10,000 ముంగిట నిఫ్టీ
► మేజిక్ ఫిగర్‌ను దాటిన ఆగస్టు నిఫ్టీ ఫ్యూచర్
► సెన్సెక్స్ 217 పాయింట్లు, నిఫ్టీ 51 పాయింట్లు అప్
► సరికొత్త రికార్డుస్థాయిల్లో ముగిసిన సూచీలు
ముంబై: తాజా కొనుగోళ్ల ఫలితంగా ఎన్‌ఎస్‌ఈ ప్రధాన సూచి నిఫ్టీ చరిత్రాత్మక 10,000 పాయింట్ల స్థాయికి చేరువయ్యింది. సోమవారం ఇంట్రాడేలో 9,982 పాయింట్ల కొత్త రికార్డుస్థాయిని తాకిన నిఫ్టీ–50 చివరకు 51 పాయింట్ల పెరుగుదలతో నూతన గరిష్టస్థాయి 9,966 పాయింట్ల వద్ద ముగిసింది. డెరివేటివ్స్ విభాగంలోనైతే ఆగస్టు నెల నిఫ్టీ ఫ్యూచర్ కాంట్రాక్టు 10,000 పాయింట్ల స్థాయిని అధిగమించి 10,013 పాయింట్ల వద్దకు చేరడం విశేషం. అయితే చివర్లో లాభాల స్వీకరణ కారణంగా ఈ ఫ్యూచర్ 9,995 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.
ఇక బీఎస్‌ఈ సెన్సెక్స్ 217 పాయింట్లు ర్యాలీ జరిపి రికార్డు గరిష్టస్థాయి 32,246 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధిరేటు అంచనాల్ని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) 7.2 శాతం వద్ద స్థిరపర్చడం కూడా మార్కెట్‌లో ఉత్సాహాన్ని నింపిందని విశ్లేషకులు తెలిపారు. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధిరేటు
7.7 శాతంగా వుంటుందన్న ఐఎంఎఫ్ అంచనాలతో ఇన్వెస్టర్లు తాజా కొనుగోళ్లు జరిపారని బీఎన్‌పీ పారిబా మ్యూచువల్ ఫండ్ సీనీయర్ ఫండ్ మేనేజర్ కార్తిక్‌రాజ్ లక్ష్మణన్ చెప్పారు.
ఆల్‌టైమ్ హైకి సమీపంలో ఆర్‌ఐఎల్..
స్టాక్ సూచీల తాజా ర్యాలీకి బహుళ వ్యాపారాల దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) నేతృత్వం వహించింది. అంచనాల్ని మించిన ఆర్థిక ఫలితాల్ని వెల్లడించడంతో పాటు రిలయన్స్ జియోఫోన్, బోనస్ షేర్లు, ప్రత్యేక డివిడెండు వంటి అనూహ్య ప్రకటనలతో ఆ కంపెనీ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడంతో శుక్రవారం 4 శాతంవరకూ పెరిగిన ఆర్‌ఐఎల్ తాజాగా మరో 2 శాతం ఎగిసింది. ఇంట్రాడేలో 1,624 వరకూ ర్యాలీ జరిపిన ఆర్‌ఐఎల్ ఆల్‌టైమ్ గరిష్టస్థాయి సమీపానికి చేరింది.
అయితే చివరకు రూ. 1,615 వద్ద ముగిసింది. 2008 జనవరిలో ఈ షేరు నమోదుచేసిన ఆల్‌టైమ్ రికార్డు స్థాయి బీఎస్‌ఈలో 1,626కాగా, ఎన్‌ఎస్‌ఈలో రూ. 1,649. సోమవారం ఆర్థిక ఫలితాల్ని ప్రకటించిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 1.83 శాతం జంప్‌చేసి రూ. 1,738 వద్ద ముగిసింది. టీసీఎస్, భారతి ఎయిర్‌టెల్, ఐటీసీ, ఇన్ఫోసిస్, విప్రో, ఎస్‌బీఐలు 1–2 శాతం మధ్య ర్యాలీ జరిపాయి. మరోవైపు డాక్టర్ రెడ్డీస్ లాబ్, సన్‌ఫార్మా, యాక్సిస్ బ్యాంక్ షేర్లు 1–2.5 శాతం మధ్య నష్టపోయాయి.