
న్యూఢిల్లీ: ప్రస్తుతం భారత స్టాక్ మార్కెట్ బుల్ ర్యాలీ సగంలో ఉందని, ఇది మరో రెండేళ్లు కొనసాగుతుందని టెంపుల్టన్ ఎమర్జింగ్ మార్కెట్స్ గ్రూప్ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మార్క్ మొబియస్ అంచనా వేశారు. ఉత్తర కొరియా ఉద్రిక్తతలు, కమోడిటీలు... ఈ రెండు అంశాలు మార్కెట్‌కు రిస్క్ అని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వివిధ అంశాలపై మాట్లాడారు. అవి ఆయన మాటల్లోనే...
మరో రెండేళ్లు బుల్ మార్కెట్టే...
ప్రస్తుతం భారత స్టాక్ మార్కెట్ బుల్ ర్యాలీ సగం గడిచింది. మరో సగం ముందుంది. మరో రెండేళ్లు అంటే 2019 వరకూ ఈ బుల్ ర్యాలీ కొనసాగుతుంది. జీఎస్‌టీ ప్రభావంతో రానున్న కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల్లో మోదీ ప్రభ మసకబారినా, మోదీ ప్రభుత్వానికి ప్రతికూల ఫలితాలు వచ్చినా, మార్కెట్ ర్యాలీకి ఎలాంటి ఢోకా ఉండదని నా అభిప్రాయం. ఎన్నాళ్లగానో ఎదురు చూసిన సంస్కరణలు ఇప్పుడే సాకారమవుతున్నాయి.
వీటి కారణంగా కొన్ని ఇబ్బందులు తలెత్తినా, వాటిని పరిష్కరించుకుంటూ ప్రభుత్వం ముందుకు పోతోంది. దీనికి తోడు భారతీయుల ఆదాయం పెరుగుతోంది. పొదుపు సైతం పెరుగుతోంది. అందుకే ఈ మధ్య ఈక్విటీ మార్కెట్లలో రిటైల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులు పుంజుకుంటున్నాయి. ఈ పెట్టుబడులు మరింతగా పెరుగుతాయని నా ఉద్దేశం. ఇది శుభసూచకం కూడా. అయితే అమెరికా ఎప్పుడైనా ఉత్తర కొరియా కవ్వింపులకు దీటుగా జవాబివ్వవచ్చు.. కొరియా క్షిపణులను ఎప్పుడైనా అమెరికా సైన్యం కూల్చేయవచ్చు. దీని ప్రభావం ప్రపంచ మార్కెట్లపై తీవ్రంగానే ఉంటుంది.
భారత్‌పై మాత్రం పెద్దగా ఉండకపోవచ్చు. దేశీయంగా మెరుగుపడుతున్న ఆర్థికాంశాల కారణంగా భారత వృద్ధి జోరు పెరిగే అవకాశముంది. విదేశీ ఇన్వెస్టర్ల ఆసక్తి కూడా భారత మార్కెట్‌పై మరింతగా పెరగనుంది. పెరుగుతున్న కమోడిటీల ధరలు మాత్రం భారత్‌పై బాగానే ప్రభావం చూపుతాయి. భారత్‌లో ఉన్న సానుకూలాంశాల కారణంగా మా పోర్ట్‌ఫోలియోలో చైనా తర్వాతి స్థానం భారత్‌దే.
ప్రభుత్వ బ్యాంక్‌ల షేర్లు ఆకర్షణీయం...!
ప్రభుత్వ రంగ బ్యాంక్‌లకు మూలధన నిధులు కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయం ఈ బ్యాంక్‌లకు సానుకూలమైన అంశం. అందుకని ఇన్వెస్ట్‌మెంట్‌కు ఈ షేర్లను ఎంచుకోవడం మంచి నిర్ణయం.
టెలికంకు డేటా కిక్..: టెలికం షేర్ల భవిష్యత్తు కూడా బాగానే ఉంటుంది. రానున్న కాలంలో వివిధ రంగాల్లో డేటా వినియోగం ఊపందుకుంటుంది కనక అది టెలికం కంపెనీలకు కలసివస్తుంది. దాదాపు ప్రతి రంగంలో డేటా వినియోగం జోరు పెరగనుంది. దీనివల్ల మరో మూడేళ్ల వరకూ ఈ రంగం జోరు కొనసాగుతుంది. గతంలో రిలయన్స్ కంపెనీ ఫైబర్ కోసం గుంతలు తవ్వినప్పుడు ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ రిలయన్స్ టెలికం రంగంలోకి ప్రవేశిస్తే, అది ఆ కంపెనీకి దీర్ఘకాలంలో మంచి సానుకూలాంశం అవుతుందని అప్పుడే అంచనా వేశా. ఆ ఫలితాలు మనమిప్పుడు చూస్తున్నాం.
బిట్ కాయిన్ జోరు బుడగే..!
ప్రస్తుత బిట్‌కాయిన్ జోరు వాపే కానీ, బలుపు కాదనేది నా అభిప్రాయం. ప్రతి ఒక్కరూ బిట్‌కాయిన్ మోజులో ఉన్నారు. ఈ క్రేజ్‌లో బిట్‌కాయిన్ ధర అమాంతం పెరిగిపోతోంది, ఈ బుడగ ఎప్పుడో ఒకప్పుడు పగులుతుంది. ప్రస్తుత తరం ఇంటర్నెట్‌లో పుట్టి, ఇంటర్నెట్‌లోనే జీవిస్తోంది కనక వారికి ఇంటర్నెట్ ఆధారిత బిట్‌కాయిన్ వంటి క్రిప్టోకరెన్సీలంటే మోజు ఉండడం సహజమే. అందుకే ఇంటర్నెట్ ద్వారా దీని విలువ వేగంగా పెరిగిపోతోంది. బుల్ మార్కెట్ అయినా, బబుల్ అయినా చివరి దశలో ఒక యుఫోరియా ఏర్పడుతుంది. ప్రస్తుతం బిట్‌కాయిన్‌కు అలాంటి యుఫోరియానే ఏర్పడింది. పెద్ద పెద్ద సంస్థలు ఇన్వెస్ట్ చేయడం మొదలు పెడితే.. ధరలు హేతుబద్ధం అవుతాయి. ఈ బుడగ పేలిపోతుంది.