పాయ్ ఇంటర్నేషనల్ నుంచి ఎల్ఈడీ టీవీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రానిక్స్ రిటైల్ సంస్థ పాయ్ ఇంటర్నేషనల్ తాజాగా ఎల్‌ఈడీ టీవీలను ప్రవేశపెట్టనుంది. ‘హెన్రీ’ పేరిట వీటిని ఈ పండుగ సీజన్‌లో అందుబాటులోకి తేనున్నట్లు సంస్థ ఎండీ రాజ్‌కుమార్ పాయ్ చెప్పారు. ఇందుకోసం సుమారు రూ. 40-50 కోట్లు వెచ్చిస్తున్నామని ఆయన తెలిపారు. మరోవైపు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ. 1,200 కోట్ల టర్నోవరు లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాజ్‌కుమార్ శుక్రవారమిక్కడ విలేకరులకు తెలిపారు.
2015-16లో టర్నోవరు రూ. 890 కోట్లు. ప్రస్తుతం మొత్తం 80 స్టోర్స్ ఉన్నాయని, ఏటా 10-15 షోరూమ్‌లు నెలకొల్పడంపై దృష్టి పెడుతున్నామని ఆయన వివరించారు. ఇందుకు అవసరమయ్యే నిధులను ప్రస్తుతం అంతర్గతంగాను, బ్యాంకు రుణాల రూపంలోనూ సమకూర్చుకుంటున్నామన్నారు. విస్తరణ ప్రణాళికల అవసరాలను బట్టి వీసీల (వెంచర్ క్యాపిటలిస్టులు) నుంచి దాదాపు రూ. 500 కోట్లు సమీకరించే అవకాశాలున్నాయని ఆయన తెలిపారు.
హైదరాబాద్‌లో నేడు 6 షోరూమ్‌లు ప్రారంభం.. : కొత్తగా హైదరాబాద్‌లో మరో ఆరు షోరూమ్‌లు శనివారం ప్రారంభిస్తున్నట్లు రాజ్‌కుమార్ తెలిపారు. వీటితో కలిపి తెలంగాణంలో తమకు మొత్తం 15 స్టోర్స్ ఉన్నట్లవుతుందని, దశలవారీగా వీటిని 25కి పెంచుకోనున్నామని ఆయన తెలిపారు. ఒక్కో షోరూమ్‌కు రూ. 3-5 కోట్ల దాకా వెచ్చిస్తున్నట్లు వివరించారు. అటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా త్వరలో కార్యకలాపాలు విస్తరించనున్నట్లు రాజ్‌కుమార్ పాయ్ చెప్పారు.