8,500 పైకి నిఫ్టీ..
- ప్రభావం చూపని గ్రీస్ రెఫరెండమ్
- 116 పాయింట్ల లాభంతో 28,209కు సెన్సెక్స్
- 37 పాయింట్ల లాభంతో 8,522కు నిఫ్టీ
ట్రేడింగ్ చివర్లో బ్లూ చిప్ షేర్లలో కొనుగోళ్ల కారణంగా స్టాక్ మార్కెట్ సోమవారం లాభాల్లో ముగిసింది. బెయిలవుట్ షరతులకు అంగీకరించేది లేదంటూ ప్రజాభిప్రాయసేకరణలో గ్రీస్ ప్రజలు తెగేసి చెప్పడంతో ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఈ ప్రభావంతో ప్రారంభంలో నష్టాల పాలైన మన స్టాక్ మార్కెట్ సూచీలు చివరకు లాభాల బాట పట్టాయి.
బీఎస్‌ఈ సెన్సెక్స్ 317 పాయింట్ల నష్టం నుంచి తేరుకొని 115 పాయింట్లు లాభపడగా, నిఫ్టీ కీలకమైన 8,500 పాయింట్ల మైలురాయిని దాటింది. ఫార్మా, బ్యాంక్, ఆర్థిక సేవలు, ఆయిల్, గ్యాస్, రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ రంగాల షేర్లలో కొనుగోళ్ల కారణంగా సెన్సెక్స్ 116 పాయింట్ల లాభంతో 28,209 పాయింట్ల వద్ద, నిఫ్టీ 37 పాయింట్ల లాభంతో 8,522 పాయింట్ల వద్ద ముగిశాయి. రెండు సూచీలకు ఇది రెండున్నర నెలల గరిష్ట స్థాయి. భారత్‌లో ఆర్థిక పరిస్థితులు స్థిరంగా ఉన్నాయని, చాలినన్ని విదేశీ మారక ద్రవ్య నిల్వలున్నాయని, గ్రీస్ ప్రభావం భారత్‌పై పెద్దగా ఉండదని ముఖ్య ఆర్థిక సలహాదారు అర్వింద్ సుబ్రమణియన్ వ్యాఖ్యానించడం మార్కెట్‌కు ఊరటనిచ్చింది. టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.2,770 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో రూ.14,587 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.2,13,736 కోట్లుగా నమోదైంది.
ఈ షేర్ల పట్ల జాగ్రత్తగా ఉండండి
బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల హెచ్చరిక
న్యూఢిల్లీ: ట్రేడింగ్ జరగని 450కు పైగా కంపెనీల్లో షేర్లు కొనేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు హెచ్చరించాయి. ఇలాంటి 413 షేర్ల జాబితాను బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలు వెల్లడించాయి. ఈ 2 జాబితాల్లో ఉన్న కొన్ని కంపెనీల షేర్లు -బిల్‌పవర్, గుజరాత్ లీజ్ ఫైనాన్సింగ్, తిజరియ పాలిపైప్స్, ఉషా మార్టిన్ ఎడ్యుకేషన్ అండ్ సొల్యూషన్స్, జెనిత్ కంప్యూటర్స్, ప్రదీప్ ఓవర్సీస్, గోల్డ్‌స్టోన్ టెక్నాలజీస్. ఈ షేర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ పేర్కొన్నాయి.