పీనోట్లపై తక్షణ నిషేధ యోచనేదీ లేదు: కేంద్రం
న్యూఢిల్లీ : పార్టిసిపేటరీ నోట్స్ (పీ-నోట్స్)పై రాత్రికి రాత్రి నిషేధం విధించే యోచనేదీ ప్రభుత్వానికి లేదని కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ తెలిపారు. పీనోట్స్ నిబంధనలను మరింతగా మెరుగుపర్చడం ఎలాగన్నది ప్రస్తుతం పరిశీలిస్తున్నట్లు ఆయన వివరించారు. దీనిపై నిర్ణయం తీసుకోవడానికి ముందు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లను (ఎఫ్‌ఐఐ) కూడా సంప్రదిస్తామని పేర్కొన్నారు. నల్లధన ప్రవాహానికి అడ్డుకట్ట వేసే దిశగా పీ-నోట్స్ నిబంధనలను సమీక్షించాలంటూ సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సెబీకి సూచించిన దరిమిలా శక్తికాంత దాస్ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది.
భారత స్టాక్‌మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయదల్చుకునే విదేశీ ఇన్వెస్టర్లు పీ-నోట్స్ మార్గంలో ఇన్వెస్ట్ చేస్తారు. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ వద్ద రిజిస్టరయిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలు వీటిని జారీ చేస్తుంటాయి. మేలో రూ. 2.85 లక్షల కోట్ల మేర పీ-నోట్స్ పెట్టుబడులు వచ్చాయి. ఇది ఏడేళ్ల గరిష్టం. అయితే, సిసలైన ఇన్వెస్టరు వివరాలు వెల్లడికాకుండా ఈ మార్గంలో వచ్చే నిధుల్లో బ్లాక్‌మనీ ఉండొచ్చన్న ఆందోళనల నేపథ్యంలో పీ-నోట్స్ నిబంధనలు మరింత కఠినతరం చేయాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది.