200 మందిని తీసేస్తున్న మరో టెక్ దిగ్గజం
టెక్ దిగ్గజాలు ఇటీవల మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా తమ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులపై భారీగా వేటు వేస్తున్నాయి.
టెక్ దిగ్గజాలు ఇటీవల మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా తమ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులపై భారీగా వేటు వేస్తున్నాయి. తాజాగా మరో టెక్ దిగ్గజం నోకియా 200 మందికిపైగా ఉద్యోగులను తీసేస్తున్నట్టు తెలిపింది. తన టెలికాం నెట్ వర్క్ ఈక్విప్ మెంట్ నుంచి డిమాండ్ బలహీనంగా ఉండటంతో 200 మందికి పైగా ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని నిర్ణయించినట్టు పేర్కొంది. అయితే ఈ ఉద్యోగాల కోత ఫిన్లాండ్ లోనే ఉండబోతుంది. 1.3 బిలియన్ డాలర్ల అంతర్జాతీయ ధరల పొదుపు ప్రణాళికలో భాగంగా ఈ కోత పెట్టబోతున్నామని ఈ ఫిన్నిస్ కంపెనీ గురువారం వెల్లడించింది.ఈ మార్కెట్ వాతావరణంలో విజయం పొందాలంటే, వ్యయ నిర్మాణ ప్రక్రియను క్రమబద్దీకరించుకోవాల్సినవసరం ఉందని నోకియా తెలిపింది.
ఈ తాజా ఉద్యోగాల కోత నెట్ వర్క్స్ ఆపరేషన్స్, సపోర్టు ఫంక్షన్లలోనే ఉండబోతున్నట్టు పేర్కొంది. నోకియాకు ఫిన్లాండ్ లో 6100 మంది ఉద్యోగులున్నారు. గ్లోబల్ గా 1,01,000 మంది పనిచేస్తున్నారు. గతేడాదే ఈ కంపెనీ 960 ఉద్యోగాల కోతను తన స్వదేశంలో చేపట్టింది. జర్మనీలో 1400 పొజిషన్లను తీసేస్తామని తెలిపింది. మొత్తంగా అంతర్జాతీయ వ్యాప్తంగా 10,000 నుంచి 15000 మంది ఉద్యోగులను నోకియా తగ్గించుకున్నట్టు ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. అయితే ఈ విషయంపై స్పందించడానికి మాత్రం కంపెనీ అధికార ప్రతినిధి నిరాకరించారు.