షినెల్‌ హెన్రీ హిట్టింగ్‌ | UP Warriors beat Delhi Capitals in Womens Premier League | Sakshi
Sakshi News home page

షినెల్‌ హెన్రీ హిట్టింగ్‌

Published Sun, Feb 23 2025 4:01 AM | Last Updated on Sun, Feb 23 2025 4:01 AM

UP Warriors beat Delhi Capitals in Womens Premier League

సిక్సర్లతో విజృంభించిన విండీస్‌ ఆల్‌రౌండర్‌ 

23 బంతుల్లో 2 ఫోర్లు, 8 సిక్స్‌లతో 62 పరుగులు 

ఢిల్లీ క్యాపిటల్స్‌పై యూపీ వారియర్స్‌ విజయం 

‘హ్యాట్రిక్‌’ తీసిన గ్రేస్‌ హ్యారిస్‌  

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ 

బెంగళూరు: ఆల్‌రౌండర్‌ షినెల్‌ హెన్రీ (23 బంతుల్లో 62; 2 ఫోర్లు, 8 సిక్స్‌లు) భారీ షాట్లతో వీర విహారం చేయడంతో మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) టి20 టోర్నమెంట్‌లో యూపీ వారియర్స్‌ జట్టు తొలి విజయం నమోదు చేసుకుంది. శనివారం జరిగిన పోరులో యూపీ వారియర్స్‌ 33 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. గత రెండు మ్యాచ్‌ల్లో పరాజయాలు చవిచూసిన యూపీ వారియర్స్‌ ఈ పోరులో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకుంది. 

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన యూపీ వారియర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన హెన్రీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. గత మ్యాచ్‌లోనే తన పవర్‌ హిట్టింగ్‌ను ప్రపంచానికి చాటిన హెన్రీ... ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలింగ్‌ను ఊచకోత కోసింది. కెపె్టన్‌ దీప్తి శర్మ (13), తహిల మెక్‌గ్రాత్‌ (24), శ్వేత సెహ్రావత్‌ (11), కిరణ్‌ నవగిరె (17) భారీ స్కోర్లు చేయలేకపోయారు. 

దినేశ్‌ వృందా (4), గ్రేస్‌ హ్యారిస్‌ (2), ఉమ ఛెత్రీ (3) విఫలమయ్యారు. ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్లలో జెస్‌ జాన్సన్‌ 4 వికెట్లు పడగొట్టగా... తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి, మరిజానె కాప్‌ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు 19.3 ఓవర్లలో 144 పరుగులకు ఆలౌటైంది. జెమీమా రోడ్రిగ్స్‌ (35 బంతుల్లో 56; 8 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధశతకంతో పోరాడినా ఫలితం లేకపోయింది. 

కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ (5), మరిజానె కాప్‌ (9), అనాబెల్‌ సదర్లాండ్‌ (5), జెస్‌ జాన్సెన్‌ (5), సారా బ్రైస్‌ (5) విఫలమయ్యారు. యూపీ వారియర్స్‌ బౌలర్లలో గ్రేస్‌ హ్యారిస్‌ ‘హ్యాట్రిక్‌’ సహా 4 వికెట్లు పడగొట్టగా...  క్రాంతి గౌడ్‌ 4 వికెట్లు ఖాతాలో వేసుకుంది. షినెల్‌ హెన్రీకి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. లీగ్‌లో నేడు విశ్రాంతి రోజు కాగా... సోమవారం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ)తో యూపీ వారియర్స్‌ తలపడుతుంది.  

హెన్రీ రికార్డు ఫిఫ్టీ 
తాజా సీజన్‌లో పాయింట్ల ఖాతా తెరిచేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న యూపీ వారియర్స్‌ ఎట్టకేలకు శుభారంభం చేసింది. బ్యాటింగ్‌లో హెన్రీ మెరుపులకు బౌలింగ్‌లో గ్రేస్‌ హ్యారిస్‌ ‘హ్యాట్రిక్‌’, క్రాంతి గౌడ్‌ మెరుపులు తోడవడంతో వారియర్స్‌ లీగ్‌లో తొలి విజయం నమోదు చేసుకుంది. టాపార్డర్‌ పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో యూపీ జట్టు 14 ఓవర్లు ముగిసేసరికి 91/6తో నిలిచింది. 

వారియర్స్‌ జట్టు మిగిలిన ఆరు ఓవర్లలో మహా అయితే మరో 30 పరుగులు చేస్తుందేమో అనుకుంటే... హెన్రీ సుడిగాలిలా చెలరేగిపోయింది. శిఖా పాండే వేసిన 17వ ఓవర్‌లో 4,6,6 బాదిన హెన్రీ... 18వ ఓవర్‌లో మరో ఫోర్‌ కొట్టింది. ఇక అరుంధతి వేసిన 19వ ఓవర్‌లో మూడు సిక్సర్లతో విజృంభించింది. 

ఈ క్రమంలో హెన్రీ 18 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకుంది. డబ్ల్యూపీఎల్‌ 2023 సీజన్‌లో సోఫియా డాంక్లీ కూడా 18 బంతుల్లో హాఫ్‌సెంచరీ చేసింది. హెన్రీ దూకుడుతో చివరి నాలుగు ఓవర్లలో యూపీ వారియర్స్‌ జట్టు 67 పరుగులు పిండుకుంది. డబ్ల్యూపీఎల్‌లో ఇది రెండో అత్యధికం. 
 
హ్యారిస్‌ హ్యాట్రిక్‌ 
ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు  ఆకట్టుకోలేకపోయింది. జెమీమా రోడ్రిగ్స్‌ హాఫ్‌సెంచరీతో ఒంటరి పోరాటం చేయగా... తక్కిన వాళ్లు ప్రభావం చూపలేకపోయారు. యువ మీడియం పేసర్‌ క్రాంతి గౌడ్‌ ధాటికి ఢిల్లీ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. షఫాలీ వర్మ (30 బంతుల్లో 24; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించినా... వేగంగా ఆడలేకపోయింది. 

బ్యాటింగ్‌లో రాణించిన హెన్రీ బంతితోనూ మెరిసి మరిజానె కాప్‌ను ఔట్‌ చేసింది. ఇక ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో గ్రేస్‌ హ్యారిస్‌ ‘హ్యాట్రిక్‌’ నమోదు చేసుకుంది. 20వ ఓవర్‌ తొలి బంతికి నికీ ప్రసాద్‌ (18) క్యాచ్‌ ఔట్‌ కాగా... రెండో బంతికి అరుంధతి (0), మూడో బంతికి మిన్ను మణి (0) గోల్డెన్‌ డకౌట్‌గా పెవిలియన్‌ చేరారు.  

స్కోరు వివరాలు 
యూపీ వారియర్స్‌ ఇన్నింగ్స్‌: కిరణ్‌ నవగిరె (సి) నికీ (బి) అరుంధతి  17; దినేశ్‌ వృందా (సి) సారా (బి) మరిజానె కాప్‌ 4;దీప్తి (సి) నికీ (బి) జెస్‌ జాన్సెన్‌ 13; తహిల మెక్‌గ్రాత్‌ (సి) అనాబెల్‌ (బి) జెస్‌ జాన్సెన్‌ 24; శ్వేతా సెహ్రావత్‌ (బి) అరుంధతి 11; గ్రేస్‌ హ్యారిస్‌ (బి) మరిజానె కాప్‌ 2; ఉమ (సి) సారా(బి) శిఖ 3; షినెల్‌ హెన్రీ (సి) జెమీమా (బి) జెస్‌ జాన్సెన్‌ 62; సోఫియా (సి) మరిజానె కాప్‌ (బి) జెస్‌ జాన్సెన్‌ 12; సైమా ఠాకూర్‌ (నాటౌట్‌) 4; ఎక్స్‌ట్రాలు 25; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 177. వికెట్ల పతనం: 1–17, 2–38, 3–61, 4–79, 5–84, 6–89, 7–109, 8–166, 9–177, బౌలింగ్‌: మరిజానె కాప్‌ 4–0–18–2; శిఖ పాండే 4–0–39–1; అనాబెల్‌ సదర్లాండ్‌ 4–0–30–0; అరుంధతి రెడ్డి 4–0–52–2; జెస్‌ జాన్సెన్‌ 4–0–31–4. 
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: షఫాలీ వర్మ (సి) సైమా(బి) క్రాంతి గౌడ్‌ 24; మెగ్‌ లానింగ్‌ (బి) క్రాంతి గౌడ్‌ 5; జెమీమా (సి) దీప్తి (బి) క్రాంతి గౌడ్‌ 56; మరిజానె కాప్‌ (సి) సోఫియా (బి) హెన్రీ 9; అనాబెల్‌ (సి) దీప్తి (బి) గ్రేస్‌ హ్యారిస్‌ 5; జెస్‌ జాన్సెన్‌ (సి అండ్‌ బి) క్రాంతి గౌడ్‌ 5; సారా (స్టంప్డ్‌) ఉమ (బి) దీప్తి 5; నికీ (సి) హెన్రీ (బి) గ్రేస్‌ 18, శిఖ (నాటౌట్‌) 15; అరుంధతి రెడ్డి (సి) శ్వేత (బి) గ్రేస్‌ 0; మిన్ను మణి (సి అండ్‌ బి) గ్రేస్‌ 0; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం: (19.3 ఓవర్లలో ఆలౌట్‌) 144. వికెట్ల పతనం: 1–26, 2–43, 3–76, 4–97, 5–106, 6–111, 7–111, 8–144, 9–144, 10–144, బౌలింగ్‌: షినెల్‌ హెన్రీ 4–0–42–1; సోఫియా 4–0–28–0; క్రాంతి గౌడ్‌ 4–0–25–4; గ్రేస్‌ హ్యారిస్‌ 223–0–15–4; దీప్తి శర్మ 4–0–25–1; తహిల మెక్‌గ్రాత్‌ 1–0–9–0. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement