న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆయిల్ ఇండియా కంపెనీ... ఈ ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్‌లో రూ.703 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో సాధించిన నికర లాభం రూ.450 కోట్లతో పోలిస్తే 56 శాతం వృద్ధి సాధించామని ఆయిల్ ఇండియా తెలిపింది. చమురు ధరలు పెరగడం కలసివచ్చిందని వెల్లడించింది. ఒక్కో షేర్ పరంగా చూస్తే, గత క్యూ1లో రూ.450 కోట్లుగా (ఈపీఎస్ రూ.3.84) ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.730.22 కోట్లకు (ఈపీఎస్ రూ.6.20) పెరిగిందని పేర్కొంది.
ఆదాయం 45 శాతం వృద్ధితో రూ.3,390 కోట్లకు చేరింది. ఈ క్యూ1లో ముడి చమురు విక్రయ ఆదాయం 53 శాతం పెరిగి రూ.2,778 కోట్లకు చేరుకుంది. ఈ విభాగం లాభం దాదాపు రెట్టింపై రూ.1,136 కోట్లకు ఎగసింది. సహజ వాయువుకు సంబంధించిన ఆదాయం 25 శాతం వృద్ధితో రూ.443 కోట్లకు, స్థూల లాభం కూడా 25 శాతం వృద్ధితో రూ.119 కోట్లకు పెరిగాయని కంపెనీ వివరించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఆయిల్ ఇండియా షేర్ 1 శాతం నష్టంతో రూ. 212 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment