హైదరాబాద్, విజయవాడల్లో ఒరాకిల్ స్టార్టప్ ఇంక్యుబేటర్లు
ముంబై: ఐటీ దిగ్గజం ఒరాకిల్ దేశవ్యాప్తంగా తొమ్మిది స్టార్టప్ ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేయనున్నది. హైదరాబాద్, విజయవాడలతో పాటు మరో ఆరు నగరాల్లో ఒరాకిల్ స్టార్టప్ క్లౌడ్ యాక్సిలిటరేర్ పేరుతో ఈ స్టార్టప్ ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేయనున్నామని ఒరాకిల్ సంస్థ తెలిపింది. వృద్ధిలోకి వస్తున్న ఎంటర్‌ప్రెన్యూర్లకు తగిన మార్గదర్శకత్వం అందించడం, వృద్ధి చెందుతున్న కంపెనీలకు ఉత్తమ టెక్నాలజీని అందించడం లక్ష్యాలుగా ఈ ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపింది.
క్లౌడ్ టెక్నాలజీ పెద్ద కంపెనీలకే కాకుండా చిన్న చిన్న వ్యాపార సంస్థలకు ఉపయోగపడేలా చూడడం, దేశాన్ని మార్చే బిజినెస్ ఐడియాలున్న ప్రతి వ్యక్తి క్లౌడ్ టెక్నాలజీని అందుబాటులోకి తేవడం తమ లక్ష్యమని ఒరాకిల్ ప్రెసిడెంట్ థామస్ కురియన్ చెప్పారు. చిన్న సంస్థలకు మార్గదర్శకత్వం వహించడం కీలకమైన అంశమని, విజయవంతమైన స్టార్టప్‌లను నిర్వహించిన సీఈఓలు, వెంచర్ క్యాపిట్ పండ్స్ సూచనలు, సలహాలను ఈ ఇంక్యుబేటర్లు అందిస్తాయని వివరించారు.
ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ సేవలందిస్తున్నప్పటికీ ఇలాంటి ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారని పేర్కొన్నారు. బెంగళూరులో తొలి స్టార్టప్ ఇంక్యుబేటర్‌ను నేడు(శుక్రవారం) ఏర్పాటు చేస్తామని కురియన్ తెలిపారు.