12 బ్యాంకులే మంచి కస్టమర్ సేవలు, మిగతావీ?
12 బ్యాంకులే మంచి కస్టమర్ సేవలు, మిగతావీ?
Published Tue, Jun 13 2017 8:19 PM | Last Updated on Tue, Sep 5 2017 1:31 PM
ముంబై : దేశంలో ఉన్న మొత్తం 54 బ్యాంకుల్లో కేవలం 12 బ్యాంకులే మంచి కస్టమర్ సర్వీసులు అందజేస్తున్నాయట. బ్యాంకింగ్ కోడ్స్, స్టాండర్డ్స్ బోర్డు ఆఫ్ ఇండియా(బీసీఎస్బీఐ) కోడ్స్ రేటింగ్ లో ఈ విషయం వెల్లడైంది. మంచి బ్యాంకింగ్ పద్ధతులను, కనీస ప్రమాణాలను సాధించుట, పారదర్శకతను పెంచడానికీ, అధిక ఆపరేటింగ్ లాభాలను పొందడానికి, బ్యాకింగ్-కస్టమర్ సేవలను ప్రోత్సహించడానికి బీసీఎస్బీఐను ఆర్బీఐ ఏర్పాటుచేసింది. ఇది ఒక స్వతంత్ర సంస్థ. ఈ కోడ్స్ రేటింగ్ లో 'అధిక' రేటింగ్ పొందిన బ్యాంకుల్లో ప్రభుత్వ రంగ బ్యాంకు కేవలం ఒకటే ఉంది. అది ఐడీబీఐ బ్యాంకు. మిగతా బ్యాంకులన్నీ ప్రైవేట్ రంగ, విదేశీ బ్యాంకులే.
అధిక రేటింగ్ పొందిన బ్యాంకుల్లో ఆర్బీఎల్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, డీసీబీ బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంకు, కొటక్ మహింద్రా బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, యస్ బ్యాంకు, స్టాండర్డ్ చార్టడ్ బ్యాంకు, హెచ్ఎస్బీసీ, సిటీ బ్యాంకులు ఉన్నాయి. ఆర్బీఎల్ బ్యాంకు అత్యధికంగా 95 శాతం స్కోరును సాధించింది. మిగతా బ్యాంకులు సగటు కంటే ఎక్కువ, సగటు మధ్యలో స్కోర్లను పొందాయి. మొత్తంగా బ్యాంకుల సగటు స్కోర్ 2015 కంటే 2017లో స్వల్పంగా పడిపోయి 77గా ఉంది.
మొత్తంగా సగటు స్కోర్ పడిపోవడమే కాకుండా, కొన్ని బ్యాంకులు డౌన్ గ్రేడ్ పొందాయని బీసీఎస్బీఐ చైర్మన్ ఏసీ మహంజన్ తెలిపారు. కస్టమర్లను కాపాడుకోవడానికి బ్యాంకింగ్ రంగంలో తీవ్ర పోటీ నెలకొందన్నారు. ఈ రేటింగ్ లో అన్ని ప్రైవేట్, పబ్లిక్, విదేశీ, షెడ్యూల్డ్ అర్బన్ కోపరేటివ్ బ్యాంకులను తీసుకుంటారు. సమాచారాన్ని అందించుట, పారదర్శకత, సమస్యల పరిష్కారం, కస్టమర్ సెంట్రిసిటీ, కస్టమర్ ఫీడ్ బ్యాక్ కు అనుగుణంగా ఈ రేటింగ్ ను ఇస్తారు.
Advertisement
Advertisement