కేజీ బేసిన్లో ఓఎన్జీసీ లాభాలకు గండి!!
♦ ఆదాయ నష్టం రోజుకు రూ.60 కోట్ల పైమాటే
♦ వృద్ధి లేని క్రూడ్ ధరలు; పూర్తి కాని గెయిల్ పైపులైన్లు
♦ పునరుద్ధరణకు నోచుకోని గ్యాస్ సరఫరా
సాక్షి ప్రతినిధి, కాకినాడ : కృష్ణా, గోదావరి బేసిన్‌లో ఓఎన్‌జీసీ లాభాలు దాదాపు 50 శాతం పడిపోయాయి. అంచనాలకు తగ్గట్టు చమురు, సహజవాయువు వెలికి తీయలేకపోవడం, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పతనం కావడం, ‘నగరం’ గ్యాస్ పైపులైన్ పేలుడు జరిగాక ఇంతవరకూ పునరుద్ధరణకు నోచని పైపులైన్లు... ఈ పరిణామాలన్నీ కంపెనీ లాభాలపై ప్రభావం చూపుతున్నాయి. కేజీ బేసిన్లో రోజుకు 1400 ఘనపు మీటర్ల ముడిచమురు ఉత్పత్తి జరుగుతోంది. ఇందులో అత్యధికంగా కోనసీమలోని కేశనపల్లి స్ట్రక్చర్‌లో 700 ఘనపు మీటర్లు ఉత్పత్తి అవుతుండగా... అమలాపురం సమీపానగోపవరం స్ట్రక్చర్‌లో 400 ఘ.మీ., కేజీ బేసిన్‌లోని మిగిలిన అన్ని స్ట్రక్చర్లలో కలిపి 300 ఘనపు మీటర్లు ముడిచమురు ఉత్పత్తి అవుతోంది.
నగరం పేలుడుతో మొదలైన ఇబ్బందులు
2014లో కోనసీమలోని నగరం గ్రామంలో గెయిల్ పైప్‌లైన్ పేలటంతో ఇబ్బందులు మొదలయ్యాయి. ఆ ఏడాది చివరిలో అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పడిపోవడంతో అప్పటినుంచీ ఓఎన్‌జీసీ లాభాల్లో కోతపడుతోంది. క్రూడాయిల్ ధర తగ్గటంతో లాభాలు తగ్గటం నిజమేనని, అయితే పూర్తిస్థాయిలో చమురు సరఫరా జరిగితే చాలావరకూ సర్దుబాటు అయ్యేవని ఓఎన్‌జీసీ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి నగరం పేలుడుకు ముందు కేజీ బేసిన్లో రోజుకు 3.2 మిలియన్ ఎంసీఎండీ గ్యాస్‌ను గెయిల్‌కు ఓఎన్‌జీసీ విక్రయించేది. ప్రస్తుతం రోజుకు 1.8 మిలియన్ ఎంసీఎండీ గ్యాస్‌ను మాత్రమే విక్రయిస్తోంది.
మరో 1.4 మిలియన్ ఎంసీఎండీ గ్యాస్ సరఫరా... ఇంకా పునరుద్ధరణకు నోచుకోలేదు. కేశవదాసుపాలెం - కొవ్వూరు ప్రధాన ట్రంక్‌లైన్ సామర్థ్యం కొద్దోగొప్పో బాగుండడంతో ఆ మేరకైనా గ్యాస్ సరఫరా జరుగుతోంది. కాకినాడ-తాటిపాక ట్రంక్ పైపులైన్ మార్పు చేయగా, దిండి - తాటిపాక పనులు చివరి దశలో ఉన్నాయి. పాశర్లపూడి - తాటిపాక, దిండి - విజయవాడ ప్రధాన ట్రంక్ లైన్ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. ఈ కారణాలతో కేజీ బేసిన్లో ఓఎన్‌జీసీ ఆదాయం 50 శాతం (రోజుకు ఆదాయం అంచనా రూ.120 కోట్లు) అంటే రోజుకు రూ.60 కోట్ల మేర తగ్గిపోయింది.
నాగాయలంకలో వెనకడుగు
క్రూడాయిల్ ధర పతనమైన ప్రభావం కేజీ బేసిన్‌లోని నాగాయలంకలో చమురు నిక్షేపాల వెలికితీతపై పడింది. 2014లో నాగాయలంకలో ఓఎన్‌జీసీ భారీ గా చమురు నిక్షేపాలను గుర్తించింది. కెయిర్న్ ఎనర్జీ సంస్థ సంయుక్త భాగస్వామ్యంతో ఈ నిక్షేపాలను వెలికి తీయాలని అప్పట్లో ఒప్పందం కుదిరింది. డ్రిల్లింగ్‌కు సమాయత్తమయ్యే దశలో.. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర పతనమైంది. దీంతో నాగాయలంకలో నిక్షేపాల వెలికితీతకు ఫుల్‌స్టాప్ పడింది. నాగాయలంక చమురు క్షేత్రంలో రోజుకు 700 ఘనపు మీటర్ల ముడిచమురు, 2 మిలియన్ల ఎంసీఎండీ గ్యాస్ వెలికి తీయవచ్చునని ఓఎన్‌జీసీ అప్పట్లో అంచనా వేసింది. ఇందుకు రూ.3 వేల కోట్లు పెట్టుబడి అంచనా. క్రూడ్ ధర తగ్గిన నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ ప్రణాళికలకు విరామమిచ్చేశారు.