
సురక్షితమైన పేమెంట్ యాప్ ఒక్కటీ లేదు
భారత్‌లో డిజిటల్ చెల్లింపుల యాప్స్‌పై క్వాల్‌కామ్
న్యూఢిల్లీ: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం మొబైల్ ఫోన్స్ ద్వారా డిజిటల్ చెల్లింపుల చేయాలంటూ ఊదరగొడుతున్న నేపథ్యంలో భారత్‌లో ఈ తరహా సాధనాలు పూర్తిగా సురక్షితం కాదని చిప్‌సెట్ తయారీ సంస్థ క్వాల్‌కామ్ హెచ్చరించింది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న వాలెట్లు, మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్స్‌లో అత్యుత్తమ స్థాయి భద్రత ప్రమాణాలు గల హార్డ్‌వేర్ ఉండటం లేదని సంస్థ ప్రోడక్ట్ మేనేజ్‌మెంట్ సీనియర్ డైరెక్టర్ చౌదరి తెలిపారు. సాధారణంగానే ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తున్న వాలెట్, బ్యాంకింగ్ యాప్స్‌లో సురక్షితమైన హార్డ్‌వేర్ ఉండదని ఆయన చెప్పారు.
ఎక్కువగా ఆండ్రాయిడ్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే ఈ యాప్స్ నుంచి యూజర్ పాస్‌వర్డ్‌లు చోరీకి గురి కాగలవని తెలిపారు. భారత్‌లోనూ డిజిటల్ వాలెట్లు, మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ పరిస్థితీ ఇదేనన్నారు. దేశంలోనే అత్యధికంగా ప్రాచుర్యం పొందిన డిజిటల్ పేమెంట్ యాప్ కూడా హార్డ్‌వేర్ స్థాయిలో భద్రత ప్రమాణాలు పాటించడం లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మొబైల్ ఫోన్స్ ద్వారా చెల్లింపులు సురక్షితంగా జరిగేలా పాటించాల్సిన ప్రమాణాల విషయంలో డిజిటల్ పేమెంట్స్ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు చౌదరి వివరించారు. డూప్లికేట్ చేయడానికి ఆస్కారమే లేని విధంగా కొత్త ఫీచర్‌తో రూపొందిస్తున్న మొబైల్ చిప్‌సెట్స్‌ను 2017లో అందుబాటులోకి తేనున్నట్లు ఆయన చెప్పారు.