జియో కాల్స్ సునామీని తట్టుకోలేం!
• ఆ స్థాయిలో నెట్‌వర్క్, ఆర్థిక వనరులు మా దగ్గర లేవు
• జియోపై పీఎంవోకు టెల్కోల లేఖ
• పారదర్శక పోటీ నెలకొల్పాలని వినతి
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో నెట్‌వర్క్‌పై దేశీయ ప్రముఖ టెలికం ఆపరేటర్ల సంఘం (సీఓఏఐ) తాజాగా మరోసారి లేఖ రూపంలో ప్రధాన మంత్రి కార్యాలయం తలుపుతట్టింది. జియో నెట్‌వర్క్ నుంచి అసాధారణంగా భారీ స్థాయిలో సునామీ వలే వచ్చి పడే వాయిస్ కాల్స్‌కు అనుసంధానం కల్పించేంత నెట్‌వర్క్ సామర్థ్యం, ఆర్థిక వనరులు తమకు లేవని సీఓఏఐలో భాగమైన ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్ స్పష్టం చేశాయి. తమ నెట్‌వర్క్ నుంచి వచ్చే కాల్స్‌కు ఇతర టెలికం కంపెనీలు అనుసంధానం కల్పించడం లేదని, ఇది చట్ట విరుద్ధమని జియో ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే.
అయితే, పోటీ నిరోధకమైన జియో వాయిస్ కాల్స్ ఇంటర్‌కనెక్ట్ అభ్యర్థనలను ప్రభుత్వం ప్రోత్సహించరాదని సీఓఏఐ సూచించింది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ప్రిన్సిపల్ సెక్రటరీ నృపేంద్ర మిశ్రాకు లేఖ రాసింది. పారదర్శకమైన పోటీ నెలకొల్పే విషయంలో ప్రధాని కార్యాలయం జోక్యం చేసుకోవాలని కోరింది. ఈ నెల 5 నుంచి రిలయన్స్ జియో పూర్తి స్థాయి సేవలు ప్రారంభించిన విషయం తెలిసిందే. జియోలో సభ్యులైన వారు మూడు నెలల పాటు ఈ ఏడాది డిసెంబర్ వరకు అపరిమితంగా ఉచిత కాల్స్, డేటా సేవలు పొందవచ్చని ప్రకటించింది.
జియో కస్టమర్లు ఒక్క వారం వ్యవధిలోనే 5 కోట్ల కాల్స్ ఫెయిలైన సందర్భాలను చవిచూశారంటూ రిలయన్స్ వార్షిక వాటాదారుల సమావేశంలో ముకేశ్ అంబానీ ప్రకటించిన విషయం తెలిసిందే. నిబంధనలను ఉల్లఘించేందుకు జియోకు టెస్టింగ్ అనేది దొడ్డిదారి అని ప్రధాన టెలికం ఆపరేటర్ల ఆరోపణగా ఉంది. సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ (సీఓఏఐ)లో ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్, రిలయన్స్ కమ్యూనికేషన్స్‌తోపాటు రిలయన్స్ జియోకు కూడా సభ్యత్వం ఉంది.