
ఈ-ఫైలింగ్ ఇక మరింత సరళం
ఎలక్ట్రానిక్ రూపంలో ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు పద్ధతిని ఇంకా సులభం చేసి చేరువ చేయడానికి సీబీడీటీ (కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్) మరిన్ని మార్పులు చేస్తోంది...
- ప్రీ-ఫిల్డ్ ఐటీఆర్ ఫామ్స్ జారీకి కసరత్తు
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ రూపంలో ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు పద్ధతిని ఇంకా సులభం చేసి చేరువ చేయడానికి సీబీడీటీ (కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డ్) మరిన్ని మార్పులు చేస్తోంది. ఇందులో భాగంగా ఐటీ రిటర్న్ వేసేవారికి ముందుగానే పూరించిన (ప్రీ ఫిల్డ్) రిటర్న్ ఫారాలు అందుబాటులోకి తేవాలని చూస్తోంది. ఈ ఫారాల్లో సదరు పన్నుదారుకు సంబంధించిన ఆదాయం, ఇతర ముఖ్య వివరాలన్నీ అప్పటికే నింపేసి ఉంటాయి. దీన్ని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అందుబాటులోకి తేవాలని సీబీడీటీ యోచిస్తోంది.
ఈ ఏడాది ఆగస్టులో ఆధార్ నంబరు, ఇం టర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం కార్డు తదితరాల ఆధారంగా ఆన్‌లైన్ ఈ-ఫైలింగ్‌ను, ఈ-వెరిఫికేషన్‌ను ఆరంభించిన ఐటీ శాఖ... తాజాగా ప్రీ-ఫిల్డ్ ఐటీ ఫారాల యోచన చేస్తోంది. రూ.5 లక్షల లోపు సంపాదన ఉండి, రిఫండ్లు లేనివారు ఆన్‌లైన్లో ఫారాలు దాఖలు చేసేటపుడు ఈ-వెరిఫికేషన్ కోడ్ సదరు వ్యక్తి తాలూకు రిజిస్టర్డ్ మెయిల్ ఐడీకి వస్తుంది. దాన్ని ఎంటర్ చేయటం ద్వారా ఆన్‌లైన్లోనే దాఖలు చేయొచ్చు. ఇటీవలే ఈ పద్ధతి అందుబాటులోకి వచ్చింది కూడా. ఈ నేపథ్యంలోనే పన్ను చెల్లింపుదారు ఆదాయం, ఇతర కీలక అంశాల్లో ఏదైనా సవరణలు చేయదలచుకుంటే.. అవి అప్పటికప్పుడు చేసి అప్‌లోడ్ చేసుకునేలా ప్రీ-ఫిల్డ్ ఐటీఆర్ ఫామ్స్‌ను అందుబాటులోకి తేనున్నట్లు సీబీడీటీ చైర్‌పర్సన్ అనితా కపూర్ చెప్పారు.