్చిపోయిందని అనుకోవాలా? ఆర్‌బీఐ ఈ వ్యత్యాసాలను ఎలా వివరించగలదు?

నోట్లపై ఆర్‌బీఐ వివరణ
చలామణీలోని నోట్లపై జర్నలిస్టు, సమాచార హక్కు కార్యకర్త అనిల్‌ గల్గాలికి ఇచ్చిన సమాధానంపై వివాదం రేగడంతో ఆర్‌బీఐ వివరణ ఇచ్చింది. చలామణీలోని నోట్లతో పాటు ఇంకా అందుబాటులోకి తేని నోట్లను కూడా కలిపి అనిల్‌ ప్రశ్నకు సమాధానం ఇచ్చినట్లు పేర్కొంది. వివరాల్లోకి వెడితే.. నవంబర్‌ 8 నాటికి (డీమోనిటైజేషన్‌ ప్రకటించిన తేది) చలామణీలో ఎన్ని నోట్లు ఉన్నాయి, ఎన్ని కొత్త కరెన్సీ నోట్లను ముద్రించారు తదితర వివరాలు ఇవ్వాల్సిందిగా సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద ఆర్‌బీఐని అనిల్‌ కోరారు. అధికారిక లెక్కల ప్రకారం నవంబర్‌ 4 దాకా రూ. 17.97 లక్షల కోట్లు చలామణీలో ఉన్నాయి. అయితే, అనిల్‌ ప్రశ్నకు ఆర్‌బీఐ ఇచ్చిన సమాధానం ప్రకారం ఈ మొత్తం ఏకంగా రూ. 23.9 లక్షల కోట్లుగా ఉంది. ఫలితంగా రెండింటి మధ్య పొంతన లేక గందరగోళ పరిస్థితి తలెత్తింది.  రెండింటి మధ్య వ్యత్యాస మొత్తం (సుమారు రూ. 6 లక్షల కోట్లు) తమ లాకర్లలోనే ఉంటుందని, దీన్ని చలామణీలోకి తేకపోవడం వల్ల అందుకు సంబంధించిన డేటాలో ప్రతిఫలించదని ఆర్‌బీఐ తెలిపింది.

ఏ నోట్లు ముద్రిస్తున్నారో..
తగినన్ని నోట్లు వీలైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రింటింగ్‌ ప్రెస్‌లు ఓవర్‌టైమ్‌ పనిచేస్తున్నాయంటూ ప్రభుత్వం చెబుతూ వస్తోంది. డీమోనిటేజైషన్‌ ప్రకటించిన తర్వాత కొద్ది రోజుల వ్యవధిలో ముద్రించిన నోట్లలో సింహభాగం 80–90 శాతం రూ. 500 నోట్లే ఉన్నాయని కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి శక్తికాంత దాస్‌.. డిసెంబర్‌ 17న దూరదర్శన్‌కి ఇచ్చిన ఇంటర్వూ్యలో చెప్పారు. ఇక మేఘ్వాల్‌ సమాచారం ప్రకారం నవంబర్‌ 29 దాకా (అంటే డీమోనిటైజేషన్‌ అయిన 20 రోజుల దాకా)  సరఫరా చేసిన రూ. 500 నోట్ల విలువ రూ. 7,800 కోట్లే (దాదాపు 15.6 కోట్ల నోట్లు). రద్దు చేసిన నోట్ల విలువలో (రూ. 8.58 లక్షల కోట్లు) కొత్తగా ముద్రించిన రూ. 500 నోట్లు ఒక్కశాతం కన్నా (0.91 శాతం) తక్కువే ఉండటం గమనార్హం. పోనీ గాంధీ చెప్పిన మాటలు బట్టి చూసినా.. నవంబర్‌ 10న.. అంటే డీమోనిటైజేషన్‌ ప్రకటించి నెల రోజులు గడిచినా కూడా పరిస్థితిలో పెద్దగా మార్పు లేదన్నమాట.

ఇక, రూ. 2,000 నోట్లను నెలల తరబడి ముద్రిస్తూనే ఉన్నామని, చెప్పుకోతగ్గ పరిమాణంలో ఇవి చలామణీలో ఉన్నాయని శక్తికాంత దాస్‌ చెప్పారు. గణాంకాల ప్రకారం నవంబర్‌ 29 నాటి దాకా సరఫరా అయిన రూ. 2,000 నోట్ల విలువ సుమారు రూ. 3.21 లక్షల కోట్లు (160.8 కోట్లు రూ. 2,000) ఉంటుంది. రద్దయిన పెద్ద నోట్లు (రూ. 1,000) విలువ రూ. 6.86 లక్షల కోట్లలో ఇది దాదాపు 47%. అయితే, వినియోగానికి అనువుగా లేనంత పెద్ద నోటు కావడంతో(రూ.2,000) ఇవి ఎక్కువగా చెలామణీలోకి వచ్చినా నగదు ఎకానమీలో ఉపయోగం లేకుండా పోయిం ది. మళ్లీ డిసెంబర్‌ 10న గాంధీ వెల్లడించిన సమాచారం ప్రకారం రూ. 2,000 నోట్ల సరఫరా పరిమాణంలో మార్పేమీ లేదు. దీంతో నోట్ల వెతలు తీరాలంటే ప్రధాని చెప్పిన 50 రోజుల గడువు సరిపోయేట్లుగా లేదనేది పరిశీలకుల మాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement