
ముంబై: సెప్టెంబరు 4, 2016న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన ఉర్జిత్ పటేల్ నేటితో రెండేళ్లను పూర్తిచేశారు. ఈ సందర్భంగా ఆయన డిప్యూటీ గవర్నర్‌గా ఉన్నటువంటి సమయంలో ముందుచూపుపై చేసిన వ్యాఖ్యలు తాజాగా హైలైట్ అయ్యాయి. ‘ఆర్‌బీఐ.. పావురం లేదా డేగలా ఉండడం కంటే తెలివైన గుడ్లగూబ పాత్రను పోషించడం మంచిది. ఎందుకంటే సంప్రదాయంగా జ్ఞానానికి చిహ్నంగా ఈపక్షి కొనసాగుతోంది. మనం కూడా జ్ఞానవంతమైన గుడ్లగూబ విధానాన్ని కొనసాగిద్దాం.’ అని 2014లో అన్నారు.
పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఇదే విధానాన్ని తీసుకుని ‘వైజ్ ఔల్’ ఆఫ్ మింట్ స్ట్రీట్‌గా మారారు. ఈయన పదవి చేపట్టిన రెండునెలల్లోనే పెద్దనోట్ల రద్దు అంశం సవాలు విసిరినప్పటికీ, సునాయాసంగా సమస్యను అధిగమించారు. బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లను శుద్ధి చేయడంలో తనదైన ముద్రవేసి.. సామాన్యులకు బ్యాంకుల రూపంలో గుదిబండ వెంటాడకూడదనే తన ఆలోచనలో విజయం సాధించారని ఈ రంగ నిపుణులు కొనియాడుతున్నారు. ఇక మిగిలి ఉన్న పదవీకాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరును ఏ మేరకు మెరుగుపరుస్తారు? రుణ జారీ తగ్గుతున్న తరుణంలో ఎటువంటి నిర్ణయాలు తీసు కుంటారు? అనే అంశాలపై ఇప్పుడు సర్వత్రా ఆశక్తి నెలకొంది.