సాక్షి, సిటీబ్యూరో: సిటీలో ఓలా క్యాబ్‌లు పరుగులు తీస్తున్నాయి. ప్రధాన రవాణా కేంద్రాల నుంచి చివరి మైలు వరకు ప్రయాణికులను చేరవేసేందుకు ప్రవేశపెట్టిన క్యాబ్ సేవలకు అనూహ్యమైన ఆదరణ లభిస్తోంది. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో సుమారు 3 నుంచి 5 లక్షల మంది ప్రయాణికులు చివరి మైలు క్యాబ్ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నట్లు అంచనా. ఇందుకోసం సుమారు 25 వేల క్యాబ్‌లు ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. నగరంలో ప్రతిష్టాతక్మంగా ఏర్పాటు చేసిన మెట్రో రైలు సేవలను అన్ని వర్గాల ప్రయాణికులకు చేరువచేసేందుకు మెట్రో కారిడార్‌లకు రెండు వైపులా అన్ని కాలనీలకు, ప్రధాన ప్రాంతాలకు చివరి మైలు కనెక్టివిటీ తప్పనిసరిగా మారింది. ఈ మేరకు సిటీ బస్సులు, ఆటోలు అందుబాటులో ఉన్నప్పటికీ అవి ప్రయాణికులకు పూర్తిస్థాయిలో చేరువకాలేకపోయాయి. ఇంటి నుంచి నేరుగా మెట్రో స్టేషన్‌కు చేరుకొనేందుకు, తిరిగి ఇళ్లకు చేరుకొనేందుకు అవసరమైన లాస్ట్‌మైల్ కనెక్టివిటీని ఓలా సద్వినియోగం చేసుకుంది. దీంతో అదేస్థాయిలో ప్రయాణికుల నుంచి ఆదరణ లభిస్తున్నట్లు ఆ సంస్థ అధికారవర్గాలు తెలిపాయి. ఎలాంటి కాలయాపన లేకుండా క్యాబ్ బుక్ చేసుకొన్న రెండు నిమిషాల వ్యవధిలోనే ప్రయాణికుడికి అందుబాటులోకి వచ్చే విధంగా చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి.
ట్రాన్స్‌పోర్ట్ హబ్‌లలో కియోస్క్‌లు..
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతిరోజూ సుమారు 8 వేలకుపైగా క్యాబ్‌లు, ట్రావెల్స్ వాహనాలు వివిధ ప్రాంతాలకు బయలుదేరుతాయి. సుమారు 40 వేల మందికిపైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ డిమాండ్‌ను అందుకోవడంలో ఓలా ప్రవేశపెట్టిన కియోస్క్‌లు, ఓలా జోన్‌లు సత్ఫలితాలనిచ్చినట్లు ఆ సంస్థ తెలిపింది. విమానం దిగిన ప్రయాణికుడు నేరుగా ఓలా కియోస్క్ వద్దకు వచ్చి తన మొబైల్ నంబర్, వెళ్లాల్సిన గమ్యస్థానం చెబితే చాలు కేవలం రెండు నిమిషాలలోపే క్యాబ్ వచ్చేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. దీంతో ప్రయాణికులు ఎక్కువ శాతం ఓలా వైపు మొగ్గు చూపుతున్నారు. ఓలా జోన్‌లలో 24 గంటల పాటు క్యాబ్‌లు ఉండేలా జాగ్రత్తలు పాటించడంతో ప్రయాణికులకు ఏ సమయంలోనైనా కోరిన వెంటనే క్యాబ్ లభిస్తుందనే నమ్మకం ఏర్పడింది. ఇది తమ సంస్థను ప్రయాణికులకు బాగా చేరువ చేసిందని ఆ సంస్థ ప్రతినిధి చెప్పారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద కియోస్క్‌లు ఏర్పాటు చేయడమే కాకుండా లాస్ట్‌మైల్ కనెక్టివిటీకి ఎయిర్‌పోర్టు వర్గాలతో కుదుర్చుకున్న అవగాహన సైతం క్యాబ్ సర్వీసుల పెంపునకు దోహదం చేసింది.
సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్‌లు, నగరంలోని అన్ని మెట్రో స్టేషన్‌ల వద్ద కియోస్క్‌లను ఏర్పాటు చేశారు. ఈ కియోస్క్‌ల వద్ద ఓలా సిబ్బంది నిరంతరం విధులు నిర్వహిస్తారు. తమ మొబైల్ ఫోన్‌లలో ఓలా యాప్ నుంచి బుక్ చేసుకోలేని ప్రయాణికులకు కియోస్క్‌లలో బుకింగ్ సదుపాయం ఉంటుంది. అలాగే క్యాబ్ బుక్ చేసిన క్షణాల్లోనే వచ్చి వాలుతుంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ప్రతి రోజు సుమారు లక్షా 80 వేల మంది రాకపోకలు సాగిస్తారు. కనీసం 25 వేల మంది వరకు ఓలా సేవలను వినియోగించుకుంటున్నట్లు అంచనా. నాంపల్లి, కాచిగూడ స్టేషన్‌ల నుంచి కూడా ఓలా కియోస్క్ ఆధారిత క్యాబ్ సర్వీసులకు చక్కటి ఆదరణ లభిస్తోంది. వీటితో పాటు జూబ్లీ, మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లు, దిల్‌సుఖ్‌నగర్, మెహిదీపట్నం, అమీర్‌పేట్, లక్డీకాపూల్ వంటి ప్రధాన ప్రయాణ కూడళ్లు ఓలా సర్వీసులకు కేంద్రంగా మారాయి. ఎంజీబీఎస్‌లో కూడా ఓలా జోన్, ఓలా కియోస్క్ ఏర్పాటు చేశారు.
త్వరలో మరిన్ని సర్వీసులు..
మియాపూర్ నుంచి అమీర్‌పేట్ వరకు, ఉప్పల్ నుంచి అమీర్‌పేట్ వరకు ప్రస్తుత మెట్రో కారిడార్‌లో, ఎల్‌బీనగర్ నుంచి అమీర్‌పేట్ మార్గంలోనూ లాస్ట్‌మైల్ కనెక్టివిటీకి చేపట్టిన చర్యలు ఫలితాలలిస్తున్న నేపథ్యంలో తమ క్యాబ్ సర్వీసులను మరింత విస్తరించనున్నట్లు ఓలా కమ్యూనికేషన్స్ ప్రతినిధి అమోఘ్ తెలిపారు. ‘దేశంలోని అన్ని మెట్రోపాలిటన్ నగరాలకు దీటుగా హైదరాబాద్‌లో ఓలా క్యాబ్ పరుగులు తీస్తోంది. ఎప్పటికప్పుడు ప్రయాణికుల డిమాండ్, అభిరుచికి అనుగుణంగా ప్రణాళికలను రూపొందిస్తున్నాం’ అని ఆయన చెప్పారు. మరికొద్ది నెలల్లో ఎలక్ట్రిక్ క్యాబ్‌లను కూడా హైదరాబాద్‌లో ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment