
అమెరికా–ఇరాన్ మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గతవారం ప్రథమార్ధంలో పెరిగిన బంగారం, క్రూడ్ ధరలు మన ఈక్విటీ, కరెన్సీ మార్కెట్లలో కల్లోలం సృష్టించాయి. ఇంతలోనే మధ్యప్రాచ్య ఆందోళనలు చల్లారడంతో ఇటు బంగారం, క్రూడ్ ధరలు దిగివచ్చాయి. రూపాయి విలువ కూడా గణనీయంగా పుంజుకోవడంతో తిరిగి స్టాక్ సూచీలు ర్యాలీ చేయగలిగాయి. అంతర్జాతీయంగా అనూహ్య పరిణామాలేవీ సంభవించకపోతే, మన మార్కెట్లో ఇక బడ్జెట్ అంచనాలు, కార్పొరేట్ ఫలితాలకు అనుగుణంగా ఆయా రంగాలకు చెందిన షేర్లు పెరిగే అవకాశం ఉంది. అయితే స్టాక్ సూచీలను ప్రభావితం చేసే హెవీవెయిట్ షేర్లు మాత్రం ప్రస్తుతం నిస్తేజంగా ట్రేడవుతున్నందున, సెన్సెక్స్, నిఫ్టీలు కొత్త రికార్డుల్ని నెలకొల్పడం అనుమానమే. బ్యాంకింగ్ హెవీవెయిట్లు ప్రకటించే ఫలితాలే సూచీల కదలికలకు కీలకం. ఇక స్వల్పకాలిక సాంకేతికాలు ఇలా వున్నాయి...
సెన్సెక్స్ సాంకేతికాంశాలు...
జనవరి 10తో ముగిసిన వారంలో 40,476–41,775 పాయింట్ల మధ్య 1300 పాయింట్ల మేర తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైన బీఎస్‌ఈ సెన్సెక్స్ చివరకు అంతక్రితం వారం ముగింపుతో పోలిస్తే 135 పాయింట్ల స్వల్పలాభంతో 41,600 పాయింట్ల వద్ద ముగిసింది. గత కొద్దిరోజులుగా 41,700–41,800 శ్రేణి మధ్య పలు దఫాలు అవరోధాన్ని ఎదుర్కొంటున్నందున, ఈ శ్రేణిని ఛేదించి, ముగిసేంతవరకూ కన్సాలిడేషన్ ప్రక్రియ కొనసాగవచ్చు. ఈ వారం సెన్సెక్స్ పెరిగితే పైన ప్రస్తావించిన శ్రేణి తొలుత నిరోధించవచ్చు. ఈ శ్రేణిని భారీ ట్రేడింగ్ పరిమాణంతో దాటితే వేగంగా 41,980 పాయింట్ల వరకూ పెరగవచ్చు. ఈ స్థాయిపైన ముగిస్తే క్రమేపీ 42,300 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. మార్కెట్ క్షీణిస్తే తొలుత 41,450 పాయింట్ల వద్ద మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును కోల్పోతే 41,170 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఈ లోపున 40,860 పాయింట్ల వద్ద మద్దతు పొందవచ్చు.
నిఫ్టీ అవరోధ శ్రేణి 12,300–12,320....
గత వారం ప్రథమార్ధం లో 11,929 పాయింట్ల వరకూ క్షీణించిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ద్వితీయార్థంలో 12,311 పాయింట్ల రికార్డు గరిష్టస్థాయిని తాకింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 30 పాయింట్ల స్వల్పలాభంతో 12,257 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీ పెరిగితే 12,300–320 పాయింట్ల శ్రేణి మధ్య గట్టి అవరోధం కలగవచ్చు. ఈ శ్రేణిని భారీ ట్రేడింగ్ పరిమాణంతో దాటితే అప్‌ట్రెండ్ వేగవంతమై 12,420 పాయింట్ల వద్దకు చేరవచ్చు. అటుపై క్రమేపీ 12,480–12,540 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు. ఈ వారం నిఫ్టీ తగ్గితే 12,210 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతును కోల్పోతే క్రమేపీ 12,130 వద్దకు తగ్గవచ్చు. ఈ లోపున 12,045 పాయింట్ల వరకూ క్షీణత కొనసాగవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment