సూచీలకు స్వల్ప లాభాలు
♦ 84 పాయింట్ల లాభంతో 25,773కు సెన్సెక్స్
♦ 22 పాయింట్లు లాభపడి 7,888కు నిఫ్టీ
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు రికవరీ కావడంతో స్టాక్ మార్కెట్ మంగళవారం లాభాల్లో ముగిసింది. లాభాల స్వీకరణతో మధ్యాహ్నం దాకా నష్టపోయిన సూచీలు యూరప్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభం కావడంతో పుంజుకున్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 84 పాయింట్లు లాభపడి 25,773 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 22 పాయింట్ల లాభంతో 7,888 వద్ద ముగిశాయి. లోహ, వాహన షేర్లు నష్టపోగా, క్యాపిటల్ గూడ్స్, ఫార్మా, ఐటీ, బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి.
నష్టాల్లొంచి...లాభాల్లోకి...
డాలర్‌తో జపాన్ కరెన్సీ మారకం రెండు వారాల కనిష్ట స్థాయికి పడిపోవడంతో జపాన్ మార్కెట్ పెరగడం, చైనా ద్రవ్యోల్బణ గణాంకాలు అంచనాల కంటే మెరుగ్గా ఉండడం, యూరోప్ కంపెనీల ఫలితాలు బాగా ఉండటంతో యూరప్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభం కావడం కలసివచ్చాయి. సోమవారం జోరుగా పెరిగిన షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ ఒక దశలో 75 పాయింట్లు నష్టపోయింది. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియడం, యూరప్ మార్కెట్లు పటిష్టంగా ప్రారంభం కావడంతో కొనుగోళ్లు జరిగాయి. పొరిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణ గణాంకాలు రేపు (గురువారం) వెలువడుతున్నందున ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు.
డాక్టర్ రెడ్డీస్ 3 శాతం అప్
డాక్టర్ రెడ్డీస్ షేర్ 3 శాతం లాభపడి రూ.2928 కు చేరింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే.
‘ఉజ్జీవన్’ లిస్టింగ్ లాభాలు
ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్ మార్కెట్ లిస్టింగ్‌లో లాభాలు సాధించింది. ఇష్యూధర(రూ.210)తో పోల్చితే 8 % లాభంతో రూ.227 వద్ద బీఎస్‌ఈలో లిస్టయింది. ఇంట్రాడేలో 16% లాభంతో రూ.244 గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 10% లాభంతో రూ.231 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,738 కోట్లకు చేరింది.