హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌డీఎల్) పేమెంట్ బ్యాంక్ సేవలను ప్రారంభించనుంది. ఆర్‌బీఐ నుంచి తుది అనుమతులు రావాల్సి ఉందని.. మరో నెల రోజుల్లో ముంబై కేంద్రంగా సేవలను ప్రారంభిస్తామని ఎన్‌ఎస్‌డీఎల్ సీఎండీ జి.వి.నాగేశ్వర్ రావు చెప్పారు.
పోటీ పేమెంట్ బ్యాంకింగ్ సంస్థలతో పోలిస్తే మెరుగైన సేవలందించేందుకు యాప్ ఆధారిత బ్యాంకింగ్ సేవలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. దీని ప్రత్యేకత ఏంటంటే.. నగదు లావాదేవీలతో పాటూ వాలెట్, సినిమా, ట్రావెల్ టికెట్లు ఇతరత్రా సేవలను వినియోగించుకునే వీలుంటుందని నాగేశ్వర్ రావు వెల్లడించారు.
స్టడీ సర్టిఫికెట్లు డిజిటల్ రూపంలో..
ఎన్‌ఎస్‌డీఎల్ నేషనల్ అకడమిక్ డిపాజిటరీ (ఎన్‌ఏడీ) సేవలను కూడా అందిస్తోంది. పాఠశాలలు, కళాశాలకు చెందిన అన్ని సర్టిఫికెట్లు ఎలక్ట్రానిక్ రూపంలో భద్రపర్చడమే దీని పని. ప్రతి విద్యార్థికి ప్రత్యేకంగా ఖాతా ఉంటుంది. ఇది అకడమిక్ స్థాయిలో పూర్తిగా ఉచితమని.. ఆ తర్వాత రుణాలు, ఇతరత్రా కార్యకలాపాల కోసం వినియోగిస్తే మాత్రం కొంత చార్జీ ఉంటుందని రావు తెలిపారు.
ప్రస్తుతం దేశంలోని సీబీఎస్‌ఈతో పాటూ 40 యూనివర్సిటీలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమయ్యాయని.. ఇప్పటివరకు 50 లక్షల సర్టిఫికెట్లను భద్రపరిచామని తెలియజేశారు. మరో 300 యూనివర్సిటీలతో ఒప్పందం చేసుకోనున్నామని.. వచ్చే రెండేళ్లలో దేశంలోని అన్ని విద్యా సంస్థలూ ఎన్‌ఏడీలో భాగస్వాములవుతాయని ధీమావ్యక్తం చేశారు. ఎన్‌ఏడీతో నకిలీ, ఫోర్జరీ సర్టిఫికెట్ల సమస్య ఉండదని.. పైగా విదేశీ విద్యా, రుణాల మంజూరు త్వరితగతిన పూర్తవుతుందని చెప్పారాయన.
స్టాక్ మార్కెట్లో తెలంగాణ నుంచి రూ.5,400 కోట్లు
ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో రోజుకు నగదు ప్రవాహం రూ.45 వేల కోట్లుగా ఉంటుంది. ఇందులో దక్షిణాది రాష్ట్రాల నుంచి 11–12 వేల కోట్లుంటుందని కొటక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ (కేఎస్‌ఎల్) సీఎండీ కమలేశ్ రావు తెలిపారు.
రాష్ట్రాల వారీగా చూస్తే తెలంగాణ నుంచి రూ.5,400 కోట్లు ఉంటుందని.. ఇందులో 10 శాతం నగదు ప్రవాహం కోటక్ నుంచి జరుగుతుందని కమలేశ్ చెప్పారు. ప్రస్తుతం దేశంలో కేఎస్‌ఎల్‌కు 16 లక్షల మంది కస్టమర్లున్నారని.. 18 నెలల్లో రెండింతలకు చేర్చాలని లకి‡్ష్యంచామని పేర్కొన్నారు. కొటక్ మహీంద్రా బ్యాంక్ అనుబంధ సంస్థే ఈ కేఎస్‌ఎల్.. బుధవారమిక్కడ ఫ్రీ ఇంట్రాడే ట్రేడింగ్ సేవలను ప్రారంభించింది. వార్షిక సబ్‌స్క్రిప్షన్ చార్జీ రూ.999.
Comments
Please login to add a commentAdd a comment